iDreamPost
iDreamPost
ఎన్నో దుర్ఘటనలు, ఎందరో మహానుభావుల మరణాలు, కరోనా వ్యాప్తితో జీవితాల అతలాకుతలాలు వెరసి ఈ తరం ఎప్పటికీ మర్చిపోలేని సంవత్సరంగా మిగిలిన 2020 ఇంకో 45 రోజుల్లో ముగియబోతోంది. వ్యాక్సిన్ ఇంకా రానప్పటికీ వైరస్ తగ్గుముఖం పట్టడం పట్ల ఒకవైపు ఆనందంగానే ఉన్నా కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ మొదలుకావడంతో ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇక సినిమా పరిశ్రమ గురించి చెప్పేదేముంది. ఎనిమిది నెలలుగా మూసిన థియేటర్లలో ఎలాంటి చలనం లేదు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో పట్టుమని ఓ అయిదు శాతం కూడా తెరుచుకోలేదు. వచ్చే నెలకైనా ఏదైనా ఆశించవచ్చో లేదో అర్థం కావడం లేదు.
ఈ నేపథ్యంలో సంక్రాంతి బరిలో పోటీ పడేందుకు సిద్ధమైన సినిమాలు అప్పటికి ఖచ్చితంగా వస్తాయా లేదా అనే అనుమానాలు మళ్ళీ మొదలయ్యాయి. బస్సుల్లో పూర్తి కెపాసిటీకి అనుమతులు ఇచ్చినప్పుడు థియేటర్లకు మాత్రం సగం సీట్లనే నిబంధన ఎందుకనే వాదన డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతల వైపు నుంచి వస్తున్నప్పటికీ ప్రభుత్వాలు దాన్ని పరిశీలించడం లేదు. స్తంభించిన నాలుగు గోడల వాతావరణం కాబట్టి వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతుందనే భయం వల్ల ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఒకవేళ కొత్త ఏడాదిలోనూ ఇవే నిబంధనలు కొనసాగితే అది ఆశనిపాతమే.
రవితేజ క్రాక్, రానా అరణ్య, రామ్ రెడ్, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇప్పటికే ఆ సీజన్ ని టార్గెట్ చేశాయి. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ని దించే ఆలోచన కూడా జరుగుతోంది. ఇవి కాకుండా ఉప్పెన, సోలో బ్రతుకే సో బెటరూ, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, లవ్ స్టోరీ, రంగ్ దే, లాంటివి ఎటూ తేల్చుకోలేని అయోమయంలో ఉన్నాయి. ఒకవేళ పండగ సమయానికి పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోతే ఇవన్నీ మళ్ళీ సమ్మర్ కి వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు షూటింగ్ లో ఉండి ఆ టైంకి ఫస్ట్ కాపీలు సిద్ధమయ్యే సినిమాలు చాలా ఉంటాయి. అప్పుడు క్లాష్ అయ్యే సిచువేషన్ వస్తుంది. ఇంకోవైపు ఓటిటిలు మార్కెట్ ని బలపరుచుకునే ఎత్తుగడలు గట్టిగా వేస్తున్నాయి. మరి ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో వేచి చూడాలి