Idream media
Idream media
త్వరలో హుజూరాబాద్‌లో జరిగే ఉప ఎన్నిక సంగ్రామంలో విజయం కోసం టీఆర్‌ఎస్ సహా అన్ని పక్షాలూ తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాయి. గెలిచే దారులను వెదుకుతున్నాయి. ఎన్నికలలో గెలుపోటములకు కీలక పాత్ర వహించేది సామాజిక సమీకరణాలే. అందుకే పార్టీలైనా, అభ్యర్థులైనా వాటిపైనే దృష్టి సారిస్తారు. ఈ క్రమంలో హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా సామాజిక సమీకరణాలు కీలకం కాబోతున్నాయి. వాటిని ప్రధాన రాజకీయ పార్టీలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. అందుకు అనుగుణంగానే టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తగిన కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి.
అందరి దృష్టీ వాటిపైనే
అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణల నేపథ్యంలో కేబినెట్ నుంచి బర్తరఫ్‌కు గురైన ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉప ఎన్నిక ఖాయమైంది. ఈ స్థానంలో గెలుపు కోసం టీఆర్‌ఎస్, బీజేపీ సాధారణ ఎన్నికల స్థాయిలో ఇప్పటికే శ్రమిస్తున్నాయి. వ్యూహ, ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సామాజిక సమీకరణాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Also Read : ప్రకాశం వాసుల చిరకాల స్వప్నం సాకారం చేసిన జగన్ సర్కార్
ఎస్సీలు 45 వేలు
అసెంబ్లీ సెగ్మెంట్‌లో హుజూరాబాద్, జమ్మికుంట మునిసిపాలిటీలు, కమలాపూర్, వీణవంక, ఇల్లందకుంట మండలాలు ఉన్నాయి. ఓటర్లు 2,26,553 మంది ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం.. మొత్తం ఓటర్లలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు అత్యధికంగా 45వేల మందితో మొదటి స్థానంలో ఉండటం విశేషం. ఆ తర్వాత 29వేల ఓట్లతో కాపు సామాజిక వర్గానికి చెందిన వారు రెండవ స్థానంలో ఉండగా, 28వేల ఓట్లతో పద్మశాలీలు మూడో స్థానంలో ఉన్నారు. ముదిరాజ్, గౌడ సామాజిక వర్గం వారి ఓట్లు 26వేల చొప్పున ఉన్నాయి. గొల్ల, కురుమల ఓట్లు 25వేలు ఉండగా, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు 22వేలు, ముస్లిం ఓట్లు 12వేలు, ఎస్టీ సామాజిక వర్గం ఓట్లు 6,500 ఉన్నాయి.
దళిత్ ఎంపవర్‌మెంట్ అందుకేనా?
కొంచెం అటు, ఇటుగా రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నిక తప్పనిసరి. దీంతో టీఆర్‌ఎస్, బీజేపీలు.. నియోజకవర్గంలోని ఆయా సామాజిక వర్గాలను ఆకట్టుకునే యత్నాలు మొదలుపెట్టాయి. ఈ నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు అందరికంటే ఎక్కువగా 45వేలు ఉండటం వల్లనే సీఎం కేసీఆర్ తాజాగా ‘సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్’ పథకాన్ని తెరపైకి తెచ్చారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు అక్కడి సామాజిక సమీకరణాలకు అనుగుణంగా పార్టీలు తమ నేతలకు ఉప ఎన్నికల బాధ్యతలను అప్పగిస్తున్నాయి. నియోజకవర్గంలో ఎక్కడ? ఏ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటారో.. అక్కడ అదే సామాజిక వర్గం నేతలు పర్యటించేలా చూస్తున్నారు. తద్వారా ఆయా సామాజిక వర్గాల ఓటర్లను తమ వైపు తిప్పుకోవటం సులువు అవుతుందని పార్టీల అధినాయకత్వాలు భావిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇదే ప్రాతిపదికన నేతలకు బాధ్యతల అప్పగింతలు జరుగుతాయని పార్టీల ముఖ్యులు చెబుతున్నారు.
Also Read : షర్మిళా ఇంటి ముందు ధర్నా నాటకం లక్ష్యం ఏమిటీ..?