iDreamPost
android-app
ios-app

అలా లక్కీగా మారుతున్న శృతిహాసన్

  • Published Jan 16, 2021 | 6:28 AM Updated Updated Jan 16, 2021 | 6:28 AM
అలా లక్కీగా మారుతున్న శృతిహాసన్

మొన్న విడుదలైన క్రాక్ లో హీరోయిన్ శృతి హాసన్ ఎలా కనిపించింది, మెప్పించిందా లేదా అనేది పక్కనపెడితే తనకు సంబంధించిన ఒక వెరైటీ పాజిటివ్ సెంటిమెంట్ అభిమానుల్లో ప్రత్యేక చర్చకు దారి తీస్తోంది. అదెలా అంటారా. కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మీకే అర్థమవుతుంది. గబ్బర్ సింగ్ కంటే ముందు పవన్ కళ్యాణ్ వరసగా హ్యాట్రిక్ డిజాస్టర్స్ లో ఉన్నాడు. అప్పటికి శృతికి ఇంకా బ్రేక్ రాలేదు. ఐరన్ లెగ్ ను తీసుకున్నారనే కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ అది అనూహ్యంగా ఇండస్ట్రీ హిట్టు కొట్టి పాత రికార్డులు బద్దలు కొట్టింది. సినిమా మొత్తం పవర్ స్టార్ వన్ మ్యాన్ షోనే అయినప్పటికీ శృతికి దీంతో వచ్చిన గుర్తింపు ఇతర స్టార్ హీరోల సరసన అవకాశాలు తెచ్చింది.

ఇక మహేష్ బాబు సంగతి చూస్తే 1 నేనొక్కడినే, ఆగడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ దెబ్బేశాయి. ఇదేంటి ఇలా జరుగుతోందని ఫ్యాన్స్ కూడా కలవరపడ్డారు. అప్పుడు శృతిని హీరోయిన్ గా చేసిన సినిమానే శ్రీమంతుడు. అది ఏ రేంజ్ హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దెబ్బకు దర్శకుడు కొరటాల శివ, మహేష్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయి ఇంకో మూవీ భరత్ అనే నేను కూడా చేశారు. అల్లు అర్జున్ సంగతి చూస్తే పూరి జగన్నాధ్ తో ఏరికోరి మరీ చేసిన ఇద్దరమ్మాయిలతో ఊహించని ఫలితం ఇవ్వడం అందరికీ గుర్తే. దాని తర్వాత వచ్చిన అల్టిమేట్ బ్లాక్ బస్టర్ రేసు గుర్రంలో శృతి హాసనే హీరోయిన్. మాస్ ఎంటర్ టైనర్ గా ఇప్పటికీ దానికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

నాగచైతన్య ఉదాహరణ కూడా చూద్దాం. ఆటోనగర్ సూర్య, దోచేయ్ రెండు ఫ్లాపయ్యాక ముచ్చటిపడి చేసిన రీమేక్ సినిమా ప్రేమమ్. ఇందులో శృతి హాసన్ సెలక్షన్ మీద రిలీజ్ కు ముందు కామెంట్స్ వచ్చినప్పటికీ టీమ్ వాటిని లెక్కచేయలేదు. ఆ తర్వాత చైతుకి ఈ రూపంలో రిలీఫ్ అనిపించే సక్సెస్ దక్కింది. ఇక వర్తమానానికి వస్తే నాలుగు మెగా డిజాస్టర్లు(టచ్ చేసి చూడు-నేల టికెట్టు-అమర్ అక్బర్ ఆంటోనీ- డిస్కో రాజా)తర్వాత రవితేజతో శృతి చేసిన క్రాక్ ఇప్పుడు సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. గతంలో ఇద్దరూ దరువు చేశారు కానీ దానికి ఇప్పటికీ చాలా గ్యాప్ వచ్చింది. వింతగా అనిపించినా శృతి సెంటిమెంట్ ఇన్ని సందర్భాల్లో వర్కవుట్ అయిన మాట నిజం.