అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని అని మహానుభావులు మనసు కవి ఆత్రేయ గారు ఊరికే రాయలేదు. ఇండస్ట్రీలో జరిగే పరిణామాలకు ఇది అతికినట్టు సరిపోతుంది. రన్ రాజా రన్ లాంటి మీడియం బడ్జెట్ సినిమాతో పరిచయమైన దర్శకుడు సుజిత్ అతి తక్కువ టైంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సాహో లాంటి వందల కోట్ల బడ్జెట్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తుందని ఊహించి ఉండడు. అయితే దాని ఫలితం తేడాగా వచ్చింది కానీ అది కనక హిట్ అయ్యుంటే ఇప్పటికే మన తెలుగు నిర్మాతలందరూ ఇంటి ముందు క్యూ కట్టేవారు. అయితే సాహో ఇక్కడ కన్నా బెటర్ గా నార్త్ లో ఆడిందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
ఏడాది క్రితమే సుజిత్ చిరంజీవితో లూసిఫర్ రీమేక్ కోసం చాలా వర్క్ చేశాడు. కానీ స్క్రిప్ట్ విషయంలో ఎందుకనో మరి మెగాస్టార్ ని మెప్పించలేకపోయాడు. ఫలితంగా అందులో నుంచి హుందాగా బయటికి రావాల్సి వచ్చింది. అది కాస్తా వినాయక్ దగ్గరికి వెళ్లి అటు నుంచి ఫైనల్ గా మోహన్ రాజాకు లాక్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సుజిత్ ముంబైకి షిఫ్ట్ అయ్యాడనే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. జీ స్టూడియోస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించబోయే ఓ యాక్షన్ కం ఎమోషనల్ థ్రిల్లర్ కోసం సుజిత్ అక్కడికి మకాం మార్చాడని వాటి సారాంశం. ఓ రెండేళ్ల దాకా ఉండాల్సి రావొచ్చని తెలిసింది.
గత ఏడాదే పెళ్లి చేసుకున్న సుజిత్ అక్కడి ప్రాజెక్ట్ అయ్యాక మళ్ళీ ఇక్కడి సినిమాలు చేసే అవకాశం ఉంది. ఆ మధ్య గోపిచంద్ తో ఓ చిత్రం చేసే అవకాశం ఉందన్నారు కానీ అది ఆచరణలోకి రాలేదు. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా ఆసక్తి చూపిస్తున్నాడన్న న్యూస్ కూడా ప్రచారమయ్యింది. కానీ అదీ జరగలేదు. ఇలా అయితే లాభం లేదని మొత్తానికి బాలీవుడ్ రూట్ తీసుకున్నాడన్న మాట. ఇందులో హీరో హీరోయిన్లు ఎవరు తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆల్రెడీ బాలీవుడ్ టీమ్ లతో పని చేసిన అనుభవం ఉంది కాబట్టి సుజిత్ కు అక్కడ పెద్ద ఇబ్బందులేమీ ఉండవు. వచ్చే ఏడాది ఇతని సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది