iDreamPost
android-app
ios-app

ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు ఇవే..

ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు ఇవే..

వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ పథకానికి ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. అనధికారిక విద్యుత్‌ కనెక్షన్లను రెగ్యులైజ్‌ చేసేందుకు నిర్ణయించింది. ఈ రోజు సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకంతోపాటు పలు కీలక అంశాలపై విధాన పరమైన నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు.

– వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ పథకాన్ని మొదట పైలెట్‌ ప్రాజెక్టుగా శ్రీకాకుళంలో అమలు. ఏప్రిల్‌ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు నిర్ణయం.

– ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్‌ క్రీడలను ఏపీలో నిషేధం. మొదటిసారి దొరికితే ఒక ఏడాది జైలు, జరిమానా. రెండోసారి దొరికితే రెండేళ్ల జైలు, జరిమానా. ఆడేవారికి ఆరునెలల జైలు.

– ఎంపీడీవోలకు ప్రమోషన్లు ఇచ్చేందుకుగాను పంచాయతీ రాజ్‌ శాఖలో డివిజనల్‌ అభివృద్ధి అధికారి పోస్టుల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌.

– ఏపీ స్టేట్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు. ప్రభుత్వ ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న మనబడి నాడు నేడు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు నేడు, చేయూత, ఆసరా, అమ్మ ఒడి, వైఎస్సార్‌ రైతు భరోసా.. ఆరు పథకాల ప్లానింగ్, ఫైనాన్సింగ్‌ వ్యవహారాలను ఈ కార్పొరేషన్‌ పర్యవేక్షిస్తుంది.

– ప్రకాశం బ్యారేజీకి దిగువున మూడు టీఎంసీల సామర్థ్యంతో రెండు బ్యారేజీలు నిర్మాణానికి నిర్ణయం. పెనమలూరు మండలం చోడవం, మంగళగిరి మండలం రామచంద్రాపురం మధ్యన కృష్ణా నదిలో 1205 కోట్ల రూపాయలతో ఒకటి, మోపీదేవి మండలం బండికోళ్ల లంక గ్రామం, గుంటూరు జిల్లా రేపల్లె మండలం తూర్పు పాలెం మధ్యన 1150 కోట్ల రూపాయలతో రెండో బ్యారేజీ నిర్మాణానికి నిర్ణయం.

– పల్నాడు ప్రాంతంలో తాగు, సాగు అవసరాలను తీర్చేందుకు వరికపూడిచెల అనే ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు నిర్ణయం. ఇందు కోసం 1273 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు ఆమోదం.

– ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలలోని మెట్ట ప్రాంతాల్లో తాగు, 8 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు 15,385 కోట్ల రూపాయల వ్యయంతో బాబూ జగజ్టీవన్‌రాం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు ఆమోదం.

– రాయలసీమ కరువు నివారణ పథకం ద్వారా 14 పనుల పూర్తికి తీర్మానం.

– బాపట్లలో మెడికల్‌ కాలేజీకి మూలపాలెం, జమ్ములపాలెం గ్రామాల్లో 51 ఎకరాల కేటాయింపు.

– ప్రకాశం జిల్లా మార్కాపురంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కోసం రాయవరం గ్రామంలో 47 ఎకరాల కేటాయింపు.

– మావోయిస్టు పార్టీ, దాని అనుబంధ సంఘాలపై నిషేధం కొనసాగిస్తూ తీర్మానం.

– పశ్చిమగోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీష్‌ విశ్వవిద్యాయలం ఏర్పాటుకు నిర్ణయం.