రాజకీయం అంటే అధికారం అనేలా నేటి రాజకీయ నాయకులు అనేకమంది ప్రవర్తిస్తున్నారు. చిన్న వార్డ్ పదవి వస్తే చాలు.. కార్లు, హోదాలు, చుట్టూ మందీ మార్బలంతో నానా హడావుడి చేస్తుంటారు. అధికార దర్పం ప్రదర్శిస్తుంటారు. కానీ రాజకీయం అంటే సేవ అని నిరూపించిన పాత తరం నాయకులు ఎందరో ఉన్నారు. ఆస్తులు, అంతస్తులు కాదు.. నీతి నిజాయితీలే నేతలకు ఆభరణాలని భావించి జీవితాంతం ఆ ఆదర్శాలకు కట్టుబడిన నేతలు చరిత్రలో చాలామంది ఉన్నారు. ఒక పుచ్చలపల్లి సుందరయ్య, ఒక గుమ్మడి నర్సయ్య ఈ కోవలోకే వస్తారు.
కానీ శత వసంతాలు దాటి.. ఇప్పటికీ ఆనాటి విలువలు పాటిస్తూ నిరాడంబరంగా జీవిస్తున్న నాయకుడు టి.సి.రాజన్ గురించి ఈ తరం వారికి అసలు తెలియదు. పలమనేరు మాజీ ఎమ్మెల్యేగా, స్వాతంత్ర సమరయోధుడిగా పింఛన్ రాళ్లతోనే జీవితం గడుపుతున్న రాజన్ 104 ఏళ్ల వయసులోనూ ఆదర్శభావాలతో చిరంజీవిగా ఉన్నారు.పేరు చూసి తమిళ అనిపించినా ఆయన పక్కా తెలుగు వారు.
నిబద్ధత కలిగిన నేత…
చిత్తూరు జిల్లా పెద్ద పంజాణి మండలం రాయలపేటకు చెందిన ఠానేదార్ చిన్న రాజన్న 1918 సెప్టెంబర్ 11న జన్మించారు. అతని తండ్రి అయ్యన్న గౌడ్. ఇతని ఎనిమిది మంది సంతానంలో రాజన్ చివరివారు. యుక్త వయసులోనే నుంచి స్వాతంత్ర సమరంలో చురుగ్గా పాల్గొన్నారు.
Also Read : వైయస్సార్ పట్ల ఆ విప్లవ రచయిత అభిప్రాయం ఎందుకు మారింది?
రాజన్ 1967లో పలమనేరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో అనర్గళంగా ప్రసంగాలు చేసి మంచి వక్తగా పేరుపొందారు. అతనికి నలుగురు సంతానం. భార్య భద్రంబ న్యాయవాది. కొన్నేళ్ల క్రితమే ఆమె కన్ను మూశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పట్లోనే చెక్ డ్యాముల నిర్మాణం ద్వారా భూగర్భ జలాలను పెంచవచ్చని ప్రతిపాదించి.. ఆ పనులు చేపట్టేలా చేశారు. తన నియోజకవర్గంలోని ఆవులపల్లి అడవిని అక్రమణదారుల చెర నుంచి విడిపించి ప్రభుత్వపరం చేశారు. పౌర సరఫరాల విధానంలో మార్పులపై అసెంబ్లీలో ప్రతిపాదనలు చేసి.. అవి అమలయ్యేందుకు కృషి చేశారు.
ప్రభుత్వ స్థలం, భూమి నిరాకరణ
1972లో పదవీవిరమణ చేసిన ఎమ్మెల్యేలకు పింఛన్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినప్పుడు ప్రజాసేవ చేసేవారికి పింఛన్లు ఎందుకంటూ మొదట వ్యతిరేకించిన నేత రాజనే. అలాగే హైద్రాబాద్ బంజారాహిల్స్ లో మాజీ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. అయితే తనకు ఇచ్చిన స్థలాన్ని రాజన్ తీసుకోలేదు. సమరయోధుల కోటాలో సొంత నియోజకవర్గంలో భూమి కేటాయిస్తామని ప్రభుత్వం ముందుకు వచ్చిన తిరస్కరించిన ఆదర్శవాది రాజన్.
ప్రస్తుతం 104 ఏళ్ల వయసులో ఒంటరిగా ఉంటున్న ఆయనకు సెంటు స్థలం గానీ, పైసా బ్యాంక్ బ్యాలన్స్ గానీ లేవు. పలమనేరులో ఓ అద్దె ఇంట్లో పెన్షన్ డబ్బులే ఆధారంగా జీవిస్తున్న రాజన్ నేటి రాజకీయ నేతలకు ఆదర్శప్రాయుడు.ఆయన ప్రభుత్వం నుంచి కానీ, మరెవరి నుంచి కానీ ఎలాంటి సహాయం కోరటం లేదు.
Also Read : గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా