iDreamPost
iDreamPost
ఏపీలో క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్దమయ్యింది. కొద్దిరోజుల్లోనే రెండు స్థానాల భర్తీ కోసం అంతా రెడీ చేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. అవి ఇంకా ఆమోదం పొందలేదు. దాంతో డిప్యూటీ సీఎంగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఇద్దరూ బుధవారం జరిగిన క్యాబినెట్ భేటీలో కూడా పాల్గొన్నారు. అయితే వచ్చే వారంలోగా వారి రాజీనామాలు ఆమోదించబోతున్నట్టు తెలుస్తోంది. వారి స్థానంలో కొత్త వారిని ఇప్పటికే ఖాయం చేసినట్టు ప్రచారం సాగుతోంది.
ఆ జాబితాలో ఖాళీ అవుతున్న రెండు బెర్తులను అవే సామాజిక వర్గాలతో నింపబోతున్నట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చెల్లుబోయిన వేణు, పలాస ఎమ్మెల్యే సీదర అప్పలరాజు పేర్లు తెరమీదకు వచ్చాయి. ఈ ఇద్దరూ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టడం విశేషం. పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో శెట్టిబలిజ సామాజికవర్గానికే చెందిన వేణు, మోపిదేవి స్థానంలో మత్స్యకార వర్గీయుడైన అప్పలరాజు పేర్లకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టు చెబుతున్నారు. చివరి క్షణంలో మార్పులు జరిగితే తప్ప ఈ ఇద్దరికీ బెర్త్ లు ఖాయమని అత్యధికులు నమ్ముతున్నారు.
జెడ్పీటీసీ నుంచి ఎదిగిన వేణు..
చెల్లుబోయిన వేణగోపాల కృష్ణ యువజన కాంగ్రెస్ నేతగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత మలికిపురం జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. రిజర్వేషన్ల మార్పిడి కారణంగా 2005 ఎన్నికల్లో రాజోలు నుంచి జెడ్పీటీసీగా అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత బీసీలకు రిజర్వ్ అయిన జిల్లా పరిషత్ చైర్మన్ సీటు కైవసం చేసుకున్నారు. అప్పట్లో రాజోలు ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు అండదండలు ఉండడం, నాటి జిల్లా మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ఆశీస్సులతో వేణు జెడ్పీ చైర్మన్ గా జిల్లా స్థాయిలో గుర్తింపు సాధించేందుకు అవకాశం దక్కింది. అప్పట్లో రెడ్డి సుబ్రహ్మణ్యం కూడా జెడ్పీ చైర్మన్ గిరీ కోసం ఆశించినా వివాదరహితుడిగా వేణుకి అవకాశం ఇచ్చారు.
జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆయన వైఎస్సార్ కి సన్నిహితుడిగా మారారు. అనంతరం జగన్ వెంట పయనించారు. 2014లో జగన్ అవకాశం ఇవ్వడంతో కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. అయితే టీడీపీ అభ్యర్థి కూడా శెట్టిబలిజ సామాజికవర్గం నుంచే పోటీ చేయడంతో వేణు ఆశలు పండలేదు. ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలో దిగిన కన్నబాబు వెంట కాపులు నడవడంతో గణనీయ సంఖ్యలో ఓట్లు దక్కించుకున్నారు. చివరకు టీడీపీ గెలచుకుంది. అయితే తన రాజకీయ ప్రస్థానంలో తొలిసారిగా ఓటమి పాలయినప్పటికీ వేణు వెనకడుగు వేయలేదు. జగన్ వెంట నడుస్తూ వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. చివరకు ఎన్నికలకు ముందు రామచంద్రాపురం స్థానానికి ఆయన్ని ఇన్ఛార్జ్ గా నియమించడంతో వేణు అటు మళ్లారు. నియోజకవర్గంలో అనతికాలంలోనే పాగా వేయగలిగారు. చివరకు 2019 ఎన్నికల్లో తోట త్రిమూర్తులు టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగగా సుమారు 5వేల ఓట్లు తేడాతో వేణు విజయం సాధించారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
సుభాష్ చంద్రబోస్ సొంత నియోజకవర్గంలో వేణు పాగా
పిల్లి సుభాష్ చంద్రబోస్ గతంలో పలు మార్లు ప్రాతినిధ్యం వహించిన ఆయన సొంత నియోజకవర్గంలో ఇప్పుడు చెల్లుబోయిన వేణు పాగా వేశారు . రామచంద్రాపురం రాజకీయాలను తనకు అనుకూలంగా మలచుకున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తన రాజకీయ ప్రత్యర్థి తోట త్రిమూర్తులు కూడా టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరినా వేణు తన అసంతృప్తిని వ్యక్తం చేయకుండా జాగ్రత్త పడ్డారు. తద్వారా జగన్ ఈసారి శెట్టిబలిజ కులానికి మరోసారి అవకాశం ఇవ్వాలనే ఆలోచన నేపథ్యంలో వేణు పేరు ముందుకొస్తోంది. వేణు తప్ప ఇంకెవరూ ఆ కులం నుంచి ఎమ్మెల్యేలు లేరు. దాంతో గౌడ కులానికి చెందిన జోగి రమేష్ వంటి వారు ప్రయత్నం చేస్తున్నప్పటికీ వేణు వైపు మొగ్గు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రాంతీయ , సామాజిక సమీకరణాలతో వేణుకి అమాత్య హోదా అవకాశం ఖాయమనే అంచనాలు కనిపిస్తున్నాయి.
సీదర అప్పలరాజు సంగతేంటి
విద్యావంతుడైన యువ నేతగా డాక్టర్ సిదిరి అప్పలరాజు పలాసలో జయకేతనం ఎగురవేశారు. రాజకీయ ఉద్దండుడైన గౌతు శ్యామసుందర శివాజీ కుమార్తె , టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు శిరీషను ఆయన ఓడించారు. 16వేలకు పైగా ఓట్ల మెజార్టీ సాధించారు. బరిలో దిగిన తొలిసారే విజయం సాధించడం ద్వారా సిదిరి అప్పలరాజు రాజకీయ ప్రస్థానం మొదలయ్యింది. వ్యాపార కూడలిగా ఉన్న పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల ప్రాంతంలో కీలక సామాజికవర్గంగా ఉన్న మత్య్స్యకార వర్గంలో విద్యాధికుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధిస్తున్నారు.
ఇటీవల అసెంబ్లీలో వివిధ సందర్భాల్లో అప్పలరాజు వాగ్ధాటి అందరినీ ఆకట్టుకుంది. అందరినీ ఒప్పించేలా ఆయన చేస్తున్న ఉపన్యాసాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన కూడా అమాత్య హోదా ఆశలు పెరిగాయి. అదే సామాజిక కోటాలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ యువనేతకు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో 40 ఏళ్ల వయస్సున్న అప్పలరాజుకి అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. గతంలో పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించి నాటి సీఎం చేతుల మీదుగా అవార్డ్ కూడా అందుకున్న అప్పలరాజు ఇప్పుడు క్యాబినెట్ మంత్రిగా సీఎం చెంత సమావేశంలో పాల్గొనే అవకాశం దక్కించుకోబోతున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు.
వాస్తవానికి జగన్ తన తొలి క్యాబినెట్ లో మొదటి సారి ఎన్నికయిన ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వలేదు. ఈసారి కూడా అలాంటి అవకాశం ఉండదని కొందరు అంచనా వేశారు. కానీ సీఎం మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. అధికారికంగా ఎవరి పేర్లు ప్రకటించకపోయినప్పటికీ బలంగా వినిపిస్తున్న ఈ ఇద్దరి నేతలకు బెర్త్ లు ఖాయం అయినట్టు చెబుతున్నారు. చూడాలి..ఏం చేస్తారో మరి