iDreamPost
android-app
ios-app

చిన్నమ్మ రాకకు భారీ ఏర్పాట్లు.. అన్నాడీఎంకే నిఘా..?

చిన్నమ్మ రాకకు భారీ ఏర్పాట్లు.. అన్నాడీఎంకే నిఘా..?

మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ నాలుగేళ్ల జైలువాసం తర్వాత చెన్నై నగరానికి తొలిసారిగా విచ్చేస్తున్నారు. ఈ నెల 27న శశికళ విడుదలైనప్పటి నుంచి అధికార అన్నాడీఎంకేలో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. శశికళ రాగానే అన్నాడీఎంకే పార్టీలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితులలో శశికళ సోమవారం ఉదయం మందీమార్బలంతో బెంగళూరు నుంచి భారీ ఏర్పాట్ల నడుమ చెన్నై నగరానికి వస్తున్నారు. శశికళకు దారిపొడవునా స్వాగత సత్కారాలు జరిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం కార్యకర్తలంతా తరలివస్తున్నారు. తమిళనాట శశికళ అడుగుపెట్టేరోజునే రాష్ట్రంలో ఆమెకు ఉన్న ఆదరణ, బలం నిరూపించుకోవడంలో భాగంగానే వారం రోజులుగా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

కీలక ఆదేశాలు

అసెంబ్లీ ఎన్నికలకు ముందే శశికళ విడుదల అవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్న నాటి నుంచే తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆమె నేరుగా అడ్డుగుపెడుతున్న సందర్భంలో ఇప్పటికే అన్నాడీఎంకేలో అనుమానాలు మొదలయ్యాయి. శశికళ వర్గం అల్లర్లకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని అన్నాడీఎంకే నేతలు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నాలుగేళ్ల అనంతరం రాష్ట్రంలోకి వస్తున్న చిన్నమ్మ రాక సాదాసీదాగా ఉండకూడదని అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం పార్టీకి కీలక ఆదేశాలు అందాయి. ఆ మేరకు రాష్ట్ర సరిహద్దు అత్తిపల్లి నుంచి చెన్నై దాకా 66 ప్రాంతాల వద్ద శశికళకు స్వాగత సత్కారాలు నిర్వహించేందుకు ఆ పార్టీ నేత దినకరన్‌ ఏర్పాట్లు చేపడుతున్నారు.

జయకారులోనే..

మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఉపయోగించిన టోయోటా లేండ్‌ క్రూసర్‌ లగ్జరీ కారులోనే శశికళ బెంగళూరు నుంచి బయలుదేరనున్నారు. ఆమె వెంట వందల సంఖ్యలో పార్టీ ప్రముఖులు కార్లలో ర్యాలీ నిర్వహించనున్నారు. బెంగళూరు నుంచి రాష్ట్ర సరిహద్దు వరకూ కర్నాటక పోలీసులు శశికళకు భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నారు. తమిళనాడు సరిహద్దు ప్రాంతం అత్తిపల్లి నుంచి చెన్నై దాకా సుమారు ఐదు వేలమంది పోలీసులు ఆమెకు భద్రతా ఏర్పాట్లు చేపడతారు. చెన్నై నగరం చేరుకోగానే శశికళ అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ నివాసగృహం ఉన్న రామావరం గార్డెన్‌ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత ఓపెన్‌టాప్‌ వ్యాన్‌లో ఊరేగింపుగా బయలుదేరి టి.నగర్‌ హబీబుల్లా రోడ్డులో ఉన్న బంధువుల నివాసగృహంలో శశికళ చేరుకుంటారు.

ఆమెను క‌లిస్తే ఉపేక్షించేది లేదు

చిన్నమ్మ తమిళనాడులో అడుగుపెట్టబోతుండటం తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మరీ ముఖ్యంగా అధికార అన్నాడీఎంకేలో శశికళ ముసలం మొదలైంది. శశికళ చెన్నైకి వస్తుండటంతో ఆమె వర్గం తమిళనాడులో అల్లర్లకు, హింసాత్మక చర్యలకు పాల్పడాలని భావిస్తోందని అన్నాడీఎంకే నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, సొంత పార్టీ నేతలకు కూడా అన్నాడీఎంకే కీలక హెచ్చరిక చేసింది. శశికళ చెన్నైకి వస్తున్న నేపథ్యంలో.. ఆమెను కలిసేందుకు అన్నాడీఎంకే నేతలు ఎవరు వెళ్లినా ఉపేక్షించేంది లేదని, పార్టీ నుంచి బహిష్కరిస్తామని అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేసింది. పళని స్వామి, పన్నీరు సెల్వం అధ్యక్షతన జరిగిన అన్నాడీఎంకే కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. పళనిస్వామి కేబినెట్‌లో, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కొందరు శశికళ అనుచరులున్నారు. తమిళనాడులో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో శశికళ ఎంట్రీతో పార్టీలో చీలికలు తప్పవని అధిష్టానం కలవరపడుతోంది. అందుకే.. శశికళ వెంట పార్టీ నేతలెవరూ వెళ్లకుండా అన్నాడీఎంకే అప్రమత్తమవుతోంది.