iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నియమితులైన గ్రామ /వార్డు మహిళా పోలీసులకు పదోన్నతులు కల్పించాలని సర్కారు యోచిస్తోంది.వీరి ఉద్యోగాలను త్వరలో క్రమబద్ధీకరించనున్న నేపథ్యంలో పదోన్నతుల అంశంపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలిసింది. మహిళల రక్షణ కోసం కీలకంగా వ్యవహరించే వీరిని ప్రోత్సహించడానికి పదోన్నతులు ఇవ్వడం కోసం అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెడతారని సమాచారం.
సాధారణ పోలీసులకు సమాంతరంగా వ్యవస్థ..
పోలీస్ స్టేషన్‌కు వచ్చేందుకు మహిళలు వెనుకంజ వేస్తున్నందున వారి సమస్యలను స్థానికంగానే గుర్తించి పరిష్కరించేందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో దాదాపు 15వేలమంది మహిళా పోలీసులను ప్రభుత్వం నియమించింది. వారికి కానిస్టేబుల్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. వారి సర్వీసులను ప్రభుత్వం త్వరలోనే క్రమబద్ధీకరించనుంది.అయితే సాధారణ పోలీసుల ఎంపిక ప్రక్రియ నిబంధనలు ప్రత్యేకంగా ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా పోలీసుల ఎంపిక ప్రక్రియ వేరేగా ఉంది.దాంతో సాంకేతికంగా ఇబ్బందులు రాకుండా మహిళా పోలీసుల సర్వీసులను క్రమబద్ధీకరించాల్సి ఉంది. అందుకోసం సాధారణ పోలీసులుగా కాకుండా మహిళా పోలీసులను ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు చేస్తారని సమాచారం.
ప్రస్తుతం ఇలా..
మహిళా పోలీసులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పర్యవేక్షణలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. మహిళా పోలీసులకు కానిస్టేబుల్ హోదా ఇవ్వడంతో ఇప్పటికే వారు హోం శాఖ పరిధిలోకి వస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ వారి హాజరు, సెలవుల మంజూరు, జీతాల చెల్లింపు అంశాలు సంబంధిత మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలోనే ఉన్నాయి. దాంతో క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది.
లోతుగా సమీక్ష..
ప్రస్తుతం సచివాలయం పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులకు పదోన్నతుల కోసం హెడ్ కానిస్టేబుల్, ఏఎస్‌ఐ, ఎస్‌ఐ, సీఐ పోస్టులను ఏర్పాటు చేస్తారు. పట్టణ ప్రాంతాల్లో అయితే కొన్ని వార్డులకు, గ్రామీణ ప్రాంతాల్లో మండలానికి ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ ఉంటారు. పోలీస్ సర్కిల్ స్థాయిలో మహిళా ఏఎస్‌ఐ ఉంటారు. పోలీస్ సబ్–డివిజన్ స్థాయిలో మహిళా ఎస్‌ఐ ఉంటారు. పోలీస్ జిల్లాస్థాయిలో మహిళా సీఐ ఉంటారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. లోతుగా సమీక్షించి ఖరారు చేయనున్నారు. అనంతరం బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.
వారికి ఓ వరం..
ఆకాశంలో సగం అంటూ మహిళలను పొగుడుతూ వారి ఓట్లను రాబట్టుకోవడానికి ఇన్నాళ్లూ పార్టీలు ప్రయత్నం చేసేవి. అందుకు భిన్నంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వారి ఆత్మ విశ్వాసం పెంచేలా ఒకేసారి 15 వేల మంది మహిళా పోలీసులను నియమించడమే కాక వృత్తి పరంగా ఎదగడానికి చేయూత ఇవ్వడం మంచి పరిణామం. ఈ పదోన్నతుల ప్రక్రియ వారి పురోగతికి నిజంగా ఒక వరం అని చెప్పవచ్చు.
Also Read : Ycp Record Victories..రికార్డు విజయాలు వైసీపీ సొంతం