పోలీసు డిపార్ట్‌మెంట్ లో ఉన్నతాధికారులకు కిందిస్థాయి అధికారులు సెల్యూట్ చేయడం సాధారణ విషయం. అయితే ఉన్నతాధికారి స్థానంలో తన కూతురు ఉండి సెల్యూట్ చేసే స్థానంలో తండ్రి ఉంటే ఆ తండ్రి ఎలాంటి అనుభూతికి లోనవుతాడో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా..! తాజాగా అలాంటి అరుదైన సంఘటన తిరుపతిలో ఏపి పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోలీస్ డ్యూటీ మీట్ ఇగ్నైట్ లో ఆవిష్కృతమైంది.
వివరాల్లోకి వెళితే తిరుపతి కళ్యాణి డ్యామ్ లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా శ్యామ్ సుందర్ పని చేస్తున్నారు. కాగా ఆయన అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె జెస్సి ప్రశాంతి గుంటూరు అర్బన్ సౌత్ డిఎస్పి చార్జ్ తీసుకున్నారు. కాగా రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ పోలీస్ డ్యూటీ మీట్ 2021 తిరుపతిలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి “ఇగ్నైట్” అని నామకరణం చేశారు. ఈ పోలీస్ డ్యూటీ మీట్ లో జెస్సి ప్రశాంతి “దిశ” విభాగం లో బాధ్యతలు నిర్వర్తిస్తుండగా తనకంటే పెద్ద ర్యాంకులో బాధ్యతలు నిర్వర్తిస్తున్న కుమార్తెను చూసి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ కి ఆనందం కలిగింది. దాంతో ఆయన తన కుమార్తె దగ్గరకు వెళ్లి సెల్యూట్ చేశారు.దాంతో డిఎస్పీ హోదాలో ఉన్న జెస్సి ప్రశాంతి కూడా వెంటనే తండ్రికి సెల్యూట్ చేసి ఆ తరువాత ఏంటి నాన్నా అంటూ గట్టిగా నవ్వేశారు.
ఒక తండ్రికి నిజమైన పుత్రికోత్సాహం ఎప్పుడు కలుగుతుంది..?కుమార్తె జన్మించినపుడా.. కాదు.. వాళ్ళు పెరిగి పెద్దవారై తనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నపుడు తనకు తెలియకుండానే తండ్రి గర్వపడుతూ ఉంటాడు. ఒక తండ్రి అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె తనకన్నా మెరుగైన స్థితిలో ఉంటే ఏ తండ్రి ఉప్పొంగిపోడు చెప్పండి. అలాంటి అనుభూతి తాజాగా సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్యామ్ సుందర్ పొందారు. తన కుమార్తె నిజాయితీగా విధులు నిర్వర్తిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ దృశ్యాన్ని గమనించిన తిరుపతి ఎస్పీ రమేష్ మాట్లాడుతూ ఒకే డిపార్ట్మెంట్ లో తండ్రి కూతురు కలిసి పనిచేయడం సినిమాల్లో చూస్తుంటాం. కానీ తండ్రి,కూతురు పోలీసు యూనీఫామ్ ధరించి ప్రజాసేవ చెయ్యటం తనకు వ్యక్తిగతంగా చాలా గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తండ్రికి పుత్రికోత్సాహం మిగిల్చిన జెస్సి ప్రశాంతి మరింతగా ఎదగాలని తన తండ్రికి మరింత ఆనందాన్నివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం..