iDreamPost
android-app
ios-app

విజయనగరం జిల్లాలో టీడీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా

  • Published Jul 17, 2021 | 7:27 AM Updated Updated Jul 17, 2021 | 7:27 AM
విజయనగరం జిల్లాలో టీడీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా

విజయనగరం జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే శోభా హైమవతి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను అధినేత చంద్రబాబుకు పంపినట్లు చెప్పారు. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆమె అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో సీనియర్లకు గుర్తింపు లేదని, కష్టపడేవారిని పక్కన పెడుతున్నారని శోభ ఆరోపించారు. ఆమె రాజీనామా ప్రకటన జిల్లా టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితి నేతలు ఒక్కొక్కరుగా జారిపోతుండటంతో మరింత దిగజారుతోందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెండు దశాబ్దాలుగా సేవలు

ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో శోభ హైమవతి తటస్థులు పార్టీలో చేరాలన్న చంద్రబాబు పిలుపు మేరకు 1999లో టీడీపీలో చేరారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎస్.కోట ఎస్టీ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అయితే 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి హవాలో కాంగ్రెస్ అభ్యర్థి కుంభా రవిబాబు చేతిలో ఓడిపోయారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్.కోట ఎస్టీ నుంచి జనరల్ కావడంతో శోభా హైమవతికి పోటీ చేసే అవకాశం లభించలేదు. అదే సమయంలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. 2013 స్థానిక సంస్థల ఎన్నికల్లో శోభ కుమార్తె స్వాతి రాణి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అయ్యారు. ఆమె పదవీ కాలం పూర్తి కావడం, 2019లో టీడీపీ రాష్ట్రంలో ఓడిపోవడంతో శోభ రాజకీయంగా సైలెంట్ అయ్యారు.

పట్టించుకోని అధిష్టానం

వైఎస్సార్సీపీ చేతిలో ఘోర ఓటమితో టీడీపీ అధికారం కోల్పోయినా.. పార్టీ సేవలో ఉన్న తమను అధిష్టానం పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి శోభలో చాలాకాలం నుంచి ఉంది. ఇందులోనే కొనసాగితే తన, తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందని భావించిన ఆమె పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే టీడీపీకి గుడ్ బై చెప్పారని అంటున్నారు. త్వరలో వైఎస్సార్సీపీలో చేరేందుకు ఆమె అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : ఆళ్లగడ్డలో పాత గొడవలు మళ్లీరేగుతున్నాయా?