iDreamPost
iDreamPost
గత ఏడాది తీవ్రమైన పోటీని తట్టుకుని సంక్రాంతి విజేతగా నిలిచిన వెంకటేష్-వరుణ్ తేజ్ ల మల్టీ స్టారర్ ఎఫ్2 సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఉంటుందని నిర్మాత దిల్ రాజు చాలా కాలం క్రితమే ప్రకటించారు. దానికి తగ్గట్టే దర్శకుడు అనిల్ రావిపూడి స్క్రిప్ట్ పనులు కూడా వేగవంతం చేశాడు. అయితే అనూహ్యంగా లాక్ డౌన్ వచ్చి అందరి ప్లానింగ్స్ తలకిందులయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎఫ్3 ని లాంచ్ చేసే అవకాశాలు తగ్గిపోయాయి. ఎఫ్3కు క్యాస్టింగ్ కూడా భారీగా అవసరం ఉండటంతో కొన్నాళ్ళు పెండింగ్ లో ఉంచడమే మంచిదని నిర్ణయించుకున్నారట.
ఈలోగా టైం వృధా కాకుండా అనిల్ రావిపూడి ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టుని సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. కమర్షియల్ అంశాలు మిస్ కాకుండా ఆడియన్స్ థ్రిల్ అయ్యేలా ఓ వినూత్నమైన కాన్సెప్ట్ తో దీన్ని తయారు చేసినట్టు వినికిడి. స్క్రిప్ట్ వినగానే సాయి పల్లవి ఓకే చెప్పినట్టుగా ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం తను తెలుగులో రానా విరాట పర్వం, నాగ చైతన్య లవ్ స్టోరీల బాలన్స్ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉంది. అవి కాగానే బహుశా అనిల్ రావిపూడితో టై అప్ అవ్వొచ్చు. తనకు చిరంజీవి నటించబోయే వేదాళం రీమేక్ లో చెల్లి పాత్ర ఆఫర్ కూడా ఉంది కానీ అది ఇంకా తేల్చలేదని తెలిసింది . ఒప్పుకోకపోవచ్చనే అంటున్నారు.
ఎన్ని ఆఫర్లు వస్తున్నప్పటికీ సాయి పల్లవి సినిమాలు ఓకే చేసే విషయంలో తొందరపడటం లేదు. గ్లామర్ రోల్స్ కు దూరంగా తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే ఎస్ చెబుతోంది. నాని శ్యామ్ సింగ రాయ్ కోసం కూడా తననే అడుగుతున్నారట. అది కూడా పెండింగ్ లోనే ఉంచినట్టు టాక్. ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలు పూర్తయ్యాక అప్పటికి కరోనా పరిస్థితి మీద పూర్తి క్లారిటీ వచ్చేసి ఉంటుంది కాబట్టి అప్పుడు డేట్లు ఎవరికి ఎలా ఇవ్వాలనే ప్లానింగ్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. సూర్య ఎన్జికె మరీ దారుణంగా దెబ్బ తినడంతో కేవలం స్టార్ ఉన్నంత మాత్రాన ఒప్పుకోకూడదని తెలిసి చ్చినట్టుంది. కథను పూర్తిగా వినకుండా చేసిన సినిమాగా అభిమానులు కూడా ఎన్జికే మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే సాయి పల్లవి స్లో అండ్ స్టడీ సూత్రాన్ని పాటిస్తోంది. ఇక కొత్త సినిమాల గురించి అధికారిక ప్రకటనలు వచ్చే దాకా వేచి చూడాలి మరి.