iDreamPost
iDreamPost
నర్సాపురం పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయితే ఆసక్తిగా మారే అవకాశంగా ఉంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న కనుమూరి రఘురామకృష్ణంరాజు మీద త్వరలో వేటు పడేందుకు అనుగుణంగా పరిణామాలు దారితీస్తున్నాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలిచినప్పటికీ, ఆ తర్వాత ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడం సీటుకి ఎసరుతెస్తోంది. ఈలోగానే తాను రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. ఫిబ్రవరిలో దానికి ముహూర్తం అని చెప్పేశారు. దాంతో నిజంగా వేటుపడుతుందా, ఆలోగా రాజీనామా చేస్తారా అనేది చూడాలి. రెండింటిలో ఏది జరిగినా నర్సాపురం పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమవుతాయి. ఉప ఎన్నికలకు వెళితే గెలిచే అవకాశాలు లేనందున వేటుపడకుండా సీటు కాపాడుకునే యత్నంలో రఘురామకృష్ణంరాజు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.
నర్సాపురం స్థానానికి ఎన్నికలు అనివార్యమయ్యే పరిస్థితి వస్తే మాజీ ఐఏఎస్ అధికారి టికెట్ ఆశిస్తున్నారు. గడిచిన పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరి, ఎంపీగా బరిలో దిగి ఓటమి పాలయిన ఎంజీవీకే భాను వైఎస్సార్సీపీ వైపు చూస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన కాంగ్రెస్ ని వీడారు. అసోంలోని తేజ్ పురి స్థానానికి పోటీ చేసిన ఈ రిటైర్డ్ ఐఏఎస్ ఓటమి పాలయ్యారు. అసోం ప్రభుత్వంలో ఆయన అడిషనల్ చీఫ్ సెక్రటరీ స్థాయి వరకూ పనిచేశారు. టీబోర్డు ఆఫ్ ఇండియా చైర్మన్ గా వ్యవహరించారు. ఆంధ్ర్రప్రదేశ్ కి చెందిన 1985 బ్యాచ్ ఈ ఐఏఎస్ అధికారి గతంలో ఏపీలోనూ కొంతకాలం డిప్యుటేషన్ పై పనిచేశారు. వైఎస్సార్ హయంలో సీఎంవోలో బాధ్యతలు నిర్వహించారు. దాంతో వైఎస్ కుటుంబంతో తనకున్న పరిచయాలను ఉపయోగించుకోవాలని ఆయన ఆశిస్తున్నారు. సొంత రాష్ట్రం నుంచి బరిలో దిగి పార్లమెంట్ లో అడుగుపెట్టే అవకాశాలను పరిశీలిస్తున్నారు.
కాపు కులానికి చెందిన ఎంజీవీకే భాను కుటుంబంలో పలువురు ఐఏఎస్ లుగా పనిచేశారు. దివంగత ఎంపీ ఐఏఎస్ గానూ పనిచేసిన రంగయ్యనాయుడికి భాను అల్లుడు కావడం విశేషం. మామ బాటలో బ్యూరోక్రాట్ గా రిటైర్ అయిన తర్వాత కాంగ్రెస్ లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. కానీ ఆపార్టీ మనుగడ మీద అనుమానాలతో వైఎస్సార్సీపీ వైపు అడుగులు వేస్తున్నారు. జగన్ ఊ అంటే త్వరలోనే కండువా కప్పుకునేందుకు ఆయన ఎదురుచూస్తున్నట్టు సమాచారం. నర్సాపురం పార్లమెంట్ స్థానంలో అవకాశం అడుగుతున్నట్టు తెలుస్తోంది. నర్సాపురంలో కాపులు సంఖ్య రీత్యా కీలకంగా ఉంటారు. రాజకీయంగా రాజుల ప్రాబల్యం ఉన్నప్పటికీ గతంలోనూ కాపులు ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు. దాంతో కాపులకు అవకాశం ఇవ్వాలని వైఎస్సార్సీపీ అధినేత ఆలోచిస్తే భానుకి ఛాన్స్ దక్కవచ్చని తెలుస్తోంది.
నర్సాపురం ఉప ఎన్నికలు జరగకపోయినా రాజ్యసభ అవకాశం గానీ లేదా వచ్చే సాధారణ ఎన్నికల్లోగానీ భాను కి అవకాశం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. దాంతో ఎంజీవీకే భాను వైఎస్సార్సీపీలో చేరే అవకాశాలు మెరుగయ్యాయి. కాంగ్రెస్ అధిష్టానంతో సన్నిహిత సంబంధాలున్న భాను ఆపార్టీని వీడడంతో ఇప్పుడు రాజకీయంగా సొంత రాష్ట్రంలో చేస్తున్న పరిణామాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి. కానీ నర్సాపురం పార్లమెంట్ సీటులో రఘురామకృష్ణంరాజుకి తగిన ప్రత్యర్థి అవుతారనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తుండడం విశేషం.