iDreamPost
android-app
ios-app

భారత్‌కు చేరిన రష్యా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్..

భారత్‌కు చేరిన రష్యా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్..

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఏదైనా ఉందంటే అది కరోనా మహమ్మారియే. దీని గత్తర దెబ్బకు జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కోవిడ్ రక్కసిని అంతం చేసేందుకు పరిశోధనలలో తలమునకలై ఉన్నారు.

ఇక కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే కొన్ని దేశాలు తయారుచేసిన వ్యాక్సిన్‌ల ప్రయోగాలు కీలకదశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ (Sputnik V vaccine) మన దేశానికి చేరింది. భారత్‌లో రష్యా వ్యాక్సిన్ రెండు, మూడు విడతల క్లినికల్ ట్రయల్స్ హైదరాబాద్‌లోని ఫార్మా దిగ్గజ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నిర్వహించనుంది.ఈ మేరకు రెడ్డీస్ ల్యాబ్, రష్యా డైరెక్ట్​ ఇన్వెస్ట్​మెంట్​ ఫండ్​ (ఆర్డీఐఎఫ్​)ల మధ్య ఒప్పందం కుదిరింది.రష్యా వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు రెడ్డీస్ ల్యాబ్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతించింది.అందులో భాగంగా ఈనెల 15 నుంచి సుమారు 2 వేల మందిపై రెడ్డీస్ ల్యాబ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించి అనంతరం ట్రయల్స్‌ రిజల్ట్‌ను డీజీసీఐకి సమర్పిస్తుంది.

గత సెప్టెంబరులో డాక్టర్ రెడ్డీస్,ఆర్డీఐఎఫ్‌ల మధ్య భారతదేశంలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం భారత్‌లో రెగ్యులేటరీ ఆమోదం పొందిన తరువాత డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ కి ఆర్డీఐఎఫ్ 100 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్‌ను సరఫరా చేయనుంది. మొదట భారత్‌లో 3వ దశ ట్రయల్ మాత్రమే నిర్వహించాలని అనుకున్న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్కో) నిపుణుల కమిటీ(ఎస్ఇసి) ఆదేశాల మేరకు వరుసగా 2,3 దశల క్లినికల్ ట్రయల్ చేపట్టారు.

కాగా కరోనాపై పోరులో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ 92శాతం సమర్థవంతమైన ఫలితాలు ఇస్తోందని మాస్కో ప్రకటించడం గమనార్హం. ఇప్పటి వరకు జరిగిన క్లినికల్‌ ట్రయల్స్‌ ఆధారంగా కోవిడ్ బారిన పడకుండా ప్రజలను ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తున్నట్లు రష్యా ప్రకటించింది.స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ మధ్యంతర ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో ఈ వ్యాక్సిన్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.