iDreamPost
android-app
ios-app

మూడు రాజధానుల వ్యవహారం: సుప్రిం కీలక ఆదేశాలు

మూడు రాజధానుల వ్యవహారం: సుప్రిం కీలక ఆదేశాలు

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ తెచ్చిన సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లులపై యథాతథస్థితిని విధిస్తూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రిం కోర్టు ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజధాని, సీఆర్‌డీఏ పిటిషన్లను త్వరితగతిన పరిష్కరించాలని హైకోర్టుకు సూచించింది. హైకోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సుప్రింలో సవాల్‌ చేయగా.. పలుమార్లు విచారించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు పై విధంగా స్పందించింది. హైకోర్టులో ఈ విషయం విచారణలో ఉన్న సందర్భంగా తాము రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించలేమని తెలుపుతూ.. హైకోర్టుకు కీలక సూచనలు చేసింది.

మూడు రాజధానుల ఏర్పాటుకు అనుగుణంగా సీఆర్‌డీఏ రద్దు చేస్తూ దాని స్థానంలో ఏఎంఆర్‌డీఏ, పరిపాలన వికేంద్రీకరణ అనే రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ రెండు బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేయడం, గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ కూడా పూర్తయింది. అయితే ఈ చట్టాలను సవాల్‌ చేస్తూ అమరావతియే రాజధానిగా కొనసాగించాలని అమరావతి జేఏసీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆ రెండు చట్టాలపై యథాతథ స్థితిని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రిం కోర్టులో పిటిషన్‌ వేయగా.. ఇప్పటికే రెండు బెంచిలు మారి మూడో బెంచి ముందుకు ఈ వ్యవహారం వచ్చింది. మూడో బెంచి ఈ విషయంపై ఓ క్లారిటీ ఇవ్వడంతో మూడు రాజధానుల వ్యవహారంపై నెలకొన్న న్యాయపరమైన సమస్యలన్నీ త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఏర్పడింది. సుప్రిం ఆదేశాల నేపథ్యంలో ఇకపై ఏపీ హైకోర్టులో అమరావతి, మూడు రాజధానులు, సీఆర్‌డీఏ అంశాలపై వేగంగా విచారణ జరగనుండడం వల్ల ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.