Idream media
Idream media
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఒకప్పుడు అండగా నిలిచిన మైలవరం కూడా ఆయనకు ఎదురుతిరుగుతోంది. పంచాయతీ, కార్పొరేషన్ ఎన్నికల్లో తీవ్ర పరాభవం ఎదుర్కొన్న దేవినేని ఉమాకు తాజా పరిణామాలతో దిమ్మతిరుగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మార్ఫింగ్ వీడియోను విడుదల చేసిన కేసులో అదృశ్యమై.. అనంతరం సీఐడీ విచారణ లు ఎదుర్కొన్న ఆయన సొంత నియోజకవర్గంలోనే తిరుగుబాటుకు గురవుతున్నారు. తాజాగా ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్ల స్థలాల వద్దకెళ్లి ఆ కార్యక్రమంపై ఆరోపణలు కురుపిస్తుండగా, అనూహ్యంగా దళిత మహిళలు ఎదురుతిరగడంతో షాక్ కు గురయ్యారు.
ఎప్పుడూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ద్వారా పార్టీలో మైలేజీ కోసం ప్రయత్నిస్తున్న దేవినేని ఉమ ప్రజల్లో మాత్రం మైలేజీ పొందలేకపోతున్నారు. తన నియోజకవర్గంలోని టీడీపీ నేతలను కూడా కాపాడుకోలేకపోతున్నారు. మారిన సమీకరణలతో తన బలం, బలగం తగ్గిపోతుండడంతో స్థానికంగా ఆయనకు నిరసనలు ఎదురవుతున్నాయి. గొల్లపూడిలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, హోం మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావుల చేతుల మీదుగా 3,648 ఇళ్ల పట్టాలను పేదలకు పంపిణీ చేశారు. ఆయా స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం శంకుస్థాపనలు చేసింది.
పేదల ఇళ్ల నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. వాటిని పరిశీలించేందుకు బుధవారం దేవినేని ఉమ వెళ్లారు. అక్కడ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వంపై బురదజల్లే యత్నంలో దేవినేని ఉమా భంగపాటుకు గురయ్యారు. ఇళ్ల స్థలాల వద్దకు వెళ్లిన ఆయన అలవాటులో పొరపొటుగా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారు. దీంతో ఆయనపై దళిత మహిళలు తిరగబడ్డారు. దేవినేని ఉమా అండ్ కోపై తిట్ల పురాణంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊహించని పరిణామం ఎదురు కావడంతో దేవినేని ఉమా, అతని సభ్యులు అక్కడి నుంచి జారుకున్నారు.