మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ వ్యాఖ్యలు ఉప ఎన్నికల ప్రచారంలో కాక రేపాయి. దాబ్రా ప్రచార సభలో మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మంత్రి ఇమార్తి దేవిపై చేసినట్లు చెప్పబడుతున్న వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి.
కాంగ్రెస్‌ని వీడి బిజెపిలో చేరి శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్‌లో మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న ఇమార్తి దేవిని ‘ఐటమ్’ అని మాజీ సీఎం కమల్‌నాథ్ సంబోధించడం వివాదాస్పదంగా మారింది.దాబ్రా ఉప ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన ఆయన ‘‘ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ రాజే చాలా సాధారణ వ్యక్తి. ప్రత్యర్థి బిజెపి పార్టీ నుండి పోటీ చేస్తున్న ఆమె పేరు నేను ఎందుకు చెప్పాలి? నా కంటే ఆ వ్యక్తి మీ అందరికీ బాగా తెలుసు.ఆమె ఓ ఐటమ్” అంటూ వ్యాఖ్యానించాడు.
ముందుగా ప్రకటించినట్లే తన క్యాబినెట్ మంత్రి ఇమార్తి దేవిపై మాజీ సీఎం కమల్‌నాథ్ వ్యాఖ్యలను నిరసిస్తూ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ‘మౌనదీక్ష’ కు దిగారు.తన భవిత్యాన్ని నిర్ణయించే ఉప ఎన్నికల ప్రచారాన్ని ఒక పూట పక్కనపెట్టి భోపాల్‌లో రెండు గంటల పాటు మౌనదీక్ష చేయడం విశేషం. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ మహిళా ఓటర్లను తమ వైపు ఆకర్షించేందుకు సీఎం శివరాజ్ ఎత్తుగడగా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ రాజయాలలో తీవ్ర కలకలం రేపిన ఐటమ్ వ్యాఖ్యలపై మాజీ సీఎం కమల్ నాథ్ వివరణ ఇచ్చాడు. జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన మంత్రి ఇమార్తి దేవిపై తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని ఆయన ప్రకటించాడు. తన ప్రసంగంలో ఎవరినీ అవమానపరిచే మాటలు లేవని,అసలు ఆమె పేరేంటో కూడా తనకు గుర్తులేదని పేర్కొన్నాడు. ఓటమి భయంతో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన ప్రసంగంలో తప్పులు వెతుకుతున్నాడని ఆయన తెలిపాడు. తాను ఎవరిని అవమానించ లేదని,తాను ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేయడం గమనార్హం. తన చేతిలో ఉన్న జాబితా చూపుతూ ఇందులో ఐటమ్ నెంబర్ వన్, టూ అంటూ పేర్లున్నాయి. ఇది అవమానించడం అవుతుందా అని ప్రశ్నించాడు.
ఇక కమల్ నాథ్ వివరణ ఎలా ఉన్న ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపోటములపై ఆయన వ్యాఖ్యలు ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళా ఓటర్లలో ఆగ్రహావేశాలు పెల్లుబికే అవకాశం ఉండటంతో వారిని శాంతింప చేయడానికి కాంగ్రెస్ ఎలాంటి నష్ట నివారణ చర్యలు చేపడుతుందో వేచి చూడాలి.