iDreamPost
iDreamPost
నిన్న ప్రభాస్ ఆదిపురుష్ అధికారిక ప్రకటన రాగానే ఒక్కసారిగా దాని గురించిన వార్తలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ వర్గాల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇంత తక్కువ టైంలో ప్రభాస్ నేషనల్ స్టార్ గా ఎదగడమే కాక ఓంరౌత్ లాంటి వాంటెడ్ డైరెక్టర్ ని టి సిరీస్ లాంటి అగ్రశ్రేణి నిర్మాణ సంస్థతో టై అప్ కావడం పట్ల గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. ఇది రామాయణ గాథ ఆధారంగా రూపొందుతుందన్న క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఇక అందరి దృష్టి రాముడు కాకుండా మిగిలిన పాత్రల వైపు వెళ్తోంది. ముఖ్యంగా రావణుడిగా ఎవరు చేస్తారనే ఆసక్తి విపరీతంగా నెలకొంది.
కొద్దిసమయం ముందు వరకు అజయ్ దేవగన్ లేదా అక్షయ్ కుమార్ చేయొచ్చనే ప్రచారం జోరుగా సాగింది. తాజాగా సైఫ్ అలీ ఖాన్ పేరు తెరమీదకొచ్చింది. ఓంరౌత్ తీసిన తానాజీతో ఇతని పెర్ఫార్మన్స్ అద్భుతంగా పండింది. విమర్శకులు సైతం ప్రశంసలు గుప్పించారు. ఈ మధ్యకాలంలో ఇదే బెస్ట్ రోల్ అని కితాబు ఇచ్చారు. అందుకే ఓం రౌత్ ఈసారి కూడా తనకే ఓటు వేయొచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ప్రభాస్ కు బాహుబలిలో రానా తరహాలో ఆదిపురుష్ లోనూ ధీటైన సమఉజ్జి దొరికినట్టే. అయితే ఇది ఎప్పుడు విడుదల అవుతుందనే విషయం మాత్రం ఎవరూ చెప్పలేరు. రాధే శ్యామ్ 2021 వేసవికి వస్తుందనుకున్న నాగ అశ్విన్ సినిమాకు ఎంతలేదన్నా ఏడాదిన్నర కావాలి. అంటే 2022 చివరికి అది విడుదల కావొచ్చు. ఆదిపురుశ్ సైతం ఇంతే డిమాండ్ చేస్తుంది.
అప్పుడు 2023కంటే ముందు వచ్చే అవకాశం లేనట్టే కదా. దీని తర్వాత ప్రశాంత్ నీల్ తో కూడా ప్రభాస్ ప్రాజెక్ట్ ఉంటుందన్న టాక్ ఉంది. ఈ లెక్కన 2025 దాకా ప్రభాస్ డైరీ ఒక్క రోజు కూడా ఖాళీగా లేనట్టే. ఎవరైనా తనను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకోవాలనుకున్నా ఐదారేళ్లు వేచి చూడక తప్పదు. అభిమానులు మాత్రం కనీసం ఏడాది గ్యాప్ లేనిదే తమ హీరో కొత్త సినిమా విడుదల మీద ఆశలు పెట్టుకోవడానికి లేకుండా పోయింది. ఆదిపురుష్ సంగీత దర్శకుడితో పాటు మిగిలిన టీమ్, క్యాస్టింగ్ సెట్ చేసుకునే పనిలో ఓం రౌత్ బిజీగా ఉన్నాడు. బడ్జెట్ కూడా కనిష్టంగా మూడు వందల కోట్లకు పైగా ఉండొచ్చని ముంబై మీడియా టాక్. అంతకన్నా ఎక్కువైనా ఆశ్చర్యం లేదు. డార్లింగ్ రేంజ్ అలాంటిది మరి