iDreamPost
iDreamPost
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తన పోటీ హీరోలకు లేని ఒక ప్రత్యేకమైన లక్షణం తనలో ఉంది. అదే ఇతర రాష్ట్రాల్లో ఫాన్స్ బేస్. ముఖ్యంగా కేరళలో పెద్ద అభిమాన సంఘాలే ఉన్నాయి ఇతని పేరు మీద. ఏదైనా కొత్త సినిమా భారీ ఎత్తున ఎక్కువ సెంటర్లలో రిలీజ్ కావడం మాములు విషయంగా మారిపోయింది. అక్కడే కాదు నార్త్ లోనూ యుట్యూబ్ రూపంలో బన్నీకున్న క్రేజ్ మాములుది కాదు. తాజాగా స్వంతం చేసుకున్న రికార్డును బట్టే చెప్పొచ్చు. సరైనోడు హిందీ వెర్షన్ 300 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని ఇప్పటిదాకా ఏ భారతీయ సినిమాకు అందని అద్భుత ఘనతను సొంతం చేసుకుంది.
చరిత్రలలో క్లాసిక్స్ గా చెప్పుకునే షోలే, హం ఆప్కే హై కౌన్, కహో నా ప్యార్ హై లాంటి వాటికి సైతం ఇది సాధ్యం కాలేదు. అంతే కాదు లైకులు కూడా మిలియన్ దాటేసి ఫుల్ లెన్త్ ఫీచర్ ఫిలింస్ వీక్షణాల్లో ఇక్కడా తన ప్రతాపం చూపించాడు సరైనోడు. ఇది కేవలం ఏడాదికే సాధ్యమైన రికార్డు. అంతకు ముందు ఓ రెండు వందల మిలియన్లు వచ్చినప్పుడు ఏదో సాంకేతిక కారణాల వల్ల డిలీట్ చేసిన గోల్డ్ మైన్స్ ఛానల్ ఫ్రెష్ గా అప్ లోడ్ చేశాక కూడా అదే స్థాయి స్పందన దక్కింది. ఇప్పుడు సరైనోడు నిజంగా ఆ యూట్యూబ్ ఛానల్ కు బంగారు గనిలా మారిపోయాడు. దేశ జనాభాలో 30 శాతం చూశారంటే అది మాములు ఘనత కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా చూసిన కౌంటే అయినప్పటికీ చిన్న విషయం అయితే కాదు. దీంతో బన్నీ అభిమానుల ఆనందం మాములుగా లేదు.
అల వైకుంఠపురములో నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డులు కొట్టాక లాక్ డౌన్ టైంలోనూ తమ హీరో గురించి సోషల్ మీడియాలో చర్చ జరగడం పట్ల వాళ్ళ సంతోషం మాటల్లో చెప్పేది కాదు. బోయపాటి శీను దర్శకత్వం వహించిన ఊర మాస్ ఎంటర్ టైనర్ సరైనోడు రిలీజ్ టైంలో ఇక్కడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అల్లు అర్జున్ లోని మాస్ యాంగిల్ ని పూర్తిగా వెలికి తీసిన చిత్రంగా ఇప్పటికీ ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటారు. తనే కాదు జూనియర్ ఎన్టీఆర్, నితిన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లాంటి హీరోల డబ్బింగ్ సినిమాలకు సైతం ఇదే స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది కానీ అవేవి సరైనోడు, సన్ అఫ్ సత్యమూర్తి, జులాయికి సమానంగా లేకపోవడం గమనార్హం. ఈ పరిణామాల వల్లే మన సినిమాల హిందీ డబ్బింగ్ హక్కులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడి నిర్మాతకు అదనపు ఆదాయం బాగా సమకూరుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే సినిమాలలో పాటలు, ఫైట్లు ఎక్కువగా జోడిస్తున్న దర్శకనిర్మాతలు చాలానే ఉన్నారు