Idream media
Idream media
సినిమాలు రెండు రకాలు, థియేటర్‌లో నిన్ను నువ్వు మరిచిపోయేది, నిన్ను నీకు గుర్తు చేసేది. మొదటిది కమర్షియల్ సినిమాలు, రెండోది ఆర్ట్ సినిమాలు. అందుకే సినిమా అంటే అందమైన మోసమని గోడార్డ్ అనే ప్రముఖ ఫ్రెంచి దర్శకుడు అంటాడు.
అనిల్ రావిపూడికి కమర్షియల్ సినిమా ఆర్ట్ పట్టుబడింది కానీ, కథ తయారు చేసుకోవడంలో కొంచెం వీక్. సెకండాఫ్ మరీ తడబడతాడు. “సరిలేరు నీకెవ్వరు” సినిమాలో ఇది స్పష్టంగా కనపడుతుంది. F2లో కూడా ఇదే సమస్య. ఎలాగో లాగి బయటపడ్డాడు. ఇక్కడ మహేశ్‌బాబు ఇమేజ్‌ని మోస్తూ జాగ్రత్తగా ఒడ్డు చేరాలి. లగేజీ ఎక్కువై ఒక దశలో రెండుమూడు మునకలు వేసి ఊపిరాడక ఇబ్బంది పడినా , గట్టెక్కాడు. ఫస్టాఫ్ తర్వాత సూపర్ హిట్ అనుకున్న అభిమానుల్ని వెనక్కి లాగి Above Average దగ్గర నిలబెట్టాడు. పండగ కాబట్టి ఈ సినిమా ఆడొచ్చు, కలెక్షన్స్ కూడా రావచ్చు. అయితే అనిల్ తన లోపాల్ని గుర్తు పట్టకపోతే చాలా తొందరలోనే స్పీడ్ బ్రేకర్‌ని ఎదుర్కొంటాడు.
శీను వైట్ల కూడా దూకుడులో మ్యాజిక్ చేసి ఆగడులో ఆగిపోయాడు. హాస్యం రోప్‌వాక్ లాంటిది. నడుస్తూ ఉంటే చప్పట్లు కొడతారు. ప్రశంసలకు పొంగిపోతే బ్యాలెన్స్ తప్పి కిందపడతాం. సరిలేరు నీకెవ్వరులో అతి కష్టమైన ట్రైన్ సీన్‌లో అనిల్ సక్సెస్ అయ్యాడు. ఏదో ఫ్లోలో కాకుండా రైళ్లో ఉన్న అందరికి ఒక క్యారెక్టర్‌ని ఎంచుకోవడంతో 20 నిమిషాలు నవ్వించగలిగాడు.
సినిమాలో చాలా బ్లాక్‌లు (విభాగాలు) ఉంటాయి. ఆర్మీ సీన్స్ అన్నీ ఒక బ్లాక్ అనుకుంటే, దాంట్లో మహేశ్‌బాబు పరిచయం , తమన్నా పాట, ఒక ఆర్మీ ఆపరేషన్స్ ఉంటాయి. కథ టేకాఫ్ ఇక్కడ మొదలవుతుంది.
సినిమా బిగినింగ్‌లోనే ప్రొఫెసర్ భారతి (విజయశాంతి) అంటే ఏంటో చూపిస్తారు. సమాజం పట్ల బాధ్యత, విలువలకు కట్టుబడిన వ్యక్తిగా ఆ క్యారెక్టర్ పరిచయం జరుగుతుంది. మిగతా సినిమా అంతా ఆమె కథేనని సూచన అందుతుంది. స్క్రీన్ ప్లే పరంగా ఫర్‌పెక్ట్ ఎత్తుగడ ఇది.
ఆర్మీ తర్వాత ట్రైన్ ఎపిసోడ్ సెకండ్ బ్లాక్. ఇక్కడ హీరోయిన్ పరిచయం. సినిమాలో అనేక పాత్రలు, వాళ్లకో కథ క్యారెక్టర్ ఆల్రెడీ ఉండడం వల్ల హీరోయిన్‌ని తలాతోకా తెలివి లేని అమ్మాయిగా చూపిస్తారు. F2లో మెహ్రిన్ కూడా ఇలాంటి తిక్క క్యారెక్టరే. అందుకే హీరో కనపడగానే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యా పాటలు అవీ పాడేస్తుంది. చాలా కాలానికి సంగీత కనిపించింది. కామెడీ చేసింది. ఫ్రేమ్‌లో రావు రమేష్ ఉంటే, ఇంకెవరు అవసరం లేదు. అయినా కూడా ట్రైన్‌లో జబర్దస్త్ క్యారెక్టర్లు ఉంటాయి. వీళ్లందరిని కనెక్ట్ చేయడానికి రాజేంద్రప్రసాద్ కూడా ఉన్నాడు. మహేశ్ , రష్మిక, సంగీత, రావు రమేష్, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్ ఇంకా బోలెడు మందితో డైరెక్టర్ తనకు కావాల్సింది తీసుకోవడం వల్లే లాగ్ కాకుండా సీన్ నిలబడింది.
కథలో మూడో బ్లాక్ విజయశాంతి, ప్రకాశ్‌రాజ్ సంఘర్షణ. ఇది రొటీన్. చాలా సినిమాల్లో చూసిందే. ప్రకాశ్‌రాజ్‌కి ఇలాంటివి మంచినీళ్లు తాగినంత ఈజీ.కర్నూల్‌లో పవర్‌పుల్, పైగా మంత్రి. విజయశాంతిని వేధించడం, కష్టాలపాలు చేయడం ఈజీ. మరి రూల్ ప్రకారం ఇద్దరి మధ్యన హీరో రావాలి. వచ్చాడు, సరదాగా జోకులు వేస్తూ తన్నాడు. కొండారెడ్డి బురుజు దగ్గర సవాల్ చేశాడు. ఇంటర్వెల్ బ్రేక్ ఇచ్చాడు. ఫస్టాఫ్ కథ థియేటర్‌లో కూర్చున్న కాసేపటికే అర్థమైపోతుంది.
మన ఆసక్తి అంతా సెకండాఫ్‌పైనే. హీరో ఒక ఇంపార్టెంట్ పనిమీద విజయశాంతి ఇంటికి వస్తాడు. అది క్లియర్ చేయాలి. ప్రకాశ్‌రాజ్‌ని ఎదుర్కోవాలి. హీరోయిన్ కనపడక చాలాసేపైంది కాబట్టి ఆమెను కథలోకి తీసుకొచ్చి పాటలు మిగిలిపోయాయి, వాటి సంగతి చూడాలి.
ఏ డైరెక్టర్‌కైనా సెకండాఫ్ చాలా కష్టం. ముడి వేయడం ఈజీ. విప్పడం కష్టం. తన కామెడీ జానర్ తనకుండాలి. మహేశ్ ఇమేజ్‌ని ఫైట్స్ డ్యాన్సులతో Protect చేయాలి. ఇన్నేళ్ల తర్వాత విజయశాంతి సీన్‌లో ఉంది. ఆమె క్యారెక్టర్ పడిపోకుండా చూసుకోవాలి. ప్రకాశ్‌రాజ్ పెద్ద పిస్తా అని ఫస్టాఫ్‌లో బిల్డప్ ఇచ్చాం. మరి ఘర్షణ హోరాహోరీగా ఉండాలి.
ఇప్పటికే దాదాపు మూడు గంటల సినిమా వచ్చింది. ఎక్కువ ఆలోచిస్తే ఏం కొంప మునుగుతుందోనని డైరెక్టర్ Safe Game Start చేశాడు. ప్రకాశ్‌రాజ్ గ్రాఫ్ క్రమేపీ పడగొడుతూ కామెడీ చేసేశాడు. హీరోయిజం Over Elevate అయ్యి మహేశ్ స్పీచ్‌లు ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. దేశ భక్తి రంగరించి నూరిపోస్తాడు.
లెంగ్త్ పెరిగింది, ఇంకా క్లైమాక్స్ రాలేదనుకుంటూ ఉండగా హెవీ డోస్ లేకుండా సింపుల్‌గా తేల్చేస్తాడు. విజయశాంతితో చాలా పెద్ద ఎమోషనల్ సీన్ ఉంటుందనుకుంటే అదేం లేదు పొమ్మన్నాడు. మరి ప్రకాశ్‌రాజ్ సంగతేంటి అంటే అది కూడా సింపుల్ అన్నాడు.
అభిమానులకి OKగానీ , మామూలు ప్రేక్షకులు కొంచెం నిరాశతోనే బయటకొస్తారు. పండగ పూట మంచి భోజనమే పెట్టారు కానీ, కాసేపు బిర్యానీ, కాసేపు పాయసం వడ్డిస్తాడు. రెండూ రుచే కానీ, కలిస్తే ఏం తింటున్నామో అర్థం కాదు.
మహేశ్ మటుకు కొత్త ఎనర్జీతో కనిపిస్తాడు. రష్మిక అక్కడక్కడ అందంగానే ఉంది. విజయశాంతి బాగా నటించింది అంటే అతిశయోక్తి. ఆమె నటన అప్పుడు ఇప్పుడు అద్భుతమే.
రత్నవేలు కెమెరా, కళ్లకు విందు. దేవిశ్రీ ప్రసాద్ రెండు పాటలు సూపర్భ్, మిగిలనవి OK. డైలాగ్‌లపై అనిల్ ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. పదేపదే చూడాల్సిన సినిమా, One Time Watching Movieగా ఎందుకు మారిందంటే సెకండాఫ్‌లో కథ లేకపోవడం (ఉన్న కథలోకి అనవసరమైన ఇన్వెస్టిగేషన్ ఎఫిసోడ్ , రాజకీయాలు, దేశభక్తి వచ్చి చేరడం).