వైసీపీకి రాయలసీమ కంచుకోట కావచ్చేమో గానీ, టీడీపీకి మాత్రం హిందూపురం అలాంటిదే. గత సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమలో 52 స్థానాల్లో 49 వైసీపీ, 3 చోట్ల టీడీపీ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మూడింట్లో అనంతపురం జిల్లాలోని హిందూపురం ఒకటి. ఇక్కడి నుంచి దివంగత ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ వరుసగా రెండోసారి గెలుపొందాడు.
హిందూపురం వైసీపీలో వర్గవిభేదాలు తారాస్థాయికి చేరినట్టు తెలుస్తోంది. సేవ్ వైసీపీ అంటూ రోడ్డు ఎక్కడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఆందోళనకు హిందూపురంలోని ఆర్‌ఎంఎస్ ఫంక్షన్‌హాల్ వేదికైంది. ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, జిల్లా కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, మైనార్టీ జిల్లా నాయకుడు సిరాజ్, పట్టణ బీ-బ్లాక్ అధ్యక్షుడు మల్లికార్జున తదితరులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఇక్బాల్‌పై విమర్శలు చేసినట్టు సమాచారం. ఈ సమావేశంలో వైసీపీలో నాడు-నేడు ఫ్లెక్సీలు ప్రదర్శించడంతో పరోక్షంగా నవీన్‌నిశ్చల్ – ఇక్బాల్ నాయకత్వాలను పోల్చుతూ చెప్పడమే అని జిల్లాలో చర్చ జరుగుతోంది.
Also Read : సార్, వ్యాపారాన్నిమరింత అభివృద్ధి చేసుకోమని సీఎం రమేష్ రాజ్యసభకు పంపారా?
ఎన్నికల ముందు వరకు నవీన్‌నిశ్చల్ వైసీపీ ఇన్‌చార్జ్‌గా కొనసాగాడు. ఆయనకే టికెట్ వస్తుందని అందరూ అనుకున్నారు. చివరికి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇక్బాల్‌కు టికెట్ దక్కింది. నవీన్‌నిశ్చల్ 2004 నుంచి హిందూపురం ప్రజలకు సుపరిచితులు. అతను బలమైన నాయకుడు. 2004లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. 2009లో టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి అబ్దుల్‌గని చేతిలో ఓటమిపాలయ్యాడు. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మినారాయణ మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరాడు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసి నందమూరి బాలకృష్ణ చేతిలో ఓటమిపాలయ్యాడు. 2019లో టికెట్ నిరాకరించినప్పటికీ వైసీపీలోనే ఉన్నాడు. ఇక్బాల్‌కు మద్దతు పలికాడు. టీడీపీ నుంచి అబ్దుల్‌గని కూడా వైసీపీలో చేరడంతో పార్టీ బలం పెరిగింది. ఒక దశలో బాలకృష్ణ గెలుపుపై సందేహాలొచ్చాయి. వైసీపీ గాలి రాష్ట్ర వ్యాప్తంగా బలంగా వీచినప్పటికీ బాలకృష్ణ గెలుపొంది మరోసారి టీడీపీకి హిందూపురం కంచుకోట అని నిరూపించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి వరుసగా పది సార్లు( 1996 ఉప ఎన్నికతో కలిపి ) ఇక్కడ టీడీపీ గెలుపొందింది.
Also Read : రోజుల ప్రభుత్వాలు…!
దివంగత ఎన్టీఆర్ హిందూపురం నుంచి మూడుసార్లు, ఆయన తనయుడు హరికృష్ణ ఒకసారి ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు. ఎన్టీఆర్ తుదిశ్వాస విడిచే సమయానికి ఇక్కడి నుంచే ప్రాతినిథ్యం వహించడం గమనార్హం. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో హరికృష్ణ గెలుపొందాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తనయుడే హిందూపురం నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండటాన్ని గమనించాలి.
ఈ నియోజకవర్గంలో టీడీపీ కోటను బద్దలు కొట్టాలని అందరినీ కలుపుకుని పోయినప్పటికీ వైసీపీ విజయం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో పార్టీ అధికారంలోకి వచ్చాక వర్గపోరు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. పార్టీలోకి మధ్యలో వచ్చిన ఇక్బాల్‌కు న్యాయం చేసిన సీఎం జగన్, మొదటి నుంచి కష్టనష్టాలకు ఓర్చి ఆర్థికంగా చితికిపోయిన నవీన్‌నిశ్చల్ విషయంలో పట్టించుకోకపోవడం ఆయన అనుచరులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
Also Read : ఏంటీ రాజకీయం?
ఈ అసంతృప్తే హిందూపురంలో సేవ్ వైసీపీ నినాదంతో సభ ఏర్పాటుకు దారి తీసిందనే వాదన పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉంటూ జగన్ కోసం అనేక పోరాటాలు చేసి కేసులు పెట్టించుకుని జైళ్లపాలయ్యామని వారు వాపోతున్నారు. అలాగే ఆర్థికంగా దివాళా తీశామని, అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం జరగకపోగా, అన్యాయానికి గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు శివ, షాజియా, రజిని, నాయకులు రమేష్, నరసింహారెడ్డి, బాబిరెడ్డి, క్రిష్ణారెడ్డి, చిరంజీవి గాంధీ, చంద్రశేఖర్‌రెడ్డి, శివ, వెంకటేశ్‌రెడ్డి, హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండలాల నుంచి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. ఈ నేపథ్యంలో హిందూపురం వైసీపీలో ఏం జరుగుతోందని అధిష్టానం ఆరా తీస్తున్నట్టు సమాచారం.