iDreamPost
iDreamPost
టీడీపీ నేతలు బలంగా వాదిస్తూ ఉంటారు. బలమైన మీడియా చేతిలో ఉండడంతో ఎంత గట్టిగా చెబితే అంత మంచిదని వారు ఆశిస్తున్నారు. ఒక విషయాన్ని పదే పదే చెప్పడం ద్వారా కొద్దిమందినైనా నమ్మించవచ్చని భావిస్తూ అంటారు. అందుకు తగ్గట్టుగానే తాజా ఎపిసోడ్ లో వ్యవహరిస్తున్నారు. తమకు అలవడిన పద్ధితిలోనే సాగుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిధులు కేటాయింపు విషయంలో రెండు అంశాలను పదే పదే ప్రస్తావిస్తున్నారు. సామాన్యులను తమ చేతిలోని మీడియా సాయంతో మభ్యపెట్టగలమన్న ధీమాతో వారీ పంథాను ఎంచుకున్నట్టు భావించవచ్చు.
టీడీపీ నేతలు పదే పదే చెబుతున్న విషయాల్లో మొదటిది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చంద్రబాబు పూర్తి చేశారన్నది. ఇప్పటికే 71 శాతం పూర్తయినట్టు కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల అధికారికంగా ప్రకటించింది. ఆ 71 శాతం నిర్మాణ పనులు కూడా చంద్రబాబు చేశారన్నది టీడీపీ నేతలు చేసుకుంటున్న క్లయిమ్. చివరకు చంద్రబాబు కూడా అదే విషయాన్ని చెబుతున్నారు. కానీ వాస్తవంలోకి వెళ్లి పరిశీలిస్తే 2014-20 మధ్యలో పోలవరం నిర్మాణం కోసం చేసిన మొత్తం వ్యయం రూ. 8614.16 కోట్లు. అది కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో జాతీయ హోదా దక్కిన తర్వాత చేసిన ఖర్చు. కాబట్టి ఇందులో చంద్రబాబు చేసిన ఖర్చు దాదాపు సున్నా.
ఇక 2014కి ముందు పోలవరం నిర్మాణానికి చేసిన మొత్తం వ్యయం రూ. 8319 కోట్లు. దాంతో ఇప్పటి వరకూ మొత్తం ప్రాజెక్ట్ చేసిన ఖర్చు రూ. 16,935.84 కోట్లు. దానిలో వైఎస్సార్ హయంలో ప్రారంభమయ్యి జాతీయ హోదా దక్కే వరకూ చేసిన మొత్తం ఖర్చు ఏపీలో ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఇక చంద్రబాబు పదవిలోకి వచ్చే నాటికి 50 శాతం వరకూ పనులు పూర్తయ్యాయి.ప్రధానంగా వైఎస్సార్ హయంలో కుడి, ఎడమ ప్రధాన కాలువలు, డ్యామ్ ప్రాంతంలో ఎర్త్ వర్క్ కూడా జరగడంతో సుమారుగా 40 శాతం పనులు 2009 నాటికి జరిగాయని రికార్డులు చెబుతున్నాయి. ఇక కిరణ్ కుమార్ రెడ్డి హయంలో మరో 10 శాతం పనులు జరిగాయి. ఇక 2014 నాటికి 50 శాతం పూర్తయిన పనులను 2019 నాటికి 65 శాతానికి చేర్చారు. 2019 నాటికి పూర్తయిన మొత్తం పనులు 67శాతం అంటూ ఇటీవల కేంద్రం స్పష్టం చేసింది.
అంటే రికార్డుల ఆధారంగా పరిశీలిస్తే చంద్రబాబు పాలనలో..అది కూడా కేంద్రం నిధులతో 15 శాతం పనులు పూర్తి చేసి మొత్తం 71 శాతం పనులు కూడా చంద్రబాబు చేసినట్టు చెప్పుకోవడానికి సంకోచించడం లేదంటే ఆశ్చర్యమేస్తుంది. అయినప్పటికీ సామాన్యులకు గతం గుర్తు ఉండదని, ఇప్పుడు తాము ఏమి చెప్పినా చెల్లుతుందనే ధీమాలో టీడీపీ నేతలున్నట్టు భావించాలి. లేదంటే తమకు అలవాటుగా మారిన అర్థసత్యాలను బలంగా వాదించడమే పనిగా పెట్టుకున్నట్టు అనుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ముఖ్యమంత్రి మాట్లాడడం లేదనే మరో వాదన కూడా పదే పదే వినిపించడం కూడా అర్థసత్యమే. ఇప్పటికే సీఎం పలుమార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవడం, తాజాగా నేరుగా పీఎంకి లేఖ రాయడం, ప్రభుత్వం తరుపున పీపీఏ భేటీలో బలంగా వాదించడం వంటివి విస్మరించి చేస్తున్న విమర్శలకు దిగడం విచిత్రమే.