మాచో స్టార్ గా మంచి ఫాలోయింగ్ ఉన్న గోపీచంద్ గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఎంతగా ఇబ్బంది పడుతున్నాడో చూస్తూనే ఉన్నాం. గట్టిగా చెప్పుకునే హిట్టు కొట్టి చాలా ఏళ్ళు అయ్యింది. 2015లో జిల్ ఓ మాదిరిగా పర్వాలేదు అనిపించుకున్నాక అయిదారు డిజాస్టర్లు క్యూ కట్టి పలకరించాయి. ఆరడుగుల బులెట్ ఏకంగా విడుదల కాకుండా ఏళ్ళ తరబడి ల్యాబులోనే మగ్గుతోంది. అందుకే తన ఆశలన్నీ ఇప్పుడు రాబోయే సీటిమార్ మీదే ఉన్నాయి. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో గోపీచంద్ కోచ్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. రచ్చ, గౌతమ్ నందా ఫేమ్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఇందాకే ట్రైలర్ విడుదల చేశారు.
కార్తీ(గోపీచంద్)అమ్మాయిలకు కబడ్డీ నేర్పించే కోచ్. ఎవరైనా నేరుగా పేరుతో ఒరేయ్ అని పిలిస్తే ఇతనికి కోపం. ఆరు ఊళ్లు ఆడితే ఆట బయట ఆడితే వేట అని నమ్మే కార్తీకి తాను ఎంతో ప్రేమించే క్రీడను కబళించేందుకు ఓ విషసర్పం(తరుణ్ అరోరా)బయలుదేరుతుంది. దీంతో కార్తీకి గ్రౌండ్ లోనే కాకుండా బయట కూడా పోరాటాలు యుద్ధాలు చేసే పరిస్థితి వస్తుంది. అసలు ఇంతకీ ఇతగాడు విమెన్ టీమ్ నే ఎంచుకుని ఎందుకు కోచింగ్ ఇస్తున్నాడు. మరో శిక్షకురాలు(తమన్నా)కు సంబంధం ఏమిటి లాంటి ప్రశ్నలు తెరమీదే చూడాలి. పేరుకి స్పోర్ట్స్ డ్రామా అయినప్పటికీ కావాల్సినన్ని కమర్షియల్ అంశాలు ఇందులో జొప్పించారు.
విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. కబడ్డీని నేపథ్యంగా తీసుకున్నప్పటికీ మాస్ ని టార్గెట్ చేసిన అంశాలు గట్టిగానే ఉన్నాయి. శ్రీమంతుడు తరహా ఫైట్, జూనియర్ ఎన్టీఆర్ స్టైల్ హీరోయిజం డైలాగులు వెరసి ఆల్ ఇన్ వన్ ఎంటర్ టైనర్ గా కనిపిస్తోంది. మణిశర్మ సంగీతం, సౌందర రాజన్ ఛాయాగ్రహణం గ్రాండియర్ కు తగ్గట్టే ఉన్నాయి. అయితే ఎమోషనల్ గా సాగాల్సిన ఇలాంటి ఆటల సినిమాను ఇలా మసాలా టైపులో ట్రై చేయడం ఏదో కొత్తగానే ఉంది. కంటెంట్ సరిగ్గా కనెక్ట్ అయితే గోపిచంద్ కు మరో హిట్ వచ్చినట్టే ప్రపంచవ్యాప్తంగా సీటిమార్ ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Teaser Link @ http://bit.ly/3savFjC