iDreamPost
android-app
ios-app

ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీం షాక్

  • Published Nov 26, 2020 | 7:22 AM Updated Updated Nov 26, 2020 | 7:22 AM
ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీం షాక్

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, నిధుల దుర్వినియోగం వంటి అభియోగాల నేపథ్యంలో సస్పెన్షన్‌ ఎదుర్కొంటున్న ఐపీఎస్‌ అధికారి, ఏపీ ఇంటిలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు కేసులో ఆసక్తిర పరిణామం చోటుచేసుకుంది. వెంకటేశ్వరరావు పై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యూనల్‌(క్యాట్‌) ఇచ్చిన ఆదేశాలను సైతం పక్కన పెట్టి ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. హైకోర్టు నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తొలుత ఈ కేసు జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చినా ఆయన ఈ విచారణ నుంచి తప్పుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఆయన సస్పెన్షన్‌ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌పై సుప్రిం కోర్టు స్టే విధించింది.

చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావుపై అనేక విమర్శలు, ఆరోపణలు, అభియోగాలు ఉన్నాయి. ఆయన అధికారిగా కాకుండా టీడీపీ నాయకుడిగా పని చేశారని విమర్శలొచ్చాయి. ప్రభుత్వం నుంచి విలువైన కాంట్రాక్టులు ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు కంపెనీకి దక్కాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమాచారం సేకరిస్తూ.. టీడీపీ అభ్యర్థులకు దిశానిర్ధేశం చేశారనే ఆరోపణలు వచ్చాయి. వివాదాస్పదమైన అధికారిగా మారిన ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ వ్యవహారంలో తాజాగా జరిగిన పరిణామం ప్రభుత్వ వాదనను బలపరిచేదిగా ఉంది.