iDreamPost
iDreamPost
విఠలాచార్య సినిమాల్లో కొందరు పార్ట్ టైం నటులు ప్రతినాయకుడికి అవసరమైనప్పుడు ఠక్కున ప్రత్యక్షమయ్యి మాయమవుతుంటారు . ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో గరుడ పురాణం శివాజీ కూడా అదే పాత్ర పోషిస్తున్నాడులా ఉంది .
టీవీ 9 షేర్స్ , రవిప్రకాష్ ఫోర్జరీ కేసుల్లో భాగస్వామిగా ఉన్న నటుడు శివాజీ 2019 ఎన్నికల తర్వాత పెద్దగా బయట ప్రపంచానికి కనపడలేదు కానీ ఎన్నికల ముందు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు . గతంలో నటుడిగా అమెరికాలో తెలుగు సభల్లో పాల్గొన్న శివాజీ చంద్రబాబు తనకిష్టమైన నాయకుడని చెప్పుకున్నాడు . రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా ఉద్యమ సందర్భంలో చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకొంటే బాబు ఇంటిముందు ఉరి వేసుకొంటానని హల్చల్ చేసాడు .
బాబు ప్యాకేజీకి ఒప్పుకొని అసెంబ్లీ తీర్మానం చేసినా కానీ ఏ విధమైన ప్రతిస్పందన చూపించని శివాజీ తర్వాతి రోజుల్లో రాజమండ్రి పుష్కరాల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను ఉరి వేసుకొంటానన్న వ్యాఖ్యల్ని పట్టుకొని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని వాపోయాడు . ఎన్నికల ముంగిట టీడీపీ బిజెపి సంభందం దెబ్బ తిన్న వేల మీడియా ముందుకు వచ్చిన శివాజీ కేంద్రం టీడీపీ పట్ల , బాబు పట్ల కుట్ర చేస్తుంది గరుడ వ్యూహం పన్ని నాశనం చేయాలని చూస్తోంది అంటూ బిజెపికి , వైసీపీకి వ్యతిరేకంగా బాబుకి అనుకూలంగా పలు కధనాలు వెల్లడించి టీడీపీ ప్రచారానికి కొంత సరుకు అందించాడు . ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత మళ్ళీ కనుమరుగయ్యాడు .
2019 తర్వాత టీవీ9 రవిప్రకాష్ పై యాజమాన్యం పలు ఆరోపణలు చేయడం , కేసులు నమోదు కావడం జరిగాక భాగస్వామ్యాలు , లావాదేవీల విషయంలో శివాజీ పేరు బయటకి రావడంతో తన పై కూడా కేసులు నమోదు అయ్యాయి . ఆ సందర్భంగా అడపాదడపా కనపడ్డా అమెరికా పోబోతూ కేసుల కారణంగా విమానాశ్రయంలో పోలీసులు నిలిపివేసి వెనక్కి పంపాక బయట ప్రపంచానికి మళ్లీ కనపడలేదు .
తాజాగా నిన్న టీవీ 5 చానెల్ లో ప్రత్యక్షమైన శివాజీ
యధావిధిగా హైద్రాబాద్ ని సంపద కేంద్రం చేసిన విజనరీ అని బాబుని పొగుడుతూ వైసీపీ పై బురద చాల్లే యత్నం చేసాడు .అమరావతిపై , అమరరాజా పై కులం కారణంగా వివక్ష చూపుతున్నారని , కుల వ్యతిరేకతతో అమరరాజాని బయటకి పంపిస్తున్నారు అంటూ ఆరోపించిన శివాజీ అమరరాజా పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన విషయంలో కోర్టు ఆక్షేపించిన విషయం కానీ , ప్రజలకు , పర్యావరణానికి హానికర స్థాయిలో వెలువడుతున్న సీసం వంటి రసాయనాలను నియంత్రించమని నిర్దేశించిన గడువులోగా అమరరాజా ఏ చర్యలూ తీసుకోనందున ప్రభుత్వం క్లోజర్ ఆర్డర్ ఇచ్చిందన్న విషయాలు విస్మరించి ప్రభుత్వం బురద చల్లే ప్రయత్నం చేయడం ఎవరి పనుపునో సామాన్యులకు సైతం అవగతం కాకమానదు ….