iDreamPost
android-app
ios-app

ఆరంభం బాగుంది – థియేటర్లు ఫుల్

  • Published Dec 26, 2020 | 4:55 AM Updated Updated Dec 26, 2020 | 4:55 AM
ఆరంభం బాగుంది – థియేటర్లు ఫుల్

తొమ్మిది నెలల తర్వాత పేరున్న ఓ హీరో నటించిన తెలుగు స్ట్రెయిట్ మూవీ సోలో బ్రతుకే సో బెటరూ థియేటర్లలో నిన్న రిలీజయింది. జనం మునుపటిలా వస్తారా రారా అనే అనుమానాలు పటాపంచలు చేస్తూ యాభై శాతం ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ మొదటి రోజు దాదాపు అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. మల్టీ ప్లెక్సులు, పేరున్న సింగల్ స్క్రీన్ థియేటర్లు సీటు విడిచి సీటు నిబంధనను స్ట్రిక్ట్ గా పాటించాయి. శానిటైజేషన్ కూడా జాగ్రత్త వహించాయి. అయితే కొన్ని బి,సి సెంటర్లలో మాత్రం కలెక్షన్ల కోసం కొందరు ఆంక్షలకు మంగళం పడేశారు. వీటి తాలూకు ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.

మొత్తానికి భయపడినట్టు కాకుండా ఫస్ట్ డే సూపర్ హిట్ అయ్యింది. కాకపోతే సినిమాకే డివైడ్ టాక్ రావడం కొంత కలవరిచే అంశం. అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ చాలా మంది థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ని ఓసారి పొందటం కోసం టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇది ఇవాళ రేపు ఆదివారం కాబట్టి వీకెండ్ ప్రభావంతో కొనసాగబోతోంది. అయితే ఒకవేళ వంద శాతం సీట్లకు పర్మిషన్ ఉంటే ఈ స్థాయిలో రెస్పాన్స్ వచ్చేదా అంటే దానికి ఇంకొంత కాలం వెయిట్ చేయాలి. యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమా పడితే అప్పుడు నిజమైన పల్స్ బయట పడుతుంది . సాయి తేజ్ మూవీలో అంత స్టామినా ఉన్నట్టు అనిపించడం లేదు.

ఏది ఎలా ఉన్నా ఈ పరిణామాల పట్ల ట్రేడ్ వర్గాలతో పాటు ఇండస్ట్రీ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఇదిలాగే స్టడీగా కొనసాగితే రాబోయే సంక్రాంతి సినిమాల మీద గట్టి ఆశలు పెట్టుకోవచ్చు. జనవరి 1న చిన్న సినిమాలు కొన్ని రిలీజవుతున్నప్పటికీ స్టార్లు ఉంటే తప్ప జనం హాల్ దాకా కదిలే పరిస్థితి లేదు. నిన్న ట్రెండ్ ని బట్టి క్యాంటీన్ సేల్స్ కూడా బాగున్నాయని రిపోర్ట్. మునుపటి లాగే పబ్లిక్ పాప్ కార్న్, సమోసాలు, కూల్ డ్రింక్స్ ఎలాంటి జంకు లేకుండా తీసుకుంటున్నారు. సోమవారం నుంచి అసలు పరీక్ష మొదలవుతుంది. సాయి తేజ్ కనక ఇందులో పాస్ అయితే మిగిలిన హీరోలు కూడా ధైర్యంగా రంగంలోకి దిగుతారు. చూద్దాం.