గౌరవ డాక్టరేట్ అందించిన కర్ణాటక విశ్వ విద్యాలయం
ట్రీస్ ఆఫ్ మదర్(చెట్ల తల్లి)గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పర్యావరణవేత్త పద్మశ్రీ సాలుమరాద తిమ్మక్కకు మరో అరుదైన గౌరవం దక్కింది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఆమెకు గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. కర్ణాటక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ హెచ్ ఎం మహేశ్వరయ్య ఆమె స్వగృహానికి వెళ్లి ఆమెకు గౌరవ డాక్టరేట్ అందించారు. ఏమాత్రం చదువుకోకపోయినా ప్రకృతి ప్రేమికురాలిగా పర్యావరణ పరిరక్షకురాలిగా శతాధిక వయసులోనూ పలువురిలో స్ఫూర్తి నింపుతున్న తిమ్మక్కకు గౌరవ డాక్టరేట్ దక్కడంతో ప్రకృతి ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సాలుమరద తిమ్మక్క నేపథ్యం
సాలుమరద తిమ్మక్క 1911 లో కర్ణాటక రాష్ట్రంలోని తూముకూరు జిల్లా గుబ్బి తాలూకాలో హుబ్బి గ్రామంలో జన్మించారు. పదేళ్ల వయసులోనే ఆమెకు చిక్కయ్యతో వివాహం అయింది. కాగా వారికి సంతానం కలగకపోవడంతో హులికల్ – కుడూరు రహదారి పక్కన నాలుగు కిలోమీటర్ల మేర చెట్లను నాటుతూ వచ్చారు. వాటిని సొంత బిడ్డల్లా సాకుతూ సుమారు 400 మర్రిచెట్లను, 8000 కు పైగా మొక్కలను నాటారు. వారు నాటిన మొక్కలతో నాలుగు కిలోమీటర్ల మేర చిన్నపాటి అడవి ఏర్పడింది. మర్రి చెట్లు రహదారి పక్కనే పెరిగి ప్రజలకు నీడనివ్వడమేకాకుండా ప్రకృతి సమతౌల్యానికి ఎంతో ఉపయోగపడ్డాయి.
కాగా మొక్కలనే తమ కన్న బిడ్డలుగా సాకుతున్న సాలుమరద తిమ్మక్కకు 2016లో ప్రపంచ ప్రఖ్యాత వార్త సంస్థ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంత స్ఫూర్తిదాయకమైన వారిలో ఒకరిగా తిమ్మక్కను గుర్తించింది. పలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అవార్డులు ఆమె కీర్తి కిరీటంలో చేరిపోయాయి. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే పౌర పురస్కారం పద్మశ్రీ అవార్డు ఆమెకు 2019లో దక్కింది. పద్మశ్రీ అవార్డు రాష్ట్రపతి నుండి అందుకునే క్రమంలో ఆమె రాష్ట్రపతికి అభివాదం చేయకుండా ఆయన తలపై చేయి ఉంచి ఆశీర్వదించడం అప్పట్లో చర్చనీయాంశం అయింది.
కాగా స్ఫూర్తి దాయకంగా నిలవడానికి చదువు అవసరం లేదని చాటి చెప్పి,నిస్వార్థంగా మొక్కలు నాటుతూ చెట్ల వరుసగా, చెట్ల తల్లిగా పేరుపొందిన తిమ్మక్కకు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక గౌరవ డాక్టరేట్ అందించడం ఆమెకు దక్కిన మరొక అరుదైన గౌరవంగా చెప్పుకోవచ్చు.. ఏ మాత్రం చదువుకోని తిమ్మక్కకు సాక్షాత్తు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అందించడం విశేషం. 108 సంవత్సరాల వయసులోనూ ఆమె ఇంకా మొక్కలను నాటుతూ పలువురిలో స్ఫూర్తిని రగిలిస్తూ ఉండటం గమనార్హం.