Idream media
Idream media
కోర్టులో గెలిచిన అశోక్ గజపతి రాజు కోరి చిక్కులు కొని తెచ్చుకుంటున్నారా? తాను చేస్తున్న ఆరోపణలే ఆయన చుట్టూ చుట్టుకుంటున్నాయా..? అంటే అవును అన్నట్లుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ట్రస్ట్ ఆధ్వర్యంలో గతంలో జరిగిన అవకతవకలు బయటపడుతుండడం అది ఆయనకే తలనొప్పులుగా మారుతోంది. ట్రస్టు ముసుగులో ఇంత కాలంగా ఇన్ని అక్రమాలు జరిగాయా అనే చర్చ మొదలైంది. వంశపారంపర్యంగా ట్రస్టు బాధ్యతలు చూస్తున్న గజపతి రాజు ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బయటపడుతున్న అక్రమాలు
కోర్టు తీర్పు తర్వాత మాన్సాస్ ఛైర్మెన్‌గా అశోక్ గజపతిరాజు తొలి సంతకం చేసిన రాజు మాట్లాడుతూ.. మాన్సాస్‌లో ఆడిట్ జరగలేదంటే ఆశ్చర్యపోయానన్నారు. ఆడిట్ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనన్నారు. ప్రతి ఏడాది ఆడిట్ జరపటానికి సంస్ధ నుంచి ఫీజు కూడా అధికారికంగా చెల్లించామన్నారు. అయితే, ఎక్కువ కాలం ఆయనే చైర్మన్ గా ఉన్నారనే సంగతి మరచిపోయారు. ట్రస్టు ఆధ్వర్యంలో సంవత్సరాలుగా జరిగిన అవకతవకలు, అక్రమాలన్నీ ఇపుడు బయటపడుతున్నాయి. వేలాది ఎకరాల భూములు కోట్లరూపాయల ఆస్తులు ట్రస్టు సొంతం. ట్రస్టు వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం వినిపిస్తున్న ఆరోపణలపై విచారణ మొదలుపెట్టింది. ఈ విచారణలో ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన భూ సంతర్పణలు అక్రమాలన్నీ బయటపడుతున్నాయి. ముఖ్యంగా సింహాచలం దేవాలయానికి చెందిన 748 ఎకరాల భూములను ఇతరులకు కట్టబెట్టిన విషయం సంచలనంగా మారింది. ట్రస్టు పేరుతో ఉన్న వేలాది ఎకరాల భూముల్లో అత్యధికం టీడీపీ నేతల చేతుల్లోనే ఉందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే.
ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడే
దశాబ్దాల పాటు అశోక్ ఛైర్మన్ గా ఉన్నపుడే భూములన్నీ ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇతరులంటే ఇక్కడ టీడీపీ నేతలనే అర్ధం చేసుకోవాలి. గతంలో జరిగిన అక్రమాలన్నీ ఒకఎత్తు 2014-19 మధ్యలో జరిగిన అక్రమాలు ఒకఎత్తు. మరి టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలకు అయితే చంద్రబాబు లేకపోతే అశోకే బాధ్యత వహించాలి. టీడీపీ హయాంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్న అధికారుల జాబితా బయటకువస్తోంది. చంద్రబాబు సంగతి ఎలాగున్నా ట్రస్టు ఛైర్మన్ హోదాలో ఉన్న అశోక్ చిక్కుల్లో పడినట్లే. తన స్ధానంలో సంచయితను ఛైర్ పర్సన్ గా నియమించినపుడు అశోక్ మాట్లాడకుండా ఉండుంటే అక్రమాలపై ఇప్పుడింత చర్చ జరిగేది కాదేమో! తన హయాంలో జరిగిన అక్రమాలను వదిలేసి వైసీపీ ప్రభుత్వం హయాంలోనే అక్రమాలు జరుగుతున్నట్లు అశోక్ పదే పదే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. విచారణలో బయటపడుతున్న విషయాలు చూస్తుంటే అశోక్ కు ఇబ్బందులు తప్పవన్నట్లే ఉంది.
లింగ వివక్ష ఆరోపణలు
ఛైర్మన్ గా తనను తొలగించిన దగ్గర నుంచి ప్రభుత్వంపైనే కాకుండా సంచయితపై కూడా అశోక్ గజపతి రాజు నోరుపారేసుకుంటూనే ఉన్నారు. దీనిపై సంచయిత విశాఖలో రాష్ట్ర మహిళ కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మను కలిసి గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు. తన నియామకంతో పాటు వారసత్వం అంశాన్ని కించపరిచేలా అశోక్ గజపతిరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆమె మాన్సాస్ లింగ వివక్షపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిష్ఠాత్మక మాన్సాస్ ట్రస్టుకు తొలి మహిళా ఛైర్ పర్సన్ గా వ్యవహరించిన సంచైతను దింపడానికి దుష్టప్రయత్నం జరిగిందని మహిళా కమిషన్ ఛైర్ పర్శన్ వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఓ మహిళ ఛైర్మన్ పదవి నుంచి దిగిపోతే సంబరాలు చేసుకున్నారని విమర్శించారు. లింగ వివక్షత ఎక్కడ చూపినా నేరం అవుతుందని భారత రాజ్యాంగంలోనే ఉందని వాసిరెడ్డి పద్మ తెలిపారు. మహిళలకు అధికారం లేదని చెప్పే ఏ వాదనా చెల్లదన్నారు. రాజరికం ముసుగులో మాన్సాస్ ట్రస్టులో మహిళల హక్కులపై దాడి జరిగిందని విమర్శించారు.
రాజుగారి పరపతి ఇంతేనా
మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపి అశోక్ గజపతిరాజును తొలగించి, ఆ బాధ్యతల్ని సంచయిత గజపతిరాజుకు అప్పగించింది ఏపీ ప్రభుత్వం. దీనిపై అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన సంచయిత నియామకానికి సంబంధించిన జీవోను కొట్టి వేసింది. దీంతో మాన్సాస్ ట్రస్ట్‌తో పాటు సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త బాధ్యతల్ని తిరిగి చేపట్టారు అశోక్ గజపతిరాజు. అనంతరం అధికారులు తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని బహిరంగంగా పేర్కొని తన పరువును తానే తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆయనకు ఆ ప్రాంతంలో తిరుగులేదనే పేరుంది. ఆ పేరు అధికారం వల్ల కానీ, వ్యక్తిగతంగా కాదనేది గజపతి ఆరోపణలతో స్పష్టమైంది. మొత్తమ్మీద కోర్టులో గెలిచిన గజపతి.. బాహ్య ప్రపంచంలో ఎదురవుతున్న చిక్కుల నుంచి ఎలా తప్పించుకుంటారో చూడాలి.