iDreamPost
android-app
ios-app

ఇసుక సమస్య – నిజానిజాలు

  • Published Nov 14, 2019 | 5:13 AM Updated Updated Nov 14, 2019 | 5:13 AM
ఇసుక సమస్య – నిజానిజాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఇసుక దుమారం కొన‌సాగుతోంది. ప్ర‌తిప‌క్షాలు వ‌రుస‌గా నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నాయి. పాల‌క‌పార్టీ పెద్ద‌లు మాత్రం ఇసుక కొరత కొంత మేర ఉందని,దానికి కారణం ఈ సంవత్సరం గత 2 దశాబ్దాలలో రానంత వరద రావటమే అని చెబుతున్నారు. ప్ర‌స్తుతం వ‌ర‌ద‌లు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఇసుక వారోత్స‌వాల‌కు స‌ర్కారు సిద్ధం అయ్యింది.మరో వైపు చంద్రబాబు ఇసుక కొరత మీద ఈరోజు 12 గంటల దీక్షకు దిగారు.

గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా

ఇసుక గ‌త కొన్నేళ్లుగా ప్ర‌తీ ప్ర‌భుత్వంలోనూ పెద్ద స‌మ‌స్య‌గా మారుతోంది. చంద్ర‌బాబు స‌ర్కారులో ఏకంగా మ‌హిళా త‌హాశీల్దార్ పై ఎమ్మెల్యే చింత‌మనేని ప్ర‌భాక‌ర్ దాడి మొద‌లుకుని రాష్ట్ర‌వ్యాప్తంగా అనేక‌ మంది ప్ర‌భుత్వ సిబ్బందిపై చేయి చేసుకునే వ‌ర‌కూ సాగింది. అదే స‌మ‌యంలో డ్వాక్రా గ్రూపు మ‌హిళ‌ల‌తో ఇసుక త‌వ్వ‌కాలు అంటూ కొంత‌కాలం, ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఉచిత ఇసుక అంటూ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌తో మాఫియా యదేఛ్చ గా సాగిపోయింది. చిత్తూర్ జిల్లా ఏర్పేడు ద‌గ్గ‌ర ఏకంగా 14 మంది సామాన్యులను ఇసుక మాఫియా లారీలతో తొక్కిచంపిన ఘటనను ఏపీ ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ మ‌ర‌చిపోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 40మందికి పైగా టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుక మాఫియాలో భాగ‌స్వాములుగా ఉన్న‌ట్టు ఆనాడే ఈనాడు ప‌త్రిక బ‌య‌ట‌పెట్టింది. ప‌రోక్షంగా మ‌రో 40 మంది ఎమ్మెల్యేలు ఇసుక అక్ర‌మాల‌కు అండ‌గా నిలుస్తున్న‌ట్టు వెల్ల‌డించ‌డం గ‌మ‌నిస్తే తెలుగుదేశం ప్ర‌భుత్వంలో దాదాపుగా ప్ర‌తీ ఎమ్మెల్యే ఇసుకలో వేలు పెట్టిన విష‌యం విదితం అవుతోంది.

NGT వంద కోట్ల జ‌రిమానా

ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు స‌ర్కారు తీరు మీద ఏకంగా నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యూన‌ల్ వ‌ర‌కూ ఫిర్యాదులు వెళ్లాయి. ఎన్జీటీ తీర్పులో ఏపీ ప్ర‌భుత్వానికి 100 కోట్లు జ‌రిమానా కూడా విధించింది. అంతేగాకుండా ప‌ర్యావ‌ర‌ణాన్ని నాశనం చేస్తున్నారంటూ మండిప‌డింది. ఏప్రిల్ 7వ తేదీన‌ వ‌చ్చిన ఈ తీర్పుతో అక్ర‌మ ఇసుక త‌వ్వ‌కాల‌కు బ్రేకులు ప‌డ్డాయి. కృష్ణా గోదావ‌రి న‌దుల‌తో పాటుగా రాష్ట్రంలోని అనేక చోట్ల ఇసుక మాఫియా తీరు మీద ఎన్జీటీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో మార్చి త‌ర్వాత ఇసుక త‌వ్వ‌కాలు నిలిపివేశారు. ఎన్నిక‌ల వేళ ఇసుక మాఫియా వ్య‌వ‌హారం ఓట‌ర్ల దృష్టికి రాకూడ‌ద‌నే ల‌క్ష్యంతో చంద్ర‌బాబు కూడా ఇసుక త‌వ్వ‌కాల మీద దృష్టి పెట్ట‌లేదు. ఇది వేస‌విలో నిర్మాణ ప‌నులు ఉధృతంగా చేప‌ట్టే వారికి చిక్కులు తెచ్చింది.

జగన్ ప్రభుత్వ విధానం

ఎన్జీటీ తీర్పు,గ‌త ప్ర‌భుత్వ అక్ర‌మాలు గ‌మ‌నంలో ఉంచుకుని మే నెలాఖ‌రులో ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు స్వీక‌రించిన వైఎస్ జ‌గ‌న్ కూడా ఇసుక మీద ఆచితూచి స్పందించారు. అవినీతి లేని, పార‌ద‌ర్శ‌క ఇసుక విధానం రూపొందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈలోగా ఏపీలో వ‌ర‌ద‌లు విరుచుకుప‌డ్డాయి. గ‌త మూడు, నాలుగు ద‌శాబ్దాల త‌ర్వాత తొలిసారిగా రాష్ట్ర‌వ్యాప్తంగా వ‌ర‌ద‌ల ప్ర‌భావం క‌నిపించింది. కృష్ణా న‌దిలో ఏకంగా 7 సార్లు గేట్లు ఎత్తి సుమారుగా 1100 టీఎంసీల నీటిని స‌ముద్రంలోకి వ‌దిలే స్థాయిలో న‌దీ ప్ర‌వాహం సాగింది. దాంతో ఇసుక త‌వ్వ‌కాల‌కు తీవ్ర జాప్యం జ‌రిగిన‌ట్టుగా క‌నిపించింది. చివ‌ర‌కు కొత్త ఇసుక పాల‌సీని సెప్టెంబ‌ర్ 5నుంచి అమ‌లులోకి తెచ్చారు.

ఇసుక కొరత

అక్టోబ‌ర్ చివ‌రి నాటికి కూడా ప్ర‌ధాన న‌దుల్లో ఇసుక త‌వ్వ‌కాల‌కు తీవ్ర ఆటంకం ఏర్ప‌డింది. దాంతో ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కార‌మే నేటికీ 100 లోపు ఇసుక ర్యాంపుల్లో మాత్ర‌మే త‌వ్వ‌కాలు జ‌రుపుతున్నారు. రోజూ 1ల‌క్ష మెట్రిక్ ట‌న్నుల ఇసుక త‌వ్వుతున్నారు. కానీ దాదాపు 7 నెల‌ల పాటు ఇసుక కొర‌త ఉండ‌డంతో ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం స్టాక్ పాయింట్ల ద్వారా అందిస్తున్న ఇసుక సామాన్య‌ల‌కు అవ‌స‌ర‌మైన స్థాయిలో క‌నిపించ‌డం లేదు. అదే స‌మ‌యంలో ఆన్ లైన్ లో బుక్ చేసుకుని, బ్యాంకులో చ‌లానా క‌ట్టి, రెవెన్యూ అధికారుల‌కు వాటిని స‌మ‌ర్పించి, ఆ త‌ర్వాత స్టాక్ పాయింట్ లో ఇసుక తీసుకోవాల‌నే విధానం కార‌ణంగా ఇసుక వినియోగ‌దారుల‌కు పెద్ద స‌మ‌స్య‌గా మారుతోంది. మొద‌ట్లో వారం రోజుల పాటు ఈ ప‌ని స‌రిపోయేది. ఇప్ప‌టికీ నాలుగు రోజులు త‌క్కువ కాకుండా ఈ ప‌నిచుట్టూ తిరుగుతుండ‌డంతో చాలా మంది గ‌గ్గోలు పెడుతున్నారు.

Also Readఇసుక కొరత వలనే భవన నిర్మాణ కార్మికులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారా? 

అదనపు భారం

ఇసుక ధ‌ర కూడా ట‌న్నుకి రూ.375 చొప్పున ప్ర‌భుత్వానికి చెల్లించాల్సి వ‌స్తోంది. మూడు యూనిట్ల లారీకి గానూ దాదాపుగా రూ.2200 చ‌లానా తీస్తే ఇక ఇసుక త‌రలించ‌డానికి లారీ ఖ‌ర్చు కూడా క‌లిపితే అద‌న‌పు భారంగా క‌నిపిస్తోంది. ఇది వినియోగ‌దారుల‌కు ఇబ్బందిని క‌లిగిస్తోంది. అధిక ధ‌ర చెల్లించాల్సి రావ‌డం, అద‌నంగా స‌మ‌యం వెచ్చించ‌డం, అంతా చేసినా ఇసుక ఎప్పుడు వ‌స్తుందో ధీమా లేక‌పోవ‌డం, ఆన్ లైన్ లో బుక్ చేసుకోవ‌డానికి మ‌ధ్యాహ్నం 12గం.ల‌కు సైట్ ఓపెన్ చేస్తే ఆ వెంట‌నే త‌త్కాల్ టికెట్ మాదిరిగా క్లోజ్ అయిపోతుండ‌డంతో జ‌నం స‌త‌మ‌తం అవుతున్నారు.

కృతిమ కొరత

కొందరు కుట్ర పూరితంగా ఇసుక కొరతను కృతిమంగా సృష్టించారన్న ఆరోపణలుఉన్నాయి. టీడీపీ ప్రభుత్వంలో ఇసుక సరఫరాకు సంబంధించి “మన శాండ్‌” యాప్‌ను నిర్వహించిన “బ్లూఫ్రాగ్‌ మొబైల్‌ టెక్నాలజీ ” సంస్థ వైసీపీ ప్రభుత్వ ఏర్పడిన తరువాత ప్రభుత్వం తరఫున ఇసుక సరఫరా విధానాన్ని పర్యవేక్షిస్తున్న RTGS (రియల్‌ టైం గవర్నెన్స్‌ సొసైటీ)ని బ్లాక్‌ చేశారని, కృత్రిమ కొరతను సృష్టించారన్న ఆరోపణలతో నిన్న CID అధికారులు విశాఖపట్టణంలోని బ్లూఫ్రాగ్‌ సంస్థ ఆఫీస్ మీద దాడులు నిర్వహించారు. వివరాలు CID ఆధికారులు వెల్లడించవలసిఉంది.

Also Read: ప్రభుత్వ వెబ్సైట్ హ్యాక్ – అడ్డంగా దొరికిన బ్లూఫ్రాగ్‌

సమస్య పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు

స‌మ‌స్య అధిగ‌మించేందుకు ఉచిత ఇసుక ప‌థ‌కం అమ‌లు చేయాల‌ని ప్ర‌తిప‌క్ష టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఉచిత ఇసుక మాత్ర‌మే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తుంద‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. త‌న హ‌యంలో విఫ‌ల‌మ‌వ‌డ‌మే కాకుండా ఎన్జీటీతో మొట్టికాయ‌లు వేయించుకున్న‌ ఇసుక విధానం, జ‌గ‌న్ కూడా అమ‌లు చేయాల‌ని విప‌క్ష నేత కోర‌డం విడ్డూర‌మేన‌ని ప‌లువురు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఇసుక విధానం కార‌ణంగా ప్ర‌భుత్వానికి సుమారుగా 10వేల కోట్లు ఆదాయం ల‌భించే అవ‌కాశం ఉన్నందున విప‌క్షం దానిని దృష్టిలో పెట్టుకుని ఉచిత ఇసుక కావాల‌ని అంటున్న‌ట్టుగా ఉంద‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాత్రం ఇసుక వారోత్స‌వాలు నిర్వ‌హించి, వ‌ర‌ద‌లు త‌గ్గినందున కొర‌త తీర్చాల‌ని ఆదేశించారు. అదే స‌మ‌యంలో ఇసుక అక్ర‌మ త‌ర‌లింపుని అడ్డుకునేందుకు తాజా క్యాబినెట్ లో చ‌ట్టం ప‌టిష్ట ప‌రిచారు. ప్ర‌తీ వాహ‌నానికి జీపీఎస్ ద్వారా ప‌ర్య‌వేక్షించి, ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెబుతున్నారు. అంతేగాకుండా ఇసుక ధ‌ర‌ల‌ను నియోజ‌క‌వ‌ర్గాల వారీగా నిర్ణ‌యించాల‌ని ఆదేశించారు. ఇది స్థానికంగా కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగించే అవ‌కాశం ఉంది. కానీ ఇసుక విష‌యంలో సాధార‌ణ స్థితి ఏర్ప‌డ‌డానికి ఇంకాకొంత స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చ‌ని ఏపీఎండీసీ అధికారులు సైతం భావిస్తున్నారు.