Idream media
Idream media
దాదాపు రెండు నెలలుగా సాగుతున్న ఆర్టీసీ సమస్యకు తెలంగాణ సీఎం కేసీఆర్ ముగింపు పలికారు. ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయడంతో సహా 26 డిమాండ్లతో సమ్మెమొదలు పెట్టిన కార్మికులకు చివరికి ఎలాంటి ఫలితం దక్కకపోగా.. ఉద్యోగాలు నిలుపుకునేందుకు అష్టకష్టాలు పడ్డారు. ఉద్యోగాల్లో చేరేందుకు చివరకు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు సీఎం కేసీఆర్ పట్టు విడిచారు. కార్మికులు రేపు శుక్రవారం విధుల్లోకి చేరొచ్చని ప్రకటించారు. ఎలాంటి షరతులు ఉండవని చెప్పారు. తెలంగాణ మంత్రి వర్గ సమావేశం తర్వాత కేసీఆర్ తన నిర్ణయాన్ని వెల్లడించారు.
ఆర్టీసీ ప్రైవేటుపరం చేయబోమని స్పష్టం చేశారు. ఆర్టీసీ కోలుకునేందుకు తాత్కాలికంగా వంద కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. కార్మిక సంఘాలను క్షమించబోమని హెచ్చరించారు. సమ్మె సమయంలో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని భరోసా యిచ్చారు. వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీయిచ్చారు.
ఆర్టీసీ కార్మికులు క్రమశిక్షణతో ఉంటే సింగరేణిలా బోనస్‌లు ఇప్పిస్తానని, క్రమశిక్షణారాహిత్యాన్ని సహించబోమని హెచ్చరించారు. డిపో నుంచి ఇద్దరితో వర్కర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు రియలైజ్ కావాలనే తాను సమ్మె పట్ల కఠినంగా వ్యవహరించానని వెల్లడించారు. కార్మిక నాయకులు, ప్రతిపక్ష నాయకులు ఆర్టీసీ కార్మికులను మోసం చేశారని విమర్శించారు.
ఆర్టీసీ సంస్థ బతకాలన్నది తన ఉద్దేశమని, కార్మికుల మంచిచెడులు చూడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ‘మీరు బతకండి.. సంస్థను బతికించండి’ అంటూ ఆర్టీసీ కార్మికులకు హితవు పలికారు. వారం తర్వాత ఆర్టీసీ కార్మికులను ప్రగతి భవన్‌కు పిలిచి స్వయంగా మాట్లాడతానని చెప్పారు. ఆర్టీసీ సంబంధించిన అన్ని వివరాలను వారికి అందజేస్తానని అన్నారు. ఆర్టీసీని ఏం చేయాలో కార్మికులే చెప్పాలని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులపై తమకు ఎటువంటి కక్ష లేదని కేసీఆర్ చెప్పారు.