Idream media
Idream media
రాజస్తాన్ రాజకీయాలు రోజుకోరకంగా మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ యువ నేత, డిప్యూటీ సిఎం సచిన్ పైలట్ తిరుగుబాటు జెండా ఎగరవేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ తో విబేధాల నేపథ్యంలో సచిన్ పైలెట్ బిజెపిలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి కొన్ని గంటల ముందు సచిన్ పైలట్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బిజెపిలో చేరడం లేదని సోమవారం ఉదయం వెల్లడించారు. అయితే బిజెపి జాతీయ అధ్యక్షుడు జయ ప్రకాశ్ నడ్డాను కలవబోతున్నారన్న వార్తలను మాత్రం ఆయన ఖండించకపోవడం గమనార్హం.
ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ తో తీవ్రంగా విభేదించిన సచిన్ పైలట్.. బిజెపిలో చేరిపోతున్నారని వార్తలొచ్చాయి. అంతేకాక 30 మంది ఎమ్మెల్యేలు తనకు తోడుగా ఉన్నారన్నారు సచిన్ పైలెట్. కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తనకు మద్దతిస్తున్నారన్నారు. ప్రస్తుతం అశోక్ గహ్లోట్ ప్రభుత్వం మైనారిటీలో ఉందంటూ పైలట్ వాట్సాప్ గ్రూప్ నుంచి ఆదివారం అర్థరాత్రి ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఈ వార్తకు బలాన్నిచ్చే విధంగా బిజెపి యువ నేత జ్యోతి రాదిత్య సింధియాతో కూడా భేటీ అయ్యారు. అంతేకాక సచిన్ పైలట్ కు మద్దతుగా, కాంగ్రెస్ సీనియర్లను వ్యతిరేకిస్తూ జ్వోతిరాధిత్య సింథియా ట్విట్ చేశారు.
సోమవారం జైపూర్‌లో జరగనున్న కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ(సీఎల్పీ) భేటీలో సచిన్ పైలట్ పాల్గొనబోవడం లేదని తెలిపారు. దీంతో పైలట్ బిజెపిలో చేరుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. సోమవారం పైలట్ బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాతో భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో సచిన్ పైలెట్ బిజెపిలో చేరడం లేదంటూ అందరికి షాక్ ఇచ్చారు.
‘’109 మంది ఎమ్మెల్యేలు మా వెంటే’’
మరోవైపు సచిన్ పైలట్ తన వెంట 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించేసరికి…రాజస్థాన్ రాజకీయం అంకెల వైపు మళ్లింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తమ వెంట 109 మంది ఉన్నారని ప్రకటించారు. 200 అసెంబ్లీ స్థానాలు గల రాజస్థాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకు 101 మ్యాజిక్ ఫిగర్. అశోక్ గెహ్లాట్ కు 109 మంది సంతకం చేశారు. దీంతో సంక్షోభం దిశగా పయనిస్తున్న రాజస్తాన్ రాజకీయాల్లో ఎవరి బలాన్ని వారు ప్రకటిస్తున్నారు.
అయితే, తాజాగా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, రాజస్తాన్ వ్యవహారాల ఇన్‌చార్జ్ అవినాష్ పాండే సిఎం అశోక్ గహ్లోట్ ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని అంటున్నారు. ముఖ్యమంత్రికి 109 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సోమవారం తెల్లవారుజాము 2.30 గంటలకు పాండే వెల్లడించారు.
సిఎం గహ్లోత్ నివాసంలో ఆదివారం రాత్రి జరిగిన సమావేశంలో గహ్లోట్ నాయకత్వాన్ని బలపరుస్తూ వారంతా సంతకాలు కూడా చేశారని పేర్కొన్నారు. మరికొందరు ఇతర పార్టీల, స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా టచ్‌లో ఉన్నారని తెలిపారు. నేడు జైపూర్‌లో జరగనున్న కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) భేటీకి ఎమ్మెల్యేలంతా హాజరుకాలని విప్ జారీ చేసినట్టు ఆయన చెప్పారు.
మీటింగ్‌కు గైర్హాజరు అయినవారిపట్ల చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. నేటి కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ భేటీలో తాను పాల్గొనటం లేదని ఆదివారం వెలువడిన వాట్సాప్ సందేశంలో సచిన్ పైలట్ పేర్కొన్నారు. దీంతో పైలట్ బిజెపిలో చేరుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాగా, 200 మంది రాజస్తాన్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం 107 మంది, బిజెపికి 72 మంది సభ్యులున్నారు. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ)కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బిజెపికి మద్దతిస్తున్నారు. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. సిపిఎంకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు మద్దతిస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలున్న భారతీయ ట్రైబల్ పార్టీ (బిటిపి), ఒక ఎమ్మెల్యే ఉన్న రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) కూడా కాంగ్రెస్‌కే మద్దతిస్తున్నాయి.