iDreamPost
iDreamPost
రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల్లో విజేతలు బాధ్యతల స్వీకరణ ప్రారంభమవుతోంది. శుక్రవారం నాడు ఎంపీటీసీలు, శనివారం జెడ్పీటీసీలు పదవుల్లోకి వస్తారు. అదే రోజుల్లో ఎంపీపీలు, జెడ్పీ చైర్ పర్సన్ల ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నారు. దానికి అనుగుణంగానే ఎంపీటీసీలకు సెప్టెంబర్ 24, జెడ్పీటీసీలకు 25వ తేదీని కొలబద్దగా తీసుకుని కాలపరిమితి నిర్ణయించారు. ఆ తేదీల నుంచి ఐదేళ్ల పాటు పదవుల్లో ఉండేందుకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
ఈ ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘకాలం పాటు సాగింది. గతంలో ఎన్నడూ స్థానిక ఎన్నికలకు ఏడాదిన్నర సమయం పట్టిన పరిస్థితి లేదు. కానీ ఈసారి మాత్రం ఓవైపు కరోనా, మరోవైపు నాటి ఎస్ఈసీ నిమ్మగడ్డ ఏకపక్ష వైఖరి మూలంగా ఈ ఎన్నికలు సాగదీయాల్సి వచ్చింది. 2020 మార్చి 7వ తేదీన నోటీఫికేషన్లు ఇచ్చారు. నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. అదే నెల ఆఖరిలోగా మొత్తం ప్రక్రియ ముగించాల్సి ఉండగా అనూహ్యంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు నిర్వహించిన తరుణంలో పరిషత్ ఎన్నికలు కూడా పూర్తి చేయాల్సి ఉండగా నిమ్మగడ్డ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. ఎటువంటి కారణం లేకుండానే ఈ ఎన్నికలను పక్కన పెట్టేశారు.
Also Read : తూర్పు జెడ్పీ పీఠంపై ‘వేణు’గానం
దాంతో నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించగానే ఎస్ఈసీ ఈ ఎన్నికలకు రంగం సిద్ధం చేసింది. ఏప్రిల్ 8న పోలింగ్ నిర్వహించింది. ఆ తర్వాత కూడా పలితాలు వెల్లడికాకుండా న్యాయపరమైన అడ్డంకులకు కొందరు ప్రయత్నించారు. ముఖ్యంగా టీడీపీ, బీజేపీకి చెందిన నేతలు పరిషత్ ఎన్నికలకు కుంటి సాకులు చెబుతూ ఫలితాలు రాకుండా అడ్డుకునే యత్నం చేయడం న్యాయపరమైన వివాదంగా మారింది. సింగిల్ బెంచ్ ఈ ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలనడం, దానిని కొట్టేస్తూ సెప్టెంబర్ 16న సీజేతో కూడిన ధర్మాసనం తీర్పు ఇవ్వడంతో చివరకు సెప్టెంబర్ 19న ఫలితాలు వెల్లడయ్యాయి. అప్పటికే కొన్నిచోట్ల బ్యాలెట్ బ్యాక్సులు తడిచిపోవడం, చెదలు పట్టడం, పోటీలో ఉన్న కొందరు నేతలు మరణించడం వంటివి జరిగాయి. చివరకు ఫలితాలు రావడంతో విజేతలు బాధ్యతల స్వీకరణకు సన్నద్ధమయ్యారు
దానికి అనుగుణంగానే ఎస్ఈసీ కూడా ఈ ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమయినప్పటికీ పదవుల్లోకి వచ్చిన తేదీనే పరిగణలోకి తీసుకుంది. దానికి అనుగుణంగా వారి పదవీకాలాన్ని నిర్దారించింది. 2026 సెప్టెంబర్ 24 వరకూ ఎంపీటీసీలు, 25వ తేదీ వరకూ జెడ్పీటీసీలకు అధికారంలో ఉంటుందని ప్రకటించింది.
Also Read : పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు.. జడ్పీ పీఠాలు అధిరోహించబోయేది వీరేనా..?