iDreamPost
android-app
ios-app

పల్నాడు పల్లెల్లో మళ్లీ ఫ్యాక్షన్ చిచ్చు రగులుతోందా ? .

  • Published Jan 15, 2022 | 10:51 AM Updated Updated Mar 11, 2022 | 10:23 PM
పల్నాడు పల్లెల్లో మళ్లీ ఫ్యాక్షన్ చిచ్చు రగులుతోందా ? .

ఇటీవల వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్యతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది . పల్నాడు పల్లెల్లో గత పదిహేనేళ్ల కాలంగా చల్లారిన ఫ్యాక్షన్ గొడవలు ఈ అమానుష హత్యతో మళ్లీ చెలరేగుతాయేమోనన్న అనుమానంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది .

హత్య వెనకున్నది వైసీపీ నేతలేనని టీడీపీ నాయకులు పలువురు ఆరోపించారు . హత్య జరిగిన వెంటనే తీవ్రంగా స్పందించిన చంద్రబాబు ఇది వైసీపీ ప్రభుత్వ హత్యగా వర్ణించడంతో పాటు మృతుని అంత్యక్రియల సందర్భంగా మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాక అంతకంతా బదులు తీర్చుకొంటామని హెచ్చరించడంతో క్షేత్ర స్థాయి వైషమ్యాలను మరింత రెచ్చగొట్టినట్టు అయ్యింది .

ఈ అంశం పై ప్రెస్మీట్ నిర్వహించిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తాము హత్యా రాజకీయాలకు దూరమని ఇటీవల టీడీపీ నియమించిన మాచర్ల ఇంచార్జ్ నేపథ్యం , తీరు వలనే మళ్లీ పాత కక్షలు చెలరేగుతున్నాయని ఆ క్రమంలోనే ఈ హత్య జరిగిందని చెప్పుకొచ్చారు . పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి హత్య వెనకున్నది ఎవరైనా వారిని చట్టం ముందు నిలబెట్టడంతో పాటు భవిష్యత్ లో ఇలాంటి నేరాలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాలుగా అనుమానం ఉన్నచోట నిఘా ఏర్పాట్లు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖని కోరారు .

చంద్రయ్య హత్య జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని అల్లర్లు జరగకుండా పరిస్థితిని అదుపులోకి తేవడమే కాకుండా రూరల్ ఎస్పీ పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గంటల వ్యవధిలో ప్రధాన నిందితుడు చింతా శివరామయ్యతో సహా ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకొని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు . హతుడు తోట చంద్రయ్యకు , ప్రధాన నిందితుడు చింతా శివరామయ్య గుండ్లపాడు గ్రామంలో ఒకే ప్రాంతంలో నివసిస్తుంటారని వీరిరువురి మధ్య వర్గ విభేదాలతో పాటు ఒక సిమెంట్ రోడ్డు విషయంలో మనస్పర్థలు ఏర్పడ్డాయని ఈ వైరమే హత్యకు దారి తీసిందని తెలిపారు .

సమస్య మూలమేంటి ? . ఈ తరహా నేరాలు ఇంతటితో ఆగుతాయా ? .

తోట చంద్రయ్య హత్య మాత్రమే కాక పల్నాడు పల్లెల్లో గతంలో జరిగిన గొడవలు , హత్యల వెనకున్న కారణాలను పరిశోధిస్తే కొన్ని కఠిన వాస్తవాలు కనపడక మానవు . అన్ని గ్రామసీమల్లాగే పల్నాడు కూడా వ్యవసాయాధారిత ప్రాంతం . కరువుకు నిలయంగా పేరు పడ్డ పల్నాడులో రోషకావేశాలతో పాటు కక్షలూ కార్పణ్యాలు కూడా ఎక్కువే . 1970 కాలం వరకూ అడపాదడపా వివాదాలు , చెదురుమదురు ఘటనల వరకే పరిమితమైన విభేదాలు తర్వాతి రోజుల్లో రాజకీయ ప్రమేయంతో ముదిరిపోయి కత్తులు , నాటు బాంబులతో దాడులు , హత్యలు చేసే సంస్కృతి ప్రవేశించింది . ఇందుకు ప్రధాన కారణం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రధాన పార్టీల నాయకులు వర్గ విభేదాలని పెంచి పోషించడమే . తాము హత్య ఇతర నేరాలు చేసినా తమ పార్టీ నాయకులు అండగా ఉంటారని తమను కాపాడతారన్న ధీమాతో చిన్న వివాదానికి సైతం ప్రాణాలు తీసేంతగా కార్పణ్యాలతో కొన్ని దశాబ్దాలు పల్నాడు అట్టుడికిపోయింది .

పల్నాడు ముఖద్వారం అనబడ్డ నియోజకవర్గం నుండి ఓ ప్రధాన పార్టీకి ప్రాతినిథ్యం వహించి పలు శాఖలకు దీర్ఘకాలం మంత్రిగా కూడా నేత ఇంటిపేరుని సైతం ప్రజలు మర్చిపోయి బాంబులనే ఆయన ఇంటిపేరుగా పిలిచేవారు అంటే ఆయన రాజకీయం కోసం పల్నాడు పల్లెల్లో ఏ స్థాయిలో వర్గ విభేదాలు పెంచి పోషించారో అర్థం చేసుకోవచ్చు . ఆయన నియోజకవర్గంలో మాత్రమే కాక పల్నాడు వ్యాప్తంగా ఓ పార్టీ తాలూకూ వ్యవహారాలు , అసెంబ్లీ నియోజకవర్గాల , ప్రాంతీయ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక మొత్తం సదరు నాయకుడి కనుసన్నల్లోనే జరిగేవి .

ఈ క్రమంలో పెచ్చు మీరిన వర్గ విభేదాలు , ఫ్యాక్షన్ గొడవలు పలు కుటుంబాల్లో ఆరని చిచ్చుకు కారణభూతమయ్యాయి . గ్రామ ఆధిపత్యం కోసం అన్నదమ్ముల పిల్లలు , బావ ,మరుదులు వారి పిల్లలు అనుబంధాలు మరిచి ఆత్మీయుల్ని చంపుకొనేంతగా ఫ్యాక్షన్ భూతం కోరల్లో పల్లెలు చిక్కుకోవడంలో అన్ని రాజకీయ పార్టీల పాపం ఉంది . గొడవల్లో పై చేయి సాధించిన వారిని , హత్య , దొమ్మీ వంటి నేరాల్లో కీలక భాగస్వాములని పల్నాటి పులి , పల్నాడు టైగర్ అంటూ బిరుదులతో పిలుచుకోవడం అన్ని పార్టీల్లో సర్వసాధారణం అయిపోయింది .

అయితే 2005 తర్వాత మారిన సామాజిక స్థితిగతులు , పెరిగిన ఉద్యోగ , ఉపాధి అవకాశాలతో పాటు ఈ తరహా వర్గ పోరుకు రాజకీయ నాయకుల సహకారం తగ్గడంతో ఫ్యాక్షన్ నేరాలు క్రమేపీ తగ్గుముఖం పట్టి గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయి . క్రమంగా ఫ్యాక్షన్ ప్రోత్సహించే నాయకులు కూడా రాజకీయంగా కనుమరుగు అవ్వడంతో ఇక పల్నాడులో ఫ్యాక్షన్ భూతం అంతరించినట్టే అని సామాన్య ప్రజలు ఆనందించే వేల టీడీపీ నేత తోట చంద్రయ్య హత్యతో మళ్లీ ఫ్యాక్షన్ గొడవలు ప్రారంభమవుతాయేమోనన్న ఆందోళన పల్నాడు పల్లెల్లో నెలకొంది .

చంద్రయ్య , శివరామయ్య వర్గాల మధ్య దీర్ఘకాలిక విభేదాలు ఉన్న విషయం మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా తెలిసిందే . శివరామయ్య వైసీపీ తరుపున మండల నాయకుడిగా వ్యవహరిస్తుండగా , చంద్రయ్య టీడీపీ గుండ్లపల్లి గ్రామ అధ్యక్షుడిగా ఉన్నాడు . చంద్రయ్య తనయుడు తోట వీరాంజి TNSF నరసరావుపేట పార్లమెంట్ విభాగం అధ్యక్షుడిగా, టీడీపీ ప్రధాన కార్యాలయంలో సోషల్ మీడియా విభాగంలో పని చేస్తున్నాడు . ఇరువురి మధ్య విభేదాలు ఉన్నా హత్యలు చేసుకునేంత కారణాలూ కాదు . ఆ తరహా నేరాలకు కొద్ది రోజుల క్రితం వరకూ ప్రధాన రాజకీయ పార్టీల ప్రోత్సాహ , సహకారాలు లేవు .

మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా మాచర్లలో టీడీపీకి ప్రాతినిథ్యం వహించే ప్రజాబలం ఉన్న నేత లేకపోవడంతో గతంలో టీడీపీకి ప్రాతినిథ్యం వహించిన జూలకంటి కుటుంబం నుండి 2004 , 2009 ఎన్నికల్లో పోటీ చేసి తీవ్ర ఫ్యాక్షన్ నేపథ్యం కారణంగా ఓడిపోయి రాజకీయంగా దాదాపు కనుమరుగైన జూలకంటి బ్రహ్మారెడ్డిని మాచర్ల నియోజక వర్గ టీడీపీ ఇంచార్జ్ గా నియమించడంతో పల్నాడులో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పొచ్చు . 2001 లో రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన మాచర్ల ఏడు హత్యల ఘటనలో ప్రధాన నిందితుడు జూలకంటి బ్రహ్మారెడ్డి . ఈ ఒక్క ఘటనే కాక బ్రహ్మారెడ్డి తల్లి దుర్గంబ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న 1999 -2004 కాలంలో మరికొన్ని తీవ్ర వివాదాల్లో సైతం ప్రధానంగా నలిగిన పేరు బ్రహ్మారెడ్డిది . ఈ ఏడు హత్యల ఘటనతో భయాందోళనల్లో కూరుకుపోయిన పల్నాడు ప్రజానీకం వరుసగా రెండుసార్లు బ్రహ్మారెడ్డి నాయకత్వాన్ని తిరస్కరించగా 2012 ఉప ఎన్నికల్లో చంద్రబాబు అతన్ని తప్పించడంతో రాజకీయంగా కనుమరుగయ్యాడు అని చెప్పొచ్చు .

ప్రస్తుతం మాచర్లలో పిన్నెల్లికి ధీటైన అభ్యర్థి దొరకని చంద్రబాబు వివాదాస్పదుడైన బ్రహ్మారెడ్డిని నియోజక వర్గ ఇంచార్జ్ గా ప్రకటించగానే రాజకీయాలకతీతంగా పలువురు వ్యతిరేకించినా బాబు అతన్నే నియమించాడు . శత్రువుని అంతమొందించడం సమస్యని పరిష్కరించడం అనుకొనే కొన్ని వర్గాలకు చెందిన కొంతమందికి బ్రహ్మారెడ్డి నియామకం కొత్త ఉత్సాహం ఇచ్చింది అనడం అతిశయోక్తి కాదు . ఈ పరిణామాల ప్రభావం కారణంగా జరిగిన ప్రతిచర్య తోట చంద్రయ్య హత్య అనేది కఠోర సత్యం .

జరిగిన అమానుష హత్య వెనుక జూలకంటి , పిన్నెల్లిల ప్రత్యక్ష ప్రమేయం పరోక్ష ప్రోత్సాహం లేకపోయినా బ్రహ్మారెడ్డిని ఇంచార్జ్ గా ప్రకటించడంతో అనుభవజ్ఞులు ఊహించిన ప్రభావం బయటపడిందని చెప్పొచ్చు . విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇటీవల గుండ్లపల్లిలోని తోట చంద్రయ్య వర్గంలోని ముఖ్యులు సమావేశమై చింతా శివరామయ్యని అడ్డు తప్పిస్తే రానున్న ఎన్నికల్లో తమ ఆధిపత్యానికి అడ్డు ఉండదని తీర్మానించుకొని అందుకు కార్యాచరణ రూపొందించుకొని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసుకొన్నారన్న వార్త ఆ గ్రామంలో అంతర్గత చర్చల్లో చోటు చేసుకొంది . ఈ పరిణామం తర్వాతే చంద్రయ్య హత్య జరగటం గమనార్హం . నిందితులు హత్య చేస్తున్న సమయంలో పెనుగులాటలో చంద్రయ్య బొడ్డులో ఉన్న కత్తి ప్రధాన నిందితుడు శివరామయ్యకి గీసుకుపోవడంతో 18 కుట్లు పడ్డాయని అనధికారిక సమాచారం .

ఈ ఘటన తర్వాత ప్రెస్ మీట్లో పిన్నెల్లి మాట్లాడుతూ ఇటీవలి కాలంలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు లేవు , అసెంబ్లీ ఎన్నికలు కానీ , స్థానిక ఎన్నికలు కానీ లేవు . వివాద పూర్వక ఘటనలు లేవు . అలాంటప్పుడు హఠాత్తుగా ఈ హత్య జరగటానికి గల కారణాలేంటో పోలీసులు లోతుగా విచారించి భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా అడ్డుకట్ట వేయాలని కోరడాన్ని గమనిస్తే ఏ విధమైన వివాదాస్పద అంశమూ లేకుండా రాజకీయ ఉద్రిక్త పరిస్థితులేవి లేని పరిస్థితుల్లో జరిగిన ఈ హత్య ఇటీవల బాబు తీసుకొన్న నిర్ణయ ప్రభావం అని చెప్పవచ్చు .

ఈ పరిస్థితులు పునరావృతం కాకుండా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పోలీసులు , నిఘావిభాగం వారు ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు చర్యలు తీసుకొని అదుపు చేయని పక్షంలో మళ్లీ పల్నాడు ప్రాంతాన్ని ఫ్యాక్షన్ భూతం కొన్నాళ్ళు వెంటాడబోతుందని చెప్పొచ్చు . రాజకీయ వర్గాలు కూడా స్వప్రయోజనాల కోసం కాకుండా ప్రాంత మేలు కోరి ఇలాంటి ఘటనలకు సహకారం అందించకుండా ఉండటంతో పాటు పునరావృతం కాకుండా అదుపు చేసే బాధ్యత వహించాల్సి ఉంటుంది .