iDreamPost
android-app
ios-app

వడివడిగా సాధారణ జీవనం వైపు

  • Published Sep 22, 2020 | 12:58 PM Updated Updated Sep 22, 2020 | 12:58 PM
వడివడిగా సాధారణ జీవనం వైపు

దాదాపు ఆరు నెలల తరువాత సాధారణ జీవనం వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. కోవిడ్‌ 19 కారణంగా ప్రకటించి లాక్డౌన్‌ తరువాత పూర్తిస్థాయిలో జనజీవనం గాడిన పడలేదనే చెప్పాలి. బైటకు వెళ్ళాలంటే జంకు, వెళితే ఎక్కడ వైరస్‌ అంటుకుంటుందోనన్ని భయం, వైరస్‌ భారిన పడితే ఏం జరిగిపోతుందోనన్న ఆందోళన.. వెరసి జన సమ్మర్ధంపై అప్రకటిత ఆంక్షలను అమలు చేసినట్లే అయ్యింది.

ఒక పక్క అన్‌లాక్‌ పేరిట వెసులుబాట్లు కల్పిస్తున్నప్పటికీ పలు ప్రాంతాల్లో జనజీవనం సాధారణ స్థాయికి చేరుకోవడంలో పెద్దగా పురోగతి కన్పించలేదు. అయితే ఈ పరిస్థితిని మార్చాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడివడిగా నిబంధనల సడలింపులు, మినహాయింపులకు ఉపక్రమించాయి. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు పాఠశాలలను తెరవడం కూడా ఒకటి.

లాక్డౌన్‌ తరువాత మళ్ళీ బడిముఖం చూడని చిన్నారులను ప్రస్తుతం బడికి రప్పిస్తున్నారు. అందులో కూడా పాఠశాలల్లో 9,10 తరగతుల వారు, కాలేజీల్లో 11,12 తరగతుల విద్యార్ధులను అనుమతించారు. యాభైశాతం ఉపాధ్యాయులు కూడా విధులకు హాజరయ్యారు. ఆన్‌లైన్, దూరదర్శన్‌ల ద్వారా ప్రసారమైన పాఠ్యాంశాలకు సంబంధించిన డౌట్‌లను నివృత్తి చేసుకునేందుకు ఈ క్లాస్‌లను ఏర్పాటు చేసారు. అది కూడా తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వకంగా సమ్మతిపత్రాలను కూడా తీసుకున్నారు.

దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా పలు చోట్ల ఆన్‌లైన్‌ బోధనా కార్యక్రమాలు కొనసాగిస్తూనే, సందేహాల నివృత్తికి స్కూల్స్‌లో టీచర్లను అందుబాటులో ఉంచే విధంగా కార్యాచరణ చేపట్టారు. తద్వారా విద్యారంగంలో ఏర్పడ్డ స్తబ్ధతకు సడలింపుల ద్వారా కదలికలు తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. సినిమాహాళ్ళు, జిమ్ములు, ఫంక్షన్‌హాల్స్, పలు పరిశ్రమలు.. తదితర వాటికి మినహా దాదాపుగా అన్నీ కూడా తాజా లాక్డౌన్‌ కారణంగా పూర్తిస్థాయిలో తెరుచుకున్నటై్టంది.

మరోవైపు జనసమ్మర్ధం ఎక్కువైతే పాజిటివ్‌ల సంఖ్య ఎక్కువయ్యేందుకు అవకాశం ఉంటుందన్న అనుమానాలు ఉన్నాయి. దీనిపై వ్యక్తిగత జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి రోజూ 60–70వేల మధ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు పాజిటివ్‌ల జాడను గుర్తించి వెనువెంటనే వైద్యు సహాయం అందజేస్తున్నారు.

అలాగే టెస్ట్, ట్రేస్, ట్రీట్‌మెంట్‌ విధానంలో పాజిటివ్‌లుగా తేలిన వారికి వెంటనే వైద్యసదుపాయం అందజేస్తున్నారు. సీరియన్‌ స్టేజ్‌లో ఉన్నవారి ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యల కారణంగా మరణాల రేటు తక్కువగా నమోదయ్యేందుకు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. అలాగే దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రికవరీ రేటుకూడా ఏపీలో ఎక్కువగా ఉండడం ఊరటనిచ్చే అంశంగా చెబుతున్నారు. రోజురోజుకూ రికవరీ రేటు మెరుగుపడుతుండడం వీలైనంత వేగంగానే సాధారణ పరిస్థితుల్లోకి జనం చేరుకుంటారన్న భావన సర్వత్రావ్యక్తమవుతోంది.