Idream media
Idream media
రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్న ఇసుక కొరత ఆధారంగా ఆత్మహత్యలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల విశాఖ సభలో చెప్పినట్టుగా 32 మంది భవన నిర్మాణ కార్మికులు మరణించారు. కానీ వారి వివరాలు ఏంటన్నది మాత్రం ఆయన తెలియజేయలేదు.
అదే సమయంలో పలువురు భవన నిర్మాణ కార్మికుల సహజ మరణాలను, ఇతర కారణాలతో జరిగిన ఆత్మహత్యలను కూడా ఇసుక కొరత ఖాతాలో చూపేందుకు ప్రయత్నిస్తున్న విషయం ఇప్పటికే బయటపడింది. విపక్ష టీడీపీ , జనసేనకు తోడుగా కొందరు మీడియా ప్రతినిధులు కూడా బాధితుల కుటుంబాలను ప్రలోభ పెడుతున్నట్టుగా వెల్లడయ్యింది. గుంటూరు జిల్లా బాపట్ల మండలం భర్తిపూడి లో ఆత్మహత్యకు పాల్పడిన నలుకుర్తి రమేష్ ఇంటికి వెళ్లి టీవీ5, ఈటీవీ ప్రతినిధులు 5లక్షల రూపాయలను ఆశ పెట్టి మభ్యపెట్టే ప్రయత్నం చేశారని మృతుడి కుటుంబీకులు తెలపడం విశేషంగా చెప్పవచ్చు. తీవ్రమైన అనారోగ్యం కారణంగా ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆత్మహత్య చేసుకునన రమేష్ వాస్తవానికి ఎన్నడూ తాపీపనికి వెళ్లిన అనుభవం లేకపోయినా భవన నిర్మాణ కార్మికుడిగా చూపించి, ఇసుక కొరత కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టుగా చూపించడానికి ప్రయత్నించిన విషయం విస్మయకరంగా మారింది.
దానికి ముందు తాడేపల్లి మండలంలోని ఉండవల్లిలో ఓ అపార్ట్ మెంట్ లో వాచ్ మేన్ గా ఉన్న రంగయ్య అనే వ్యక్తి ఆత్మహత్యని కూడా ఇదే రీతిలో చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. గతంలో తాడేపల్లిగూడెంలో భవన నిర్మాణ పనులకు వెళ్లిన రంగయ్య ఆత్మహత్యను కూడా ఇసుక కొరత వల్ల చనిపోయిన వారి జాబితాలో చేర్చి ప్రచారం చేసినట్టు అధికార యంత్రాంగం చెప్పింది. ఇక గుంటూరు రూరల్ మండలం గోరంట్లకు చెందిన పోలేపల్లి వెంకటేశ్వర రావు ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. ఈ వీడియోలోని ఒకటిన్నర నిమిషం కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఇసుక కొరత వల్ల కార్మికులు ప్రాణాలు తీసుకుంటున్నారనే ప్రచారం ఉధృతం అయ్యింది. వెంకటేశ్వర రావు ఏప్రిల్ 2 వ తేదీన ఆత్మహత్య చేసుకున్న వీడియోని 26 రోజుల తర్వాత టీడీపీ అధినేత ట్విట్టర్ లో పోస్ట్ చేయడం విశేషం. “పరిస్థితులు బాగోలేక పనుల్లేవు. సంపాదన లేదు. పెళ్లాం, బిడ్డలను బతికించుకోలేని పరిస్థితుల్లో ఉన్నా. అందరూ అడుగుతున్నారు.. ఏం చేస్తావని..పైపుల పనిచేస్తానని గొప్పగా చెప్పుకుంటున్నాను. పనులున్నాయా అని అడుగుతున్నారు. ఉన్నాయని చెబుతున్నాను. కానీ నాకు పనుల్లేవు. దాంతో పనుల్లేవనే అసహనాన్ని నా భార్య మీద, నా బిడ్డ మీద చూపించాల్సి వస్తోంది. నన్ను నమ్మి వచ్చిన వాళ్లని మోసం చేయలేను. చేతగాని వాడిలా చచ్చిపోతున్నా.. ” అంటూ సెల్ఫీ వీడియోలో బయటకు వచ్చిన భాగంలో ఉండడం కలకలం రేపింది. వెంకటేశ్వర రావు కి ఏడాది లోపు వయసులో ఉన్న కుమార్తె ఆరోగ్యం కోసం ఎన్ని అప్పులు చేసి ట్రీట్ మెంట్ చేసినా కుదుట పడకపోవడం, డాక్టర్లు మరో రూ.60వేలు ఖర్చవుతుందని చెప్పడంతో ఇక అప్పులు పుట్టకపోవడం అతన్ని మానసికంగా కుంగదీసిందని అతని భార్య ఉష తెలిపింది. అయినా వెంకటేశ్వర రావు ఆత్మహత్య ఇసుక కొరత కారణంగానేననే రీతిలో చిత్రీకరించడంతో చివరకు సర్కారు కూడా స్పందించింది.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో కాలే ప్రసన్నకుమార్, తెనాలి మండలం సంగం జాగర్లమూడికి చెందిన చింతం నాగబ్రహ్మజీ , గుంటూరు నగరానికే చెందిన పడతావు వెంకట్రావు కూడా బలవన్మరణం పాలయ్యారు. కాకినాడకు చెందిన గుర్రం నాగరాజు బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరికి రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించింది. దానికి గానూ నష్టపరిహారం విడుదల చేసినట్టు బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ నుంచి నిధులు విడుదల చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ కాలంలో ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్నప్పటికీ వాటిని ఇసుక కొరత జాబితాలో చేర్చే ప్రయత్నం చేయడం, దానికోసం టీడీపీ తో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా చేసిన ప్రయత్నం మాత్రం అందరినీ విస్మయానికి గురిచేసిందనే చెప్పవచ్చు.