iDreamPost
android-app
ios-app

7 ఏళ్ళ తర్వాత సిద్దూ రీఎంట్రీ

  • Published Sep 18, 2020 | 5:50 AM Updated Updated Sep 18, 2020 | 5:50 AM
7 ఏళ్ళ తర్వాత సిద్దూ రీఎంట్రీ

పదిహేనేళ్ళ క్రితం బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ తో యూత్ లో అమాంతం ఫాలోయింగ్ పెంచుకున్న సిద్దార్థ్ ఆ తర్వాత స్టార్ డం ని ఎక్కువకాలం నిలుపుకోలేకపోయాడు. కథల ఎంపికలో చేసిన పొరపాట్లకు కాస్త ఎక్కువ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. ఇక్కడి మార్కెట్ బాగా తగ్గిపోవడంతో తమిళ్ వైపు వెళ్ళిపోయి అక్కడే గట్టిగా సెటిలయ్యాడు. 2013లో జూనియర్ ఎన్టీఆర్ బాద్షాలో చిన్న క్యామియోలో కనిపించాక మళ్ళీ తెలుగు స్ట్రెయిట్ సినిమాలో దర్శనం ఇవ్వనే లేదు. ఆ మధ్య డబ్బింగ్ చిత్రం గృహంతో బాగానే భయపెట్టాడు కానీ తనను ప్రత్యేకంగా ఇష్టపడే అభిమానులు మాత్రం నేరుగా టాలీవుడ్ మూవీలో చూడాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.

అది ఇప్పుడు మహాసముద్రం రూపంలో నెరవేరబోతోంది. ఆరెక్స్ 100 లాంటి సూపర్ సక్సెస్ తర్వాత రెండు సంవత్సరాలకు పైగా గ్యాప్ తీసుకుని అజయ్ భూపతి రూపొందిస్తున్న ఈ సినిమాలో మెయిన్ హీరో శర్వానంద్. రెండో కథానాయకుడు కూడా ఉంటాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది కానీ ఫైనల్ గా ఇవాళ ఖరారు చేయబోతున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ప్రచారంలో మహాసముద్రంలో ఇంకా అసలైన హీరోయిన్ ఎవరో తెలియాల్సి ఉంది. సో సిద్దార్థ్ కంబ్యాక్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇకపై తాను హీరో వేషాలనే కోరుకుంటాడా లేక సపోర్టింగ్ రోల్స్ కు వస్తాడా అనేది తెలియాల్సి ఉంది. మహా సముద్రంలో ఈ రోల్ కాస్త నెగటివ్ షేడ్స్ లో సాగుతుందట. ఛాలెంజింగ్ గా అనిపించడం వల్లే సిద్దార్థ్ ఓకే చేసినట్టు చెన్నై టాక్.

వాస్తవానికి ఈ పాత్ర కోసం తెలుగు స్టార్లనే అజయ్ భూపతి గట్టిగా ట్రై చేశాడు. కానీ కుదరలేదు. ఒకరిద్దరు ఓకే చెప్పి ఆ తర్వాత తప్పుకున్నారు. వేరే ఆప్షన్ లేకపోవడంతో పాటు ప్రాజెక్ట్ అంతకంతా ఆలస్యమవుతుండటంతో ఆరవ హీరోను తెచ్చుకోక తప్పలేదు. ఒకదశలో గద్దలకొండ గణేష్ ఫేమ్ అథర్వా పేరు కూడా వినిపించింది. అయితే తన కన్నా ఎక్కువ గుర్తింపు ఉన్న సిద్దార్థ్ అయితేనే మార్కెట్ పరంగా సేఫ్ గేమ్ అవుతుందని ఈ విధంగా నిర్ణయం మార్చుకున్నట్టు తెలిసింది. మహాసముద్రంకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయి. అన్ని ఒకేసారి కాకుండా ఒక్కో అప్ డేట్ కొంత గ్యాప్ ఇచ్చి ప్లాన్ చేసుకుంది ఏకె ఎంటర్ టైన్మెంట్. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదల ప్లాన్ చేసిన మహాసముద్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లేదా డిసెంబర్ నుంచి మొదలయ్యే ఛాన్స్ ఉంది .