iDreamPost
android-app
ios-app

7 ఖండాలు… 7 శిఖరాలు… మలావత్ పూర్ణ

7 ఖండాలు… 7 శిఖరాలు… మలావత్ పూర్ణ

అది 2014 వ సంవత్సరం మే 25… 13 సంవత్సరాల 11 నెలల వయస్సున్న బాలిక ఎవ్వరూ ఊహించని విధంగా ఎవరెస్టు శిఖరం అధిరోహించింది. అత్యంత పిన్నవయసులోనే ఎవరెస్టు అధిరోహించిన మొదటి మహిళగా రికార్డు సృష్టించింది. ప్రపంచం మొత్తం ఆమె ధైర్యసాహసాలను చూసి ఆశ్చర్య పోయింది. అంతటితో ఆ బాలిక తన ప్రయాణాన్ని ఆపలేదు. ప్రపంచంవ్యాప్తంగా ఏడు ఖండాల్లో ఉన్న ఏడు అత్యంత ఎత్తైన శిఖరాలను వరుసగా అధిరోహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. కేవలం 18 సంవత్సరాల పిన్న వయసులోనే 6 ఖండాల్లో 6 అత్యున్నత శిఖరాలు అధిరోహించిన పర్వతారోహకురాలిగా రికార్డు సృస్టించించిన ఆ మహిళ ఇప్పుడు చివరగా ఉత్తర అమెరికాలో ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ డెనాలి అధిరోహించడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఆమె మరెవరో కాదు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాలావత్ పూర్ణ.

మలావత్ పూర్ణ తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా పాకాల గ్రామంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. పూర్ణ ప్రయాణం ఆమె గిరిజన కుగ్రామమైన పాకాలాలోని చిన్న కొండలను ఎక్కడంతో ప్రారంభమైంది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యను అభ్యసిస్తున్నప్పుడు TSWREIS(Telangana Social Welfare Residential Educational Institutions Society)కి కార్యదర్శిగా ఉన్న Dr. R.S. ప్రవీణ్ కుమార్ ప్రోత్సాహంతో మాలావత్ పూర్ణ వెలుగులోకి వచ్చింది. ఆమెలోని అసాధారణ ప్రతిభను గుర్తించిన ప్రవీణ్ కుమార్ ఎవరెస్టును అధిరోహించడానికి మలావత్ పూర్ణ సమర్థురాలని భావించి ఆమెను ఎంపిక చేసారు.

ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి ముందుగా 8 నెలల కఠోర శిక్షణలో పూర్ణ పర్వతారోహణకు అనువుగా రాటుదేలింది. 2014 వ సంవత్సరం మే 25న పూర్ణ కల సాకారమైంది. ఆ రోజున ఉదయం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి పిన్న వయస్కురాలిగా రికార్డులకెక్కింది. ఒక గిరిజన భారతీయ బాలిక చేసిన సాహసం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అట్టడుగు వర్గాల వారు ఎందులోనూ తీసిపోరని పూర్ణ నిరూపించింది. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడంతో ఆమె ప్రయాణం ఆగలేదు.. సరిగా చెప్పాలంటే అప్పుడే ఆమె ప్రయాణం మొదలైంది. ఆ తరువాత వరుసగా ఐదు ఖండాల్లోని ఐదు అత్యున్నత శిఖరాలను అధిరోహించింది. పూర్ణ ప్రయాణంలో ప్రపంచంలోనే అత్యున్నత శిఖరాలైన, మౌంట్ ఎవరెస్ట్ (ఆసియా, 2014), మౌంట్ కిలిమంజారో (ఆఫ్రికా, 2016), మౌంట్ ఎల్బ్రస్ (యూరప్, 2017), మౌంట్ అకాన్కాగువా (దక్షిణ అమెరికా, 2019), మౌంట్ కార్ట్ స్నెజ్ (ఒషీనియా, 2019), మరియు మౌంట్ విన్సన్ మాసిఫ్ (అంటార్కిటికా, 2019) ఆమె పాదాక్రాంతం అయ్యాయి. చివరగా ఉత్తర అమెరికాలో ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ డెనాలి పర్వతాన్ని అధిరోహించి ఏడు ఖండాల్లో ఏడు శిఖరాలను అధిరోహించిన పిన్న వయసు పర్వతారోహకురాలిగా అరుదైన రికార్డును నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది.

మలావత్ పూర్ణ ప్రస్తుతం అమెరికాలోని మిన్నెసోటా స్టేట్ యూనివర్శిటీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును అభ్యసిస్తోంది. అట్టడుగు వర్గానికి చెందిన గిరిజన మహిళ తనకు ఎదురైన సాంఘిక ఆర్ధిక అడ్డంకులను అధిగమించి పలువురిలో స్ఫూర్తిని నింపుతూ అత్యున్నతంగా ఎదగడం అభినందించాల్సిన విషయమే. ఇప్పటికే ఆమె సాధించిన విజయాలను గుర్తించి ఆమె జీవిత చరిత్రను అపర్ణ తోట పూర్ణ పేరుతో రచించారు. ప్రిజం బుక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రచురించిన “పూర్ణ” పుస్తకంలో పూర్ణ ఎదుర్కొన్న సాంఘిక అసమానతలు మరియు ఆమె సాధించిన విజయాలను కళ్ళకు కట్టారు. పట్టుదల కృషి ఉండాలే కానీ అసమానతలు మనిషి దృఢ సంకల్పానికి అడ్డురావని ఆమె రుజువు చేసారు.

ప్రపంచంలో ఉన్న బాలికలందరికి ఆదర్శంగా నిలిచిన పూర్ణ తను సాధించిన విజయాలకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావ్,తన గురువు ప్రవీణ్ కుమార్ మరియు తెలంగాణ వెల్ఫేర్ మినిస్టర్ కొప్పుల ఈశ్వర్ అందించిన ప్రోత్సాహం వల్లనే ఈ విజయాలు సాధించినట్లు చెప్పడం ఆమెలో ఉన్న అణకువకు తార్కాణం. ఏదేమైనా ప్రపంచ వ్యాప్తంగా భారత దేశ కీర్తిని మరింత ఇనుమడింప చేస్తు బాలికలందరిలో స్ఫూర్తిని నింపిన మలావత్ పూర్ణ అభినందనీయురాలు అనడంలో సందేహం లేదు.