ఎడ్డమంటే తెడ్డమనేలా రాష్ట్ర ప్రభుత్వంతో వ్యవహరిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మండల, జిల్లా పరిషత్ ఎన్నికలపై పూర్తిగా చేతులు ఎత్తేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నది జరగకూడదనేలా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇప్పటి వరకు వ్యవహరించిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. పదవీ విరమణ చేస్తున్న చివరి దశలోనూ అదే తీరును కనబరుస్తున్నారు. మధ్యలో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేస్తే పరిపాలనా పరంగా ఇబ్బందులు ఉండవని, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండగా.. అందుకు విరుద్ధంగా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు ఏ మాత్రం ప్రయత్నాలు చేయడం లేదు.
తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై తన మనసులోని మాటను నిమ్మగడ్డ బయట పెట్టారు. ఎన్నికలు నిర్వహించేందుకు తగినంత సమయం లేని కారణంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వలేకపోతున్నాని చెబుతున్నారు. పరిషత్ ఎన్నికలను వెంటనే నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసిన కారణంగా.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేకపోతున్నానని, ఉద్యోగులు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్న తరుణంలో ఎన్నికలు నిర్వహిస్తే.. ఆ ప్రక్రియకు ఆటంకం కలుగుతుందంటూ నిమ్మగడ్డ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త కమిషనర్ భుజస్కంధాలపైనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ బాధ్యత ఉందంటూ ఆ ఉత్తర్వుల్లో చెప్పుకొచ్చారు.
తాజాగా నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం.. ఆయన రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని స్పష్టమవుతోంది. ఫిబ్రవరిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎన్నికలు మరికొన్ని రోజులు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులు విన్నవించినా.. వారి వినతులు, ఆందోళనలను పెడచెవిన పెట్టిన నిమ్మగడ్డ.. ఎన్నికలు నిర్వహిస్తానంటూ ఏక పక్షంగా నోటిఫికేషన్ జారీ చేశారు. కోర్టులో పిటిషన్లు విచారణలో ఉండగానే.. నోటిఫికేషన్ జారీ చేసిన నిమ్మగడ్డ.. తనకున్న విచక్షణాధికారంతో ఈ నిర్ణయం తీసుకున్నానంటూ చెప్పుకొచ్చారు. ఈ రోజు మాత్రం ఉద్యోగులు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటున్న కారణంగా.. ఎన్నికల ప్రక్రియ అందుకు ఆటంకం కలగరాదనే నోటిఫికేషన్ జారీ చేయలేకపోతున్నానంటూ చెప్పుకొస్తుండడం గమనార్హం.
Also Read : కొత్త కమిషనర్ వచ్చాకే పరిషత్ ఎన్నికలు.. నిమ్మగడ్డకు మాయని మచ్చ..
తగిన సమయం లేదని చెబుతున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. మాటల్లో నిజమెంతనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ నెల 14వ తేదీన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 18వ తేదీన మేయర్, చైర్మన్‌ల ఎన్నికలు పూర్తయ్యాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎకగ్రీవాలపై విచారణ జరపాలన్న ఎస్‌ఈసీ ఆదేశాలను ఏపీ హైకోర్టు ఈ నెల 16వ తేదీనే కొట్టివేసింది. దీంతో పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోయాయి. పుర ఫలితాలు వెల్లడైన 14వ తేదీన నుంచి ఈ రోజు వరకూ మిన్నుకుండిపోయిన నిమ్మగడ్డ.. తన పదవీ విరమణకు మరో ఆరు రోజుల సమయం ఉందనగా.. సమయం లేదంటూ హాస్యాస్పదమైన కారణాలు చెబుతున్నారు.
వాస్తవంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభమైన తర్వాత ఆరు రోజుల్లోనే పూర్తవుతుంది. గత ఏడాది మార్చిలో ఇదే నిమ్మగడ్డ.. కరోనాను సాకుగా చూపుతూ.. అభ్యర్థుల తుది జాబితా ప్రకటించి.. ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభమైన తర్వాత ఉన్నఫళంగా వాయిదా వేశారు. ఎన్నికల ప్రచారం, ఆ తర్వాత పోలింగ్, కౌటింగ్‌కు మొత్తం ఆరు రోజుల్లోనే పూర్తవుతుంది. ఈ నెల 11వ తేదీన మున్సిపల్ పోలింగ్ జరిగింది. 14న ఫలితాలు వచ్చాయి. ఈ సమయంలోనైనా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు బోలెడు సమయం ఉంది. ఒక వేళ మేయర్, చైర్మన్‌ల ఎన్నికలు ఉన్నాయనుకుంటే.. అవి ముగిసిన 18వ తేదీ తర్వాతైనా నిమ్మగడ్డ పదవీ విరమణకు ఇంకా 12 రోజుల సమయం ఉంటుంది.
గత నెల 21వ తేదీన పంచాయతీ ఎన్నికల నాలుగో దశ పూర్తయిన వెంటనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసిన నిమ్మగడ్డ.. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత పరిషత్ ఎన్నికలపై మాత్రం మీనమేషాలు లెక్కించారు. శెలవుపై వెళ్లారు. ఆ తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నానని చెప్పారు. ఇప్పుడు తగిన సమయం లేదని, వ్యాక్సినేషన్‌కు ఇది ఆటంకమని, హైకోర్టు తీర్పు అంటూ.. కుంటిసాకులు చెబుతున్నారు.
గత ఏడాది నవంబర్ నుంచి జనవరి వరకు మూడు నెలలపాటు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎంతో తపన పడిన నిమ్మగడ్డ.. గవర్నర్ వద్దకు, కోర్టుల చుట్టూ కాలుకాలిన పిల్లిలా తిరిగారు. ఈ రోజు అందుకు భిన్నమైన తీరుతో వ్యవహరిస్తుండడం విశేషం.
Also Read : నిమ్మగడ్డ కోరితే జగన్ మన్నిస్తారా? ఆయన్నే కొనసాగిస్తారా?
ఈ తరహా ప్రవర్తన వెనుక కారణం ఏమిటన్నది అందరికీ తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగకపోడంతో.. తమకు తోచిన విధంగా లెక్కలు వేసి.. తాము వైసీపీతో సమానంగా పంచాయతీలు గెలుచుకున్నామని ఎక్సెల్ షీటులో గణాంకాలు వేసి టీడీపీ ప్రచారం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు కారణంగా.. వైసీపీ అరాచకాలు చేసిందని, ఓటర్లుకు డబ్బులు పంచిందని చెప్పుకుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే తరహా ఫలితాలు వస్తే.. గ్రామాల్లోనూ తమ బేలతనం బయటపడుతుందని భావించిన టీడీపీ.. నిమ్మగడ్డ హాయంలో పరిషత్ ఎన్నికలు జరగకూడదని కోరుకుంటోంది.
పైగా పరిషత్ ఎన్నికల్లోనూ వైసీపీ హావా వీస్తే.. టీడీపీకి అనుకూలంగా, అధికార పార్టీకి బద్ధ వ్యతిరేకిగా ముద్రపడిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కమిషనర్‌గా ఉన్న సమయంలోనే వైసీపీ ఘన విజయం సాధించిందనే ముద్ర పడుతుంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతోపూ ఈ తరహా చర్చ ప్రజల్లో జోరుగా సాగుతోంది. ఇలాంటి ప్రచారం వల్ల టీడీపీకి ఊహించలేనంత నష్టం జరుగుతోంది. పరిషత్ ఎన్నికలు తన హాయంలో జరగకుండా చూస్తే.. కొద్దో గొప్పో ఇలాంటి ప్రచారం నుంచి టీడీపీకి ఊరట లభిస్తుందని నిమ్మగడ్డ భావిస్తున్నట్లుగా ఉన్నారు. అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల బాధ్యత కొత్త కమిషనర్‌దేనంటూ కూడా చెప్పుకొస్తున్నారు.
నిమ్మగడ్డ లేదా కొత్త కమిషనర్.. ఎవరి హాయంలో పరిషత్ ఎన్నికలు జరిగినా.. ప్రజా తీర్పులో ఎలాంటి మార్పు ఉండదు. మున్సిపల్ ఎన్నికల్లో మాదిరిగా పరిషత్ ఎన్నికల్లోనూ వైసీపీ గెలిస్తే.. దానికి కారణం అధికార పార్టీ నియమించిన కొత్త కమిషనర్‌పైకి నెట్టివేసే అవకాశం టీడీపీకి ఉంటుంది.
ప్రతి ఐదేళ్లకు ఒకసారి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేవే. ఎవరో ఒకరు గెలుస్తూనే ఉంటారు. కానీ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్.. పక్షపాత ధోరణితో, వ్యక్తిగత లక్ష్యాలతో పని చేశారనే అపవాదు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మూటకట్టుకున్నారనడంలో సందేహం లేదు. ఈ అపవాదును నిమ్మగడ్డ బతికి ఉన్నంత కాలం మోయక తప్పదు.
Also Read : చరిత్రను తిరగరాస్తున్న వైఎస్ జగన్
16721