iDreamPost
android-app
ios-app

సీలేరు… సరిలేరు నీ కెవ్వరూ…

  • Published Feb 01, 2022 | 5:35 AM Updated Updated Feb 01, 2022 | 5:35 AM
సీలేరు… సరిలేరు నీ కెవ్వరూ…

సీలేరు పవర్‌ ప్రాజెక్టులు.. ఒక ఇంజనీరింగ్‌ అద్భుతం. శ్రీశైలం.. నాగార్జునసాగర్‌ వంటి పెద్దపెద్ద ప్రాజెక్టుల్లో కూడా సాధ్యపడని విధంగా ఏడాది పొడవునా విద్యుత్‌ ఉత్పత్తి చేసే సౌలభ్యం ఈ ప్రాజెక్టుల సొంతం. వందల అడుగుల ఎత్తున ఉండే తూర్పు కనుముల్లో… దట్టమైన కీకారణ్యం… విష సర్పాలు.. పులులు సంచరించే ప్రాంతాల్లో… కనీసం మానవ జాడలేని చోట ఎగువ సీలేరు… డొంకరాయ… దిగువ సీలేరు ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయి. అప్పటి ఇంజనీర్లు ప్రతిభ.. ప్రాణాలకు వెరవని నాటి పనివారి మొండి ధైర్యంతో ఈ సహసోపేత నిర్మాణాలు జరిగాయి. కొండలను తొలిచి రోడ్లు… కిలో మీటర్ల మేర కృతిమ సొరంగాలు చేసి నీరు దిగువునకు వచ్చేలా ఏర్పాటు చేసుకుని… పెద్దపెద్ద డ్యామ్‌లు… వాటికి అనుసంధానంగా చిన్నచిన్న డ్యామ్‌లు ఏర్పాటు చేసి నిర్మించిన ఎగువ సీలేరు.. దిగువ సీలేరు.. మధ్యన డొంకరాయ ప్రాజెక్టుల నిర్మాణం ఇంజనీరింగ్‌ విద్యకే తలమానికం.

ఆంధ్రా, ఒడిస్సాల సరిహద్దులను ఆనుకుని నిర్మించిన ప్రాజెక్టులు ఏపీ అభివృద్ధిలో కీలకంగా మారాయి. రాష్ట్రానికి నిరంతరాయంగా విద్యుత్‌ను అందించడంతోపాటు… గోదావరి డెల్టాలో రబీ నీటి ఎద్దడి రాకుండా ఈ ప్రాజెక్టులు లక్షల మంది రైతుల సాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి. ఒడిస్సాలో ఉన్న మచ్‌కుండ్‌ 120 మెగావాట్లు, బలిమెల 510 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. ఇక రాష్ట్ర పరిధిలో నిర్మించిన ఎగువ సీలేరు 240 మెగావాట్లు, డొంకరాయ 25 మెగావాట్లు, దిగువ సీలేరులో 460 మెగవాట్ల విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. ఎగువ సీలేరు, డొంకరాయ, దిగువ సీలేరు కలిపి మొత్తం 725 మొత్తం మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది.

సీలేరుపై నిర్మించిన బలిమెల ప్రాజెక్టు స్పీల్‌వే నుంచి దిగువునకు వదిలే నీరు నేరుగా ఎగువ సీలేరు ప్రాజెక్టు వద్దకు వస్తోంది. ఈ ప్రాజెక్టు నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి వినియోగించే నీరు శబరిలో కలిసి అక్కడ నుంచి గోదావరిలో కలుస్తోంది. బలిమెల నుంచి ఎగువ సీలేరుకు వచ్చిన నీటిని పూర్తిగా విద్యుత్‌ వినియోగానికే వాడుతుంటారు. అక్కడ నుంచి దిగువనకు విడుదలయ్యే నీరు డొంకరాయ చేరుకుంటుంది. అక్కడ నిర్మించిన ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తారు. ఇక్కడ కూడా విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. ఇక్కడ విద్యుత్‌ ఉత్పత్తి అయిన నీరు ప్రత్యేకంగా నిర్మించిన 18 కిమీల పొడవైన డ్యామ్‌ ద్వారా దిగువ సీలేరు వరకు వెళుతోంది. మధ్యలో పికప్‌ డ్యామ్‌ నిర్మాణం జరిగింది. ఈ డ్యామ్‌లోకి పవర్‌ కెనాల్‌ ద్వారానే కాకుండా ఎగువ కొండల నుంచి వచ్చే నీరు కూడా ఇక్కడ కలుస్తోంది. చివరకు ఇది ఫోర్‌బే డ్యామ్‌కు చేరుతోంది. ఇక్కడ దిగువ సీలేరు ప్రాజెక్టు (పొల్లూరు) వద్ద విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. ఈ నీరు తిరిగి శబరిలో కలిసి అక్కడ నుంచి గోదావరిలోకి వెళుతోంది.

Also Read : గోదావరి డెల్టా ఆశలన్నీ… బలిమెల పైనే

నిర్మాణం అద్భుతం:

ఎగువ సీలేరు ప్రాజెక్టు వద్ద నాలుగు పెద్దపెద్ద గొట్టాల ద్వారా దిగువునకు వదులుతారు. కొండల మధ్య ఇరుకు స్థలంలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించారు. నిజంగా ఇది సవాల్‌తో కూడుకున్న అంశం. నీరు పై నుంచి దిగువునకు నేరుగా వదిలితే జల విద్యుత్‌ ప్రాజెక్టు కొట్టుకుపోయే ప్రమాదముందని గుర్తించిన అధికారులు రెండు, మూడు దశలుగా వదిలేలా మధ్యలో నిర్మాణాలు చేశారు. దిగువ సీలేరులో సైతం ఇక్కడ కూడా నీరు మూడు దశల్లో ప్రాజెక్టుకు చేరుతోంది. రెండు భారీ గొట్టాల ద్వారా దిగువనకు వచ్చే నీరు నాలుగు టర్బైన్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. ఇక్కడ 9 కిమీల పొడవునా కొండల మధ్యన సొరంగం తవ్వకం కూడా ఇంజనీరింగ్‌ అద్భుతమే. నీటితోపాటు వచ్చే గాలి వెళ్లేందుకు అనువుగా ఎయిర్‌ వాల్స్‌కు సైతం సొరంగాల నిర్మాణాలు చేశారు.

ఇక్కడ విద్యుత్‌ ఉత్పత్తి ఒక్కటే కాదు.. ఈ ప్రాజెక్టుల వల్ల గోదావరి డెల్టా రబీ అవసరాలు కూడా తీరుతున్నాయి. ఇక్కడ రబీకి ప్రతీ ఏటా నీటి ఎద్దడి ఏర్పడుతోంది. ఈ సమయంలో బలిమెల ద్వారా ఎగువ, దిగువ సీలేరు, డొంకరాయ ద్వారా నీరు వదులుతున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి చేయడమే కాదు.. అత్యవసర సమయంలో డొంకరాయ ప్రాజెక్టు గేట్లు ఎత్తి బైపాస్‌ పద్ధతిలో కనీసం రోజుకు 4 వేల నుంచి 6 వేల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. రబీ నాలుగు నెలల కాలంలో మూడొంతుల నీరు సీలేరు ప్రాజెక్టుల ద్వారానే వస్తుంది.

సీలేరు విద్యుత్‌ ఉత్పత్తి పెంపు:

దిగువ సీలేరు ఉత్పత్తి పెంచేందుకు వై.ఎస్‌.జగన్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దిగువ సీలేరు వద్ద ఇప్పుడు 460 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. ప్రాజక్టు విస్తరించడం వల్ల అదనంగా మరో 231 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి పెరగనుంది. ఇందుకోసం జగన్‌ సర్కార్‌ రూ.560 కోట్లు మంజూరు చేసింది. విద్యుత్‌ ఉత్పత్తి పెంచేలా గతంలోనే ఈ ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. ఇప్పుడున్న రెండు ఐరెన్‌ గొట్టాలకు అదనంగా మరో భారీ ఐరెన్‌ గొట్టాన్ని ఏర్పాటు చేసి ఐదు, ఆరు టర్బైన్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేయనున్నారు. దీని వల్ల విద్యుత్‌ పెరగడమే కాదు.. దిగువునకు నీరు అధికంగా విడుదలవుతోంది. దీని వల్ల గోదావరి డెల్టాలో రబీకి సైతం నీటిని సంవృద్ధిగా అందడం అదనపు ప్రయోజనం.

Also Read : నది మన జీవనం