పరిపాలనలో నూతన శకం ప్రారంభమైంది. దేశానికి ఆంధప్రదేశ్ రాష్టం ఆదర్శంగా నిలిచింది. నూతన సంవత్సరం తొలిరోజు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్‌లో రూపం సంతరించుకుంది. మూడు నెలల కిత్రం గాంధీజీ జయంతి రోజున పురుడుపోసుకున్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ నేడు ఓ ఆకారం సంతరించుకుంది. నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవలు ప్రారంభమయ్యాయి.
7 నెలల్లోనే సాకారం..
సరిగ్గా ఏడు నెలల క్రితం ఎన్నికల సమయంలో తాను చెప్పిన మాటను సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆచరణలో చూపించారు. గ్రామాల్లో ప్రతి రెండు వేల మందికి, పట్టణాలల్లో ప్రతి నాలుగు వేల మందికి ఒక సచివాలయం ఏర్పాటు చేశారు. గ్రామాల్లో 11,158, పట్టణాల్లో 3,786 వెరసి 14,944 సచివాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. 27 శాఖలకు సంబంధించిన 530 రకాల సేవలను ప్రజలకు అందించేందుకు అవసరైమన సిబ్బందిని నియమించారు. శాశ్వత ప్రాతిపదికన 1,26,728 పోస్టులను భర్తీ చేశారు. తద్వారా నిరుద్యోగలుకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. మండల స్థాయిలో తమ గ్రామాలకు దగ్గరగా పని చేసే అవకాశం కల్పించి వారిలో సంతోషాన్ని నింపారు.
సౌకర్యవంతమైన జీవనానికి నాంది..
గ్రామీణులకు అత్యవసరమైన విద్య, వైద్యం, భూ వ్యవహారాలు, పశువైద్యం, వ్యవసాయ రంగాలకు చెందిన సేవలు ఇకపై సచివాలయాల్లోని నిపుణులైన సిబ్బంది అందించనున్నారు. ప్రజలకు ఏ అవసరమొచ్చిన తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ సిద్ధంగా ఉన్నారు. రేషన్ కార్డు, ప్రభుత్వ దృవీకరణ పత్రం, పట్టాదార్ పాస్ బుక్, ప్రభుత్వ పథకాలు.. ఇలా ఏదైనా సరే ప్రజల ఇంటి వద్దకే రానుంది. ఇకపై మండల కేంద్రాలకు వేళ్లే అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తప్పనుంది. సీఎం జగన్ చేసిన ఆలోచన ప్రజల సౌకర్యవంతమైన జీవనం గడిపేందుకు దోహదం చేస్తోంది.
సర్వం సిద్ధం..
సచివాలయాల్లో 530 రకాల సేవలు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. 200 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పించింది. కంప్యూటర్లు, ప్రింటర్లు, లామినేషన్ యంత్రాలు, వేలిముద్రలు, స్కానర్లు, ఫర్నీచర్, ఇంటర్‌నెట్ తదితర సౌకర్యాలు సమకూర్చింది. పంచాయతీ భవనాలు, పట్టణాలల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలను సచివాలయాల ఏర్పాటుకు ఉపయోగించుకున్నారు. భవనాలు అవసరమైన చోట 3,189 భవనాల నిర్మాణానికి పరిపాలనా పరమైన అనుమతలు మంజూరు చేసింది. ఒక్కొ భవనం 40 లక్షల రూపాయాలతో నిర్మించేందుకు ఆయా గ్రామాల్లో శంకుస్థాపనలు జరిగాయి. నూతన సంవత్సరం మొదటి రోజు కొత్త ఏడాది సంతోషంతోపాటు సచివాలయాలతో సరికొత్త అనుభూతిని ప్రజలు పొందనున్నారు.
25 ఏళ్ల తర్వాత..
1994లో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీ, పట్టణ సంస్థల్లో పరిపాలన, సౌకర్యాల కల్పన కోసం చేసిన చట్టం దేశంలో మొదటి సారి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతోంది. ఈ రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీలకు 29 అధికారాలు, పట్టణ సంస్థలకు 18 అధికారాలను దఖలు పరిచారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా అధికారలకు కత్తెర వేసి స్థానిక సంస్థలను తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి. అయితే ఇన్నాళ్లకు 25 ఏళ్ల తర్వాత ఈ చట్టం పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో అమలు కావడం గమనార్హం.
3447