iDreamPost
android-app
ios-app

తయారు చేస్తే తయారవ్వరు..!

  • Published Jun 26, 2021 | 10:42 AM Updated Updated Jun 26, 2021 | 10:42 AM
తయారు చేస్తే తయారవ్వరు..!

బావా.. బావా.. అంటూ వీధి గేటుదగ్గర్నుంచి మెల్లగా గొంతు విన్పిస్తుంటే బాలకృష్ణ సినిమాను కన్నార్పకుండా చూస్తున్న కిట్టయ్య లోపల్నుంచి వచ్చి చూసాడు.

చూడ్డం తోటే.. అదేంట్రా మణీ అక్కడే ఆగిపోయి.. కేకేస్తున్నావేంట్రా.. అన్నాడు ఆశ్చర్యంగా.

ఏం.. లేదు బావా. కరోనా కారణంగా నువ్వసలు గేటే తీయడం లేదటకదా.. ఎవ్వరు వచ్చినా.. గేటు బైటే నిలబెట్టి మాట్లాడేస్తున్నావని ఊళ్ళో పెద్ద టాకై కూర్చుంది. నేనొచ్చినా తీస్తావో? లేదో? అని అనుమానం వచ్చి.. పిలుస్తున్నాను.. అన్నాడు మణి.

ఒరే మణీ.. నువ్వన్నది నిజమేరా ‘‘మొహమాటం నీకూ.. నాకూ ఉంటది. కరోనాకి కాదు కదా?’’ అందుకే ఎవరొచ్చినా బైటే నుంచోబెట్టి మాట్లాడేసి పంపించేసా అంటూ క్లారిటీ ఇచ్చారు కిట్టయ్య.

అద్సరేరా ఇన్నాళ్ళూ ఏమైపోయావురా? మీ అక్క కూడా అడుగుతోంది. ఫోనుక్కూడా దొరకడం లేదు. అంటూ ఆరా తీసాడు కిట్టయ్య.

ఏం చెప్పనులే బావా.. రకరకాలన్నీ విన్పిస్తుంటే భయమేసి ఇంట్లోనే కూర్చున్నాను. ఫోనైనా వాడదామా అంటే.. అందులో శాస్త్రవేత్తలు ఎక్కువైపోయారు. వాళ్ళ సూచనలు చూస్తుంటే బుర్ర పగిలిపోయేది. దీంతో స్విచ్చు కట్టేసి పక్కనెట్టేసా అంటూ గ్యాప్‌కు కారణంగా చెప్పాడు మణి.

ఏవోయ్‌.. మీ తమ్ముడు మణొచ్చాడు.. అంటూ చెబుతూనే గేటు తీసాడు కిట్టయ్య. దాంతో లోపలికి వచ్చి అక్కడే ఉన్న బల్లమీద కూర్చున్నాడు మణి.

ఇంకేట్రా మణీ విశేషాలు.. అంటూ మాట కలిపాడు కిట్టయ్య.

ఏం చెప్పను బావా.. రెండ్రోజుల క్రితమే టీవీ, ఫోను ఆన్‌చేసా. అప్పట్నుంచి నా బుర్రలో ఓ ప్రశ్న తొలిచేస్తోంది. నీకు తెలుసుకదా? నీ దగ్గరకొచ్చి దానికి సమాధానాలు అడిగితే తప్ప నిద్రట్టదాయె. రెండ్రోజులు ఈ బాధ తట్టుకున్నాను. కానీ ఆ సందేహాలు తొలిచేస్తుంటే.. ఇంక ఆగలేక వచ్చేసాను బావా అంటూ అసలు విషయం చెప్పాడు మణి.

Also Read : టీడీపీ మాట.. రఘురామరాజు లేఖ !

  
మణిగాడి మాటలు వింటూనే సినిమాలో మళ్ళీ మునిగాడు కిట్టయ్య. సినిమా చూస్తూనే.. నీ డౌట్లేంట్రా అంటూ అనునయంగా అడిగాడు.

ఏం లేదు బా.. లోకేషన్న అన్నడం బాగుంటుందంటావా? అన్నాడు.

అది విన్న కిట్టయ్య టీవీ నుంచి దృష్టిని మణిగాడిమీదకు తిప్పి ఏంట్రా ‘ష’ను అంతగా నొక్కేసి పలుకుతున్నావు అన్నాడు నవ్వుతూ..

మరి లోకేష్‌ను అన్నను చెయ్యాలంటే ‘లోకేషన్న’ అనే కదా బా పిలవాలి. నేను అలా పిలుస్తుంటేనే ‘ష’ను నొక్కాల్సి వస్తోంది. అన్నాడు అమాయకంగా.

అది సరేరా మణీ.. ఇప్పుడీ ‘అన్న’ గొడవెందుకొచ్చిందిరా? అంటూ అడిగాడు కిట్టయ్య.

దీంతో గొంతు సవరించుకున్న మణి చెప్పడం మొదలెట్టాడు. ఏం లేదు.. బావా అన్నఎన్టీఆర్‌.. రాజన్న.. మమతాదీదీ.. జగనన్న.. ఇలా ఏదో ఒక వరుస వచ్చేలా పేరును పిలిపించుకుంటే ప్రజలకు బాగా దగ్గరవుతామని నిపుణులు చెప్పారంట. అందుకని ఇక నుంచి లోకేశ్‌ను లోకేషన్న అని పిలవాలని తెలుగుదేశం పార్టీలో అనధికారిక ఆర్డినెన్స్‌ పాస్‌కూడా అయ్యిందంట. అందుకే ఈ మధ్య ప్రెస్‌మీట్‌లలోనూ, సోషల్‌ మీడియాలో కూడా.. నేను మీకు అన్నలా ఉంటానంటూ లోకేశ్‌ కూడా చెబుతున్నాడు.. నువ్వు విన్లేదా? బా.. అంటూ గుక్కతిప్పుకోవడానికి ఆగాడు మణి. మళ్ళీ వెంటనే మొదలు పెట్టి పార్టీలో అందరూ అన్నా.. అని పిలవడం ద్వారా ప్రజల్లో క్రేజ్‌ అమాంతం పెంచుకోవాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారంట బా.. అంటూ ముక్తాయింపు ఇచ్చాడు.

వాళ్ళ వ్యూహం బాగానే ఉంది గానొరేయ్‌ మణీ.. ప్రజలు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును, లోకేష్‌ను ఎందుకు తిరస్కరించారో? ఇంకా వీళ్ళకు అర్ధమైనట్టు లేదురా? అంటూ ఆలోచించ సాగాడు కిట్టయ్య.

ఇంకా కిట్టయ్య ఏదో చెబుతున్నాడనుకుని మణి కూడా కిట్టయ్యవైపే కన్నారప్పకుండా చూస్తున్నాడు..

ఈ లోపు టీవీలో వస్తున్న సినిమాలో యంఎస్‌ నారాయణ పంచ్‌ డైలాగ్‌ గట్టిగా వినపడుతోంది.. ‘పులులు, సింహాలు.. తయారు చేస్తే తయారవ్వవు.. ఏది నన్ను తయారు చెయ్యండి చూద్దాం..’’ అంటూ తనదైన మానరిజమ్‌తో యంఎస్‌ చెప్పిన ఆ డైలాగ్‌ కిట్టయ్య చెప్పాలనుకున్నది.. మణికి తెలియాల్సింది అర్ధమైపోయినటై్టంది.

Also Read : లోకేష్‌.. ఇంకా ఏం చేయాలి?