iDreamPost
iDreamPost
గుజరాత్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ కౌన్సిలర్ మరియు అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లో మాజీ ప్రతిపక్ష నాయకుడు అయిన బద్రుద్దీన్ షేక్ కరోనా కారణంగా మరణించారు. కరోనా వైరస్ దేశంలో వ్యాప్తి చెందిన నేపథ్యంలో లాక్ డౌన్ లో ఉన్న పలువురి పేదలకు సాయం అందిస్తూ తిరిగిన బద్రుద్దీన్ కు కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నట్టు అనుమానం రావడంతో పరీక్షించగా ఏప్రిల్ 15 న కరోనా ఉన్నట్టు నిర్దారణ అయింది. దీంతో అతన్ని ఎస్విపి ఆసుపత్రిలో చేర్చారు. కొన్ని రోజులు గృహ దిగ్బంధంలో ఉన్న బద్రుద్దీన్ షేక్ కు షుగర్ వ్యాధితో పాటు గుండెకు సంబంధించిన సమస్యలు కుడా ఉండటంతో వారం రోజులుగా వెంటిలేటర్ సహాయంలో ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తుంది.
గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ కుటుంబంలో సీనియర్ నాయకుడైన బద్రుద్దీన్ షేక్ యూత్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు మాకు తెలుసు, అతను పేదల కోసం పని చేస్తూనే ఉన్నాడు, బద్రుభాయ్ గుజరాత్ కాంగ్రెస్ యొక్క బలమైన స్తంభం “ఈ రోజు నాకు మాటలురావడంలేదు” అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శక్తి సింగ్ గోహిల్ ట్వీట్ చేస్తూ రాశారు. బద్రుద్దీన్ షేక్ భార్యకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టు అయితే ఇప్పుడు ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు.