iDreamPost
iDreamPost
ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ కావాలితో పరిచయమై డెబ్యూతో డీసెంట్ సక్సెస్ అందుకున్న సాయి కుమార్ వారసుడు ఆది ఆ తర్వాత విజయం వైపు కన్నెత్తి చూడలేకపోయాడు. వరస పరాజయాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. బుర్రకథ, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఫలితాలైతే మరీ దారుణంగా వచ్చాయి. జోడి గురించి చెప్పుకోకుండా ఉండటం ఉత్తమం. అయినా కూడా అవకాశాలు బాగానే తలుపు తడుతున్నాయి. ఈ క్రమంలో రెండు సినిమాలు త్వరలో విడుదలకు సిద్ధం కాబోతున్నాయి. అందులో ఒకటి శశి. ఇవాళ తమ హీరో పుట్టినరోజు సందర్భంగా శశి టీమ్ టీజర్ ని విడుదల చేసింది. కథ ఏంటో లైట్ గా చెప్పే ప్రయత్నం చేశారు.
శశి(ఆది సాయి కుమార్)ఏదో పోగొట్టుకుని దారి తెలియని గమ్యం అన్వేషణలో ఉంటాడు. తోచింది చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఓసారి నవ్వుతాడు ఓసారి బాధ పడతాడు మరోసారి ఎటెటో వెళ్ళిపోతాడు. కానీ తనకో గతం ఉంటుంది. అందులో అందమైన అమ్మాయి(సురభి)ని ప్రేమించిన జ్ఞాపకాలు ఉంటాయి. అన్నింటిని మించి శశి ఓ మాములు మనిషిగా అందరూ మెచ్చుకునే యువకుడిగా ఉంటాడు. అసలు ఆ యువతి ఏమైంది, ఇతను ఇలా ఎందుకు మారాడు లాంటి ప్రశ్నలకు సమాధానమే అసలు సినిమా. రెండు షేడ్స్ ఉన్న శశిగా అదిని చూపించారు.
టీజర్ లో కొంత విషయమైతే ఉన్నట్టు కనిపించింది. ఆది సాయి కుమార్ కూడా నటనలోని భిన్న కోణాలను వాడుకునే ప్రయత్నం చేశాడు. చాలా గ్యాప్ తర్వాత కనిపించిన సురభి లుక్స్ పరంగా క్యూట్ గా ఉంది. జయ ప్రకాష్, వెన్నెల కిషోర్, వైవా హర్ష, అజయ్, రాజీవ్ కనకాల తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. శశితో చెప్పించిన డైలాగులు భారీగా ఉన్నాయి. శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వం కం రచన చేసిన శశికి అరుణ్ చిలువేరు సంగీతం అందించారు. మణికుమార్ స్క్రీన్ ప్లే సమకూర్చారు. మొత్తానికి యూత్ ని టార్గెట్ చేసుకున్న శశిలో లవ్ తో పాటు యాక్షన్ అంశాలు కూడా దట్టించారు. మరి ఈ ప్రయత్నమైనా ఆదికి కోరుకున్న ఫలితాన్ని ఇస్తుందేమో.
Teaser Link Here @ https://bit.ly/3rmds30