అమరావతి రాజధాని వ్యవహరంలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిదంటూ వచ్చిన ఆరోపణలను విచారించటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. వారు ప్రాధమికంగా 4070 ఎకరాల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని రిపోర్ట్ ఇచ్చారు.
తదుపరి విచారణ కోసం ఇంటెలిజెన్స్ డిఐజి కొల్లి రఘురామ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పలు కోణాలలో విచారించిన SIT భూకొనుగోళ్లలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని నివేదికను ప్రభుత్వానికి అందచేసింది.SIT రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ అధికారులు అమరావతి పరిసర ప్రాంతాలలో భూములను కొనుగోలు చేసిన వారిపై కేసులను నమోదు చేసింది.
ఈ కేసులో మాజీ అడ్వొకేట్ జనరల్ దొమ్మలాపాటి శ్రీనివాస్ మరియు ఆయన కుటుంబానికి చెందిన కొందరితో పాటు ఒక న్యాయమూర్తి ఇద్దరు కుమార్తెలపైన అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. దీనితో ఈ కేసు విచారణను నిలిపి వేయాలని,ఏ సంస్థ తనను అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని ,FIRలోని విషయాలను ప్రధాన మరియు సోషల్ మీడియాలో పబ్లిష్ కాకుండా ఆదేశించాలని దొమ్మాలపాటి శ్రీనివాస్ హై కోర్టుకు వెళ్లారు.
కోర్టు ఉత్తర్వులు
ఈ కేసును విచారించిన ఏపీ హైకోర్టు ఏసీబీని తొందరపాటు చర్యలు వద్దని స్పష్టం చేసింది. దర్యాప్తులను నిలుపుదల చేయమని ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు, అందులోని వివరాలను ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ప్రసారం చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఏ మీడియాలో రాకుండా హోంశాఖ కార్యదర్శి, ఏపీ డీజీపీ, ఐ&పీఆర్ సంస్థలకు ఆదేశాలను జారీ చేసింది. ఈ పిటీషన్ పై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది.
Also Read:విచారణ నిలిపివేయండి, వివరాలు మీడియాలో వద్దు
హైకోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు
హైకోర్టు ఇచ్చిన తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీనియర్ జర్నలిస్ట్ రాజదీప్ సర్దేశాయ్ “నా దృష్టిని ఆకర్షించిన కథ: ఎఫ్ఐఆర్ లో ఒక ఆమ్ ఆద్మీ పేరు పెట్టబడినప్పుడు, చెత్త కోసం సిద్ధంగా ఉండండి .. ఒక ఖాస్ ఆద్మీ పేరు ఎఫ్ఐఆర్ లో పెట్టబడినప్పుడు న్యాయస్థానంలో జరిగిన విషయాలు బయట మాట్లాడ కూడదని ఆంక్షలు వర్తిస్తాయి” అంటూ ఓ కథనాన్ని ట్యాగ్ చేశారు.
ఇటీవలే సుప్రీంకోర్ట్ లో ధిక్కారణ కేసు ఎదురుకున్న ప్రశాంత్ భూషణ్ హైకోర్టు తీర్పుపై షాకింగ్ కలిగించింది అంటూ ట్వీట్ చేయడం గమనార్హం. గత ప్రభుత్వానికి చెందిన ముఖ్యమైన వ్యక్తులకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం నియమించిన ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వాస్తవాలను నివేదించకుండా మీడియా, సోషల్ మీడియాని నిషేధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం దిగ్బ్రాంతి కలిగించింది. పిటీషన్ లో ఇటువంటి విజ్ఞప్తులు లేకపోయినా హైకోర్ట్ ఇలాంటి తీర్పు ఇవ్వడం ఆర్టికల్ 19 & ఆర్టీఐకి పూర్తి వ్యతిరేకమని ట్వీట్ చేశారు.
ఆ తరువాత ప్రశాంత్ భూషణ్ మరో ట్వీట్ చేశారు. “ఎఫ్ఐఆర్ నమోదు, అందులోని వివరాలను ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ప్రసారం చేయరాదని మాజీ అడ్వకేట్ జనరల్ పిటీషన్ లో కోరినట్లు తెలిసింది. అయినా హైకోర్టు ఇటువంటి విషయంలో పీటీషనర్ కు అనుకూలంగా తీర్పును ఇవ్వడం గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇది ప్రజల హక్కులను కాలరాయడమే కాకుండా పుకార్లకు దారి తీస్తుంది” అంటూ ట్వీట్ చేశారు.
ప్రశాంత్ భూషణ్,రాజదీప్ సర్దేశాయ్ తో పాటు ఉమా సుధీర్,రాహుల్ శివ శంకర్,వినోద్ జొస్,పారంజోయ్ గుహ,ఎంకే వేణు సునీల్ జైన్ ఇంకా పలువురు హైకోర్టు తీర్పు పై ముఖ్యంగా FIR వివారాలు బయటపెట్టోదంటూ “Gag Order”ను ప్రయోగిచటం మీద స్పందించారు.
అడ్వకేట్ జనరల్ స్థాయిలో పని చేసిన వ్యక్తి నుంచి ఇటువంటి విజ్ఞప్తులు రావడంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇంత గోప్యత ఎందుకు పాటిస్తున్నారంటూ సందేహలు నెలకొన్నాయి. ఈ కేసు గురించి ఎవరూ, ఏమి, ఎక్కడ, ఎలాంటి మీడియాలలో మాట్లాడకూడదు అనే ఉత్తర్వు వలన “వారి” గురించి మాట్లాడుకోవడేమే ఎక్కువవుతుంది. ఈ ఆసక్తితో ఇదే విషయంపై జాతీయ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.