సర్దార్ వల్లభాయ్ పటేల్ 144వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులు అర్పించారు. గుజరాత్‌లోని కేవడియాలో పటేల్ ‘‘ఐక్యతా విగ్రహాన్ని’’ సందర్శించి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగే ఏకతా దివస్ పరేడ్‌లో ఆయన పాల్గొననున్నారు. టెక్నాలజీ ప్రదర్శనను తిలకించడంతో పాటు కేవడియాలో సివిల్ సర్వీస్ ప్రొబెషనర్లతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ట్విటర్లో స్పందిస్తూ… ‘‘సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు. దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం’’.. అని పేర్కొన్నారు. 2014 నుంచి ప్రతి ఏడాది అక్టోబర్ 31న కేంద్ర ప్రభుత్వం ‘‘జాతీయ ఐక్యతా దినోత్సం’’ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.