ఆంధ్రప్రదేశ్ లో నేటినుండి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల కారణంగా మూతపడిన స్కూళ్లను ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో మొదటగా 9,10 తరగతులతో పాటు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కాబోతున్నట్టు అధికారులు వెల్లడించారు. నవంబర్ 23 నుంచి 6,7,8 క్లాసులు ప్రారంభం కానుండగా డిసెంబర్ 14 నుంచి 1నుంచి 5 తరగతులు మొదలు కానున్నట్లు అధికారులు తెలిపారు.పదో తరగతి విద్యార్థులు పాఠశాలకు రోజూ హాజరు కావాల్సి ఉండగా 9వ తరగతి విద్యార్థులు రోజు విడిచి రోజు హాజరుకావాల్సి ఉంటుంది.
కరోనా కారణంగా మూతపడినా పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలను ప్రారంభించడానికి అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. ఒక్కో తరగతి గదిలో 16 మంది వరకే అనుమతి ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలతో పాఠశాలల్లో గదులు సిద్ధం చేసి బెంచీకి ఒకరు మాత్రమే కూర్చునేలా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. కళాశాలలోనూ కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కాలేజీలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు థర్మల్ స్కానింగ్ చేశాకే తరగతి గదుల్లోకి విద్యార్థులను అనుమతించాలని అధికారులు ఆదేశించారు.
ప్రతిరోజు విద్యాలయాలను పూర్తిగా శానిటైజేషన్ చేయాలని, మధ్యాహ్నం భోజనం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులు గుంపులుగా చేరకుండా ఉండేందుకు ఉపాధ్యాయులు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. విద్యార్థులను మొదటి నుంచి చివరి వరకు వేరే తరగతి గదుల్లోకి మార్చకుండా ఒకే తరగతి గదిలో ఉంచాలని సూచించారు. విద్యార్థుల మధ్య కనీస దూరం ఆరడుగులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.