ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మండల పరిషత్తులకు ఇక ఇద్దరు మండల ఉపాధ్యక్షులు ఉండనున్నారు. రెండో ఉపాధ్యక్ష పదవులకు మంగళవారం నాడు ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణలో స్థానిక ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మండల పరిషత్‌లో రెండో ఉపాధ్యక్ష పదవిని ఏర్పాటు చేస్తూ ఇటీవలే అసెంబ్లీలో చట్ట సవరణ చేసిన సంగతి తెలిసిందే. దీనికి ముందు గుంటూరు జిల్లా దుగ్గిరాల మినహా మిగిలిన 649 మండలాల్లో మండల పరిషత్ అధ్యక్ష, ఒక ఉపాధ్యక్ష పదవులతో పాటు కోఆప్టెడ్ సభ్యుని ఎన్నిక జరిగింది.
ప్రభుత్వ చట్ట సవరణ నేపథ్యంలో గుంటూరు జిల్లా దుగ్గిరాల మినహా మిగిలిన 649 మండలాల్లో రెండో ఉపాధ్యక్ష పదవికి కూడా ఎన్నిక నిర్వహించారు. ఉ.11 గంటలకు అన్నిచోట్ల మండల పరిషత్ ప్రత్యేక సమావేశాలు మొదలు కాగా ఎంపీటీసీ సభ్యులు రెండో ఉపాధ్యక్షుడిని ఎన్నుకున్నారు. దాదాపుగా అన్ని చోట్లా అధికార వైసీపీకే బలం ఉండడంతో రెండవ వైస్ ఎంపీపీ పదవులు అన్నీ వైసీపీ మద్దతుదారులకు దక్కాయి. ఇవి కాక విశాఖ జిల్లా మాకవరం ఎంపీపీ రాజీనామాతో ఆ స్థానానికి కూడా ఈరోజు ఎన్నిక జరిగింది.
అలాగే, చిత్తూరు జిల్లా రామకుప్పం, గుర్రంకొండలో మండలాధ్యక్ష పదవులకు, కృష్ణాజిల్లా ఆగిరిపల్లిలో మొదటి ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక జరిగింది. ఇవే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపోయిన ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక మంగళవారం జరిగింది. ఇక రాజీనామా కారణంగా ఖాళీగా ఉన్న కర్నూలు జెడ్పీ చైర్మన్ ఎన్నిక కూడా మంగళవారం జరగగా కర్నూలు జెడ్పీ ఛైర్మన్‌గా యర్రబోతుల పాపిరెడ్డి(వైఎస్సార్‌సీపీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీటీసీలకు కేటాయించిన రిజర్వేషన్లు పోను మిగిలిన కులాలకు, సామాజిక వర్గాలకు రెండో వైస్ ఎంపీపీ అభ్యర్థులుగా పార్టీ అవకాశం కల్పించింది. ఒకరకంగా అధికార పార్టీలో ఉన్నవారికి ఇది సదావకాశం అనే చెప్పాలి.