మూడవ శాసనసభ సమావేశాలలో వేడి ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజులానే 5వ రోజైన శుక్రవారం కూడా వాడి వేడిగానే జరుగుతున్నాయి. గడిచిన నాలుగు రోజులు ఒకలా సమావేశాలు ప్రారంభమైతే, శుక్రవారం గొడవతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో చర్చ ప్రారంభంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ గురువారం టీడీపీ సభ్యులు ర్యాలీగా వస్తూ అసెంబ్లీ గేట్ వద్ద మార్షల్స్ తో గొడవ పడ్డ విషయంపై అసహహనం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు మార్షల్స్ పై పరుషంగా వ్యవహరించారని, భావి సీఎంగా టీడీపీ శ్రేణులు చెప్పుకొనే లోకేష్ ఒక మార్షల్ మెడను పట్టుకుని నెట్టివేస్తున్న దృశ్యాలను సభలో వీడియో ద్వారా ప్లే చేసి చూపించారు. భావి సీఎంగా చెప్పుకునే లోకేష్ కు ఇది తగునా అని ప్రశ్నించారు. పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు.
పేర్ని నాని వ్యాఖ్యలతో స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మైక్ అందుకున్నారు. మార్షల్స్ తమ సభ్యులపై చేసిన దాడి వీడియోలు కూడా చూపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేత, 14 ఏళ్లు సీఎం గా పని చేశారనే గౌరవం కూడా లేకుండా చేయి పట్టుకుని మెలితిప్పారని చెప్పారు. అదృష్టం కొద్ధి తాము అడ్డుకున్నామని,ఒకవేళ అడ్డుకోకపోతే అక్కడే ఉన్న డోర్ కు కొట్టుకుని చంద్రబాబు చేయి ఛిద్రమయ్యేదని అన్నారు. మేము ఏమైనా దొంగలమా మమ్మల్ని అలా నెట్టివేయడానికి, మేం16 నెలలు జైలులో ఉండి, చిప్పకూడు తినలేదని అచ్చెన్నాయుడు పౌరుషంగా మాట్లాడారు.
దీంతో ఒక్కసారిగా వైఎస్సార్సీపీ సభ్యులు పైకి లేచి, అచ్చెన్నాయుడుకు వార్నింగ్ ఇచ్చారు. మర్యాదగా మాట్లాడాలని హెచ్చరించారు. స్పీకర్ సీతారాం సైతం అచ్చెన్న వ్యాఖ్యలను ఖండిస్తూ, అచ్చెన్నాయుడు చేసిన అనవసర వ్యాఖ్యలను రికార్డ్ ల నుండి తొలగిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మైక్ అందుకున్న మినిస్టర్ కొడాలి నాని సభలో మర్యాదగా నడుచుకోవాలని, జగన్ జైలుకు వెళ్లిన విషయం టీడీపీ సభ్యులు చెపితే కానీ ప్రజలకు తెలియదా, అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. జగన్ తన నిజాయితీని నిరూపించుకోవడానికి న్యాయపోరాటం చేస్తున్నారు కానీ, చంద్ర బాబు లా స్టే లు తెచ్చుకోలేదని చురకలంటించారు.
ఎమ్మెల్యే కోటం రెడ్డి మాట్లాడుతూ సభలో చంద్రబాబు నాయుడు అంటే తనకు ఎంతో గౌరవమని, అలా అని ఆయన మూడు సార్లు సీఎంగా పని చేసారనో, సీనియార్టీ బట్టి కాదని, కేవలం సభలో వయసు రీత్యా ఆయన వయసులో పెద్దవారు కావడంతో ఆయనంటే తనకు గౌరవమని అన్నారు. సభలో చంద్రబాబు నాయుడు వ్యవహరించే తీరును చూసి మాలాంటి కొత్త ఎమ్మెల్యేలు ఎంతో నేర్చుకోవాలని అనిపించాలి కానీ, అయితే చంద్రబాబు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మరి ఆయన్ను చూసి మేము ఏమి నేర్చుకోవాలని అన్నారు. మార్షల్స్ పై దాడి విషయానికి సంంధించి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసి చర్యలు తీసుకుని, ప్రజా స్వామ్యం ఖూనీ కాకుండా కాపాడాలని డిమాండ్ చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
ఎమ్మెల్యే అర్తుర్ మాట్లాడుతూ మార్షల్స్ ను టీడీపీ సభ్యులు చాలా చీప్ గా చూస్తున్నారని, చీఫ్ మార్షల్ DSP పైస్థాయి క్యాడర్ కల అధికారి అని అన్నారు. అలాంటి చీఫ్ మార్షల్ ను అవమాన పరచడమే కాకుండా, దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి బుగ్గన మాట్లాడుతూ సభలో ముఖ్యమైన అంశాలు చాలా ఉన్నాయని, అవి పక్కనపెట్టి నిన్నటి విషయాలపై సమయం వృధా చేస్తున్నారని అన్నారు. నిన్న జరిగిన సంఘటనపై వీడియో ద్వారా దృశ్యాలను వీక్షించి తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం నిన్న జరిగిన సంఘటనపై సభలో వీడియోను ప్రదర్శించారు.