Idream media
Idream media
SBIలో బ్యాంక్ ఖాతా తెరవాలంటే తల్లులు బెంబేలెత్తిపోతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న జగన్ సర్కార్…ఇంకో పెద్ద పథకాన్ని పేద తల్లులకు అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అమ్మ ఒడి పథకాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేసేందుకు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళుతోంది.
ఇందులో భాగంగా విద్యార్థి తల్లికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాలను ఇవ్వాల్సి ఉంది. అందులోనూ జాతీయ బ్యాంక్ అకౌంట్‌కు మొదటి ప్రాధాన్యం ఇచ్చారు.దీంతో విద్యార్థి ఆధార్, రేషన్‌కార్డు, తల్లికి సంబంధించి ఆధార్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీలను ఇవ్వాలని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సంబధిత వ్యక్తులకు సమాచారం ఇచ్చారు.
సహజంగా గృహిణులకు బ్యాంకు ఖాతాలున్నప్పటికీ ఏ గ్రామీణ బ్యాంక్‌లో ఉండటం సర్వసాధారణం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఆ బ్యాంకులే ఉంటాయి కాబట్టి. ఈ నేపథ్యంలో జాతీయ బ్యాంకుల్లో అకౌంట్ ఉండాలనడంతో పోలోమని తల్లులంతా పట్టణాలకు వెళుతున్నారు. బ్యాంకుల విలీనంతో ఎక్కువగా SBIలో అకౌంట్ తెరవడానికి తల్లులు ఆసక్తి కనబరుస్తున్నారు. పేద మహిళల అవసరాన్ని అవకాశంగా తీసుకున్నSBI అకౌంట్ తెరవాలంటే ఏకంగా రూ.3000 నుంచి రూ.3500 అవుతుందని సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో అంత సొమ్ము బ్యాంక్ అకౌంట్ తెరవడానికి ఎక్కడి నుంచి తేవాలని గగ్గోలు పెడుతున్నారు.
అకౌంట్ తెరిచేందుకు రూ.1000 లేదా రూ.2వేలు ఉంటుందనుకొని వచ్చిన మహిళలు…బ్యాంకు అధికారులు చెప్పినంత తమ దగ్గర లేకపోవడంతో ఇంటికి తిరుగుముఖం పడుతున్నారు. మరికొందరు మాత్రం తప్పదనే ఉద్దేశంతో, ఎటూ బ్యాంక్ వరకూ వచ్చాం కదా అనుకుంటూ అదనపు డబ్బు కోసం తెలిసిన వారికి ఫోన్లు చేస్తూ తెప్పించుకోవడం SBIలో కనిపిస్తోంది. ఈ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు సమాచారం.
గతంలో జన్‌ధన్ పథకాన్ని ప్రవేశ పెట్టి జీరో బ్యాలెన్స్‌తో బ్యాంక్ ఖాతాలను తెరిచే ప్రయత్నం చేశారు. అయితే ఆ ముచ్చట పట్టుమని మూణ్నాళ్లే అని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. మోడీ పుణ్యమా అని బ్యాంక్ గడప తొక్కాలంటే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు.