Idream media
Idream media
అదేంటి..? ఉప్పు.. నిప్పుగా ఉన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ ఒక్కటి కాబోతున్నారని అనుకుంటున్నారా..? ఆ విషయం అయితే తెలీదు కానీ.. గెహ్లాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో మళ్లీ చేరేందుకు పైలెట్ వర్గం పావులు కదుపుతున్నట్లు మాత్రం స్పష్టంగా చెబుతున్నారు కొందరు కాంగ్రెస్ నాయకులు. గతనెలలో సచిన్ పైలట్‌తో పాటు 18 మంది రెబల్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌పై తిరుగుబావుటా ఎగరేసిన విషయం తెలిసిందే. రాజస్థాన్ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభం ఆరంభమై దాదాపు నెల దాటుతోంది. ఇంకో నాలుగు రోజుల్లో రాజస్థాన్ అసెంబ్లీ కూడా సమావేశం కాబోతోంది. గెహ్లాత్ వర్గం బలనిరూపణకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో రాజకీయంగా కొత్త వార్తలు వెలుగుకి వస్తున్నాయి.
తాజాగా ఆగస్టు 10 సోమవారం రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రలతో గంటన్నర పాటు సచిన్ పైలట్ సమావేశమైనట్లు తెలుస్తుండడంతో రాజస్థాన్ లో కాంగ్రెస్ సమస్య కొలిక్కి వచ్చనిట్లేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆగస్టు 14 నుండి జరిగే కీలకమైన రాజస్థాన్ అసెంబ్లీ సమావేశానికి ముందు, సచిన్ పైలట్… రాహుల్ గాంధీని,ప్రియాంక గాంధీని కలవడం కీలక పరిణామం. పలు అంశాలపై రాహుల్,ప్రియాంకతో పైలట్ చర్చించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని పార్టీలోని ఇద్దరు సీనియర్ లీడర్లు తెలిపారు. సచిన్ పైలట్ తో సమావేశాన్ని హైకమాండే స్వయంగా ప్రారంభించినట్లు సమాచారం. పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలందరూ తమ అసంతృప్తి పార్టీపైన కాదని, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ పైనేనని ఇప్పటికీ చెప్తున్నారు. సచిన్ పైలట్ పార్టీ నాయకత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని కొందరు కాంగ్రెస్ నాయకులు చెప్పారు. రాజస్థాన్‌లో ప్రభుత్వ సంక్షోభం పరిష్కరమవుతుందని పార్టీ హామీ ఇచ్చిందని బాహాటంగా అంటున్నారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా క్యాంప్ కు వెళ్తూ .. ప్రభుత్వం నుంచి తమకు వేధింపులు ఉన్నాయని ఆరోపించారు. సచిన్ పైలెట్ తీసుకున్ననిర్ణయం నిజమైతే ఈ వివాదాలన్నింటికీ చెక్ పడే అవకాశాలు ఉన్నాయి. దీనిని సచిన్ పైలెట్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.